న్యూఢిల్లీ: ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ అన్నారు. రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి పనులు చేపడతామని ఆయన చెప్పారు. ఈ మేరకు జాతీయ మీడియాతో ఆయన మాట్లాడారు. 'ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్, బీజేపీలు చెరో 10 ఏళ్లు పాలించాయి. గోవాలో కాంగ్రెస్ 27 ఏళ్లు, బీజేపీ 15 ఏళ్లు అధికారంలో ఉన్నాయి. రెండు పార్టీలు గోవా, ఉత్తరాఖండ్ ప్రజలను దోచుకున్నాయి. మీరు మరోసారి వారికే ఓటు వేస్తే దోపిడీ జరుగుతూనే ఉంటుంది. ఈ సారి కొత్త పార్టీ ఆప్ ఉంది. మేము సంక్షేమం, అభివృద్దిని అందిస్తాం. మాకు ఒక్క అవకాశమివ్వండి' అని అన్నారు. తమ అధికారంలో ఢిల్లిలో విద్య, ఆరోగ్యం, విద్యుత్‌తో పాటు పలు రంగాల్లో అభివృద్ధి చేశామని అన్నారు. అదే అభివృద్దిని రెండు రాష్ట్రాల్లోనూ చేసి తీరుతామని చెప్పారు. అంతేకాకుండా రెండు రాష్ట్రాల్లో ఉద్యోగ కల్పన చేపట్టి, వలసలు ఆపేందుకు కృషి చేస్తామన్నారు. గోవా ఆప్ సీఎం అభ్యర్థి అమిత్ పాలేకర్ నిజాయితీ గల వ్యక్తి అని అన్నారు. ఆయనకు ఎలాంటి అవినీతి మచ్చలేదని నొక్కిచెప్పారు. ఇక ఉత్తరాఖండ్ సీఎం అభ్యర్థి అజయ్ కొథియాల్ ఆర్మీలో చేరేందుకు ఉచిత శిక్షణ ఇచ్చారని అన్నారు.