మేకల తండాలో మేత కోసం వచ్చిన మేకల చోరీ..
దిశ, కారేపల్లి: కారేపల్లి మండల మేకల తండా లో గొర్రెలు, మేకల - Goat theft in Mahabubabad district
దిశ, కారేపల్లి: కారేపల్లి మండల మేకల తండా లో గొర్రెలు, మేకల పెంచుతూ జీవనం సాగిస్తున్న బాధితుల గొర్రెలు, మేకలను గ్రామస్తులు ఎత్తుకెళ్ళిన ఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం ములకలపల్లి గ్రామానికి చెందిన షేక్ సోందుసాబ్ కుటుంబం గొర్రెలు, మేకలను పెంచుతూ జీవనం సాగిస్తున్నారు. 180 జీవాలను మేత కోసం గుండాల ప్రాంతానికి తీసుకెళ్లి తిరిగి స్వగ్రామానికి వెళ్లుతున్న క్రమంలో సోమవారం రాత్రి గేటుకారేపల్లి హైస్కూల్ వద్ద బస చేశారు.
ఈ క్రమంలో వీధి కుక్కలు కాపర్లకు చెందిన కుక్కతో పోట్లాటకు దిగగా భయపడిన జీవాలు బస చేసిన ప్రాంతం నుండి మేకల తండా గ్రామానికి పరుగు తీశాయి. ఇదే అదునుగా భావించిన మేకల తండాకు చెందిన కొందరు యువకులు మేకలను, గొర్రెలను 30 శాల్తీలను బలవంతంగా ఎత్తుకెళ్ళి దాచి పెట్టారు. కొందరు ఆటోలో జీవాలను ఇతర ప్రాంతాలకు పంపించి వేశారు. కాపర్లు కేకలు వేస్తున్నా.. పట్టించుకోకుండా యువకులు తమ పనిని కానిచ్చారు. దీనిపై బాధితుడు కారేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా మంగళవారం ఇంటింటికీ తిరిగి గాలించగా 6 మేకలు మాత్రమే లభించాయి. మేకల దొంగతనం విషయమై కారేపల్లి పోలీసులు విచారణ చేస్తున్నారు.