గడ్డి అన్నారం మార్కెట్‌పై ప్రభుత్వ చర్యలు దురదృష్టకరం : హైకోర్టు
కొత్తపేటలోని గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కూల్చివేత పనులను తక్షణం ఆపేయాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది.
దిశ, తెలంగాణ బ్యూరో : కొత్తపేటలోని గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కూల్చివేత పనులను తక్షణం ఆపేయాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. హడావిడిగా ప్రభుత్వం కూల్చివేతకు పాల్పడడం దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. ఈ విషయమై ఈ నెల 14న జరిగే విచారణకు హాజరుకావాలని వ్యవసాయ శాఖ కమిషనర్ (ముఖ్య కార్యదర్శి ), మార్కెటింగ్ శాఖ డైరెక్టర్‌ను ఆదేశించింది. తెల్లవారుజాము నుంచి మార్కెట్ కూల్చివేత పనులు ప్రారంభం కావడంపై వ్యాపారులు, కమిషన్ ఏజెంట్లు దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం విచారించిన చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ నేతృత్వంలోని బెంచ్ పై ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఉత్తర్వులను వెలువరించిన కూల్చివేతలను కొనసాగించడాన్ని సవాలు చేస్తూ వ్యాపారులు ధిక్కరణ పిటిషన్‌ను దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌పై ఈ నెల 14న మళ్లీ విచారణ జరగనున్నది. కూల్చివేత వ్యవహారంపై వ్యాపారుల తరఫు న్యాయవాది గంగయ్య నాయుడు వాదిస్తూ, గడ్డి అన్నారం మార్కెట్‌ను తెరవాల్సిందిగా హైకోర్టు ఫిబ్రవరి 8న ఆదేశాలు జారీ చేసిందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ నెల 4వ తేదీ వరకు తెరవలేదని పేర్కొన్నారు. కోర్టు ఆదేశాలను ప్రభుత్వం ధిక్కరించిందని వివరించారు. ఈ నెల 4వ తేదీన మరోసారి హైకోర్టు ఆదేశించడంతో ప్రభుత్వం తెరిచిందని, వ్యాపారులు వారి దుకాణాల్లోని సామాన్లను తరలించుకునేందుకు సమయం లేకుండానే ప్రభుత్వం కూల్చివేతలను మొదలుపెట్టిందన్నారు. కోర్టు ఆదేశాలను బేఖాతరు చేసిన ప్రభుత్వం వ్యాపారులకు, కమిషన్ ఏజెంట్లకు ఇబ్బంది కలిగిస్తున్నదని పేర్కొన్నారు. నిజానికి సామాన్లను తరలించుకోడానికి కోర్టు నెల రోజుల గడువు ఇచ్చినా ప్రభుత్వం ఈ మార్కెట్‌ను తెరవకపోవడంతో తరలింపు సాధ్యం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం తరఫు న్యాయవాది జోక్యం చేసుకుని, ఈ మార్కెట్‌లో మొత్తం 106 మంది కమిషన్ ఏజెంట్లు ఉన్నారని, అందులో 76 మంది ఖాళీ చేసి వెళ్ళిపోయారని కోర్టుకు వివరించారు. రెండు రోజుల పాటు ఇచ్చిన గడువు పూర్తికావడంతోనే కూల్చివేత పనులను మొదలుపెట్టినట్లు వివరించారు. ఈ వివరణతో సంతృప్తి చెందని హైకోర్టు బెంచ్ ఈ నెల 14న జరిగే విచారణకు వ్యవసాయ శాఖ కమిషనర్ రఘునందన్‌రావుతో పాటు మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది.
ప్రస్తుతం గడ్డి అన్నారం మార్కెట్ స్థలంలో ప్రభుత్వం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించాలనుకుంటున్నది. త్వరలో దానికి శంకుస్థాపన కూడా చేయాలని భావిస్తున్నది. కోహెడలో పూర్తిస్థాయిలో శాశ్వతంగా మార్కెట్‌ను తీర్చిదిద్దేంతవరకు గడ్డి అన్నారం మార్కెట్ వ్యాపారులకు బాటసింగారంలోని లాజిస్టిక్ పార్కులో వ్యాపారాలు చేసుకోడానికి అవకాశం కల్పించింది. అదే విషయాన్ని మార్కెటింగ్ శాఖ వర్గాలు కూడా వ్యాపారులకు, కమిషన్ ఏజెంట్లకు వివరించాయి.