ఎమ్మెల్యేలకు ఆపిల్ ఐఫోన్లు.. సీఎం నిర్ణయంపై విమర్శలు

Update: 2022-02-24 03:01 GMT

జైపూర్ : 2022-23 బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాజస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీలో డిజిటల్ బడ్జెట్ కాపీ ప్రవేశపెడుతున్న సందర్భంగా ఒక్కో ఎమ్మెల్యేకు ఆపిల్ ఐఫోన్ -13 లేటెస్ట్ వెర్షన్ మొబైల్ ఫోన్లను బహుమతిగా అందించింది. రూ.75 వేల నుంచి లక్ష ఖరీదు ఉండే ఫోన్లను 250 వరకు కొనుగోలు చేసి ఒక్కో శాసనసభ సభ్యుడికి ఒక్కొక్కటి చొప్పున మొత్తం 200 ఫోన్లను అందజేసింది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తీసుకున్న నిర్ణయంపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

రాజస్థాన్ ప్రభుత్వం గతంలోనూ ప్రభుత్వ నిధులతో ఎమ్మెల్యేలకు ఖరీదైన ఆపిల్ ఐప్యాడ్స్, ల్యాప్‌టాప్స్ కొనుగోలు చేసి అందజేసి విమర్శల పాలైన విషయం తెలిసిందే. ఇదిలాఉండగా రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ బుధవారం 2022-23 సంవత్సరానికి గాను ఆరోగ్యం, విద్య, మౌలిక సదుపాయాలు, సామాజిక భద్రత, పర్యాటకం వంటి రంగాలపై ప్రధాన దృష్టి సారించి బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. గెహ్లాట్ దాదాపు 3 గంటల పాటు అసెంబ్లీలో సుదీర్ఘ ప్రసంగం చేశారు. పట్టణ ప్రాంతాల్లో 100 రోజుల ఉపాధి కల్పించే లక్ష్యంతో ఇందిరా గాంధీ పట్టణ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించినట్టు పేర్కొన్నారు. దీని కోసం రూ. 800 కోట్ల బడ్జెట్‌ను ప్రతిపాదించారు. కాగా, 2004 జనవరి 1న లేదా ఆ తర్వాత నియమితులైన ఉద్యోగులందరికీ వచ్చే ఏడాది నుంచి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని బడ్జెట్‌ ప్రసంగంలో వెల్లడించారు.

Tags:    

Similar News