'ప్రజల జీవితాలతో ఆటలాడుతున్న ప్రభుత్వాలు: కాంగ్రెస్
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల జీవితాలతో ఆటలు ఆడుతున్నాయని
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల జీవితాలతో ఆటలు ఆడుతున్నాయని మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు బుధవారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిజామాబాద్ కలెక్టరేట్‌ను ముట్టడించారు. జిల్లా కాంగ్రెస్ భవన్ నుండి ర్యాలీగా బయలుదేరి కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ శ్రేణులను ప్రగతి భవన్ ప్రధాన ద్వారం వద్ద పోలీసులు నిలిపివేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ..ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను పక్కదారి పట్టిస్తున్నాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరలు పెంచి రైతుల నడ్డి విరిచింది అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ చార్జీలు ఆర్టీసీ చార్జీలు పెంచి పేదలపై మరింత భారాన్ని పెంచిందన్నారు. ఇలాంటి సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన ధరలను తగ్గించి ప్రజలకు, రైతులకు ఉపశమనం కలిగించాలని కోరారు. అనంతరం ఈ విషయం పై జిల్లా అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా సీనియర్ నాయకుడు, మాజీ ప్రభుత్వ విప్ ఈరవత్రి అనిల్, పీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్, అర్బన్ ఇన్చార్జి తాహెర్ బిన్ హందాన్, మాజీ ఎమ్మెల్సీ, రూరల్ ఇన్చార్జి భూపతిరెడ్డి, బాన్సువాడ ఇన్చార్జి కాసుల బాల్ రాజ్, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు కేశ వేణు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.