దిశ, వెబ్ డెస్క్: కర్ణాటకలోని ఉడిపి జిల్లాతో పాటు పలు జిల్లాల్లో మూతపడిన పాఠశాలను ప్రభుత్వం ప్రారంభించనున్నది. దీంతో సంబంధిత అధికారులు సోమవారం (ఫిబ్రవరి 14) నుండి ఫిబ్రవరి 19 వరకు అన్ని ఉన్నత పాఠశాలల చుట్టుపక్కల ప్రాంతాల్లో హిజాబ్‌పై గొడవల కారణంగా సెక్షన్ 144 కింద నిషేధాజ్ఞలను విధించారు. హిజాబ్ సంబంధిత వివాదం దృష్ట్యా మూసివేసిన పాఠశాలలను సోమవారం నుండి తెరుస్తున్నట్లు కర్ణాటక ప్రభుత్వం గతంలో ప్రకటించింది. ఈ ఆర్డర్ ఫిబ్రవరి 14 ఉదయం 6 గంటల నుండి ఫిబ్రవరి 19 సాయంత్రం 6 గంటల వరకు అమలులో ఉంటుంది.
ప్రభుత్వ ఆదేశం ప్రకారం, పాఠశాల చుట్టుపక్కల ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది జనం ఉండడానికి అనుమతి లేదు. నిరసనలు, ర్యాలీలతో సహా అన్ని రకాల సమావేశాలు నిషేధించింది. రెచ్చగొట్టే నినాదాలు, ప్రసంగాలు మరీ ముఖ్యంగా నిషేధించింది. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మాట్లాడుతూ, "10వ తరగతి వరకు ఉన్న ఉన్నత పాఠశాలలు ఫిబ్రవరి 14 నుంచి పునఃప్రారంభమవుతాయని, ఇప్పటికే అన్ని జిల్లాల డిప్యూటీ కమిషనర్, పోలీసు సూపరింటెండెంట్ అలాగే పబ్లిక్ ఇన్‌స్ట్రక్షన్ డిప్యూటీ డైరెక్టర్‌లు అల్లరల్లకు కారణమైయే పాఠశాలల్లోని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో శాంతి సమావేశాలు నిర్వహించాలని కోరారు. ఎలాంటి ఘటనలు జరగకుండా పాఠశాలలు ప్రశాంతంగా ప్రారంభం అవుతాయని నేను విశ్వసిస్తున్నాను" అని అన్నారు.