అత్యవసర రుణ హామీ పథకం 2023 మార్చి వరకు పొడిగింపు!

న్యూఢిల్లీ: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల(ఎంఎస్ఎంఈ)ల కోసం.. telugu latest news

Update: 2022-03-30 16:44 GMT

న్యూఢిల్లీ: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల(ఎంఎస్ఎంఈ)ల కోసం ప్రారంభించిన అత్యవసర క్రెడిట్ లైన్ హామీ పథకం(ఈసీఎల్‌జీఎస్)ను 2023, మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది. 2022-23 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రకటన అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిర్వహించిన బడ్జెట్ సంప్రదింపుల నుంచి సేకరించిన సూచనలను అనుసరించి ఈసీఎల్‌జీఎస్ పథకం కింద ఆతిథ్య, పౌరవిమానయాన, సంబంధిత సంస్థలకు కూడా ఈ ఉపశమనాన్ని కల్పించారు.

ఆతిథ్య, ప్రయాణ, పర్యాటక పరిశ్రమలోని కంపెనీలు ప్రస్తుతం అత్యధిక ఫండ్ ఆధారిత క్రెడిట్‌లో 50 శాతం వరకు రుణాలు తీసుకోవచ్చని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అలాగే, ఆతిథ్య, ప్రయాణ, పర్యాటక పరిశ్రమల నుంచి ఒక్కో ఎంఎస్ఎంఈ కంపెనీ గరిష్టంగా తీసుకునే రుణ పరిమితి రూ. 200 కోట్లుగా ఉంది. విమానయాన పరిశ్రమకు చెందిన కంపెనీలు తమ క్రెడిట్ బకాయిలో 50 శాతం వరకు రుణాలను తీసుకునే సౌకర్యం ఉంది. గతంలో ఈ పరిశ్రమలో ఒక్కో ఎంఎస్ఎంఈ గరిష్ట రుణ పరిమితిని రూ. 200 కోట్ల నుంచి రూ. 400 కోట్లకు పెంచిన సంగతి తెలిసిందే. 2022, మార్చి 25 నాటికి ఈసీఎల్‌జీఎస్ కింద మంజూరు చేసిన రుణాలు రూ. 3.19 లక్షల కోట్లను దాటాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Tags:    

Similar News