టెస్ట్ ఫార్మాట్‌లోనే అసలు మజా.. 100వ మ్యాచ్ ఆడతానని అనుకోలేదు: విరాట్ కోహ్లీ
మొహాలీ : టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన కెరీర్‌లో 100వ టెస్టు మ్యాచ్ ఆడబోతున్నాడు. శ్రీలంకతో జరిగే తొలి టెస్టుతో కోహ్లీ ఈ మైలురాయిని అందుకోనున్నాడు. ఇందుకు మొహాలీలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఐఎస్ బింద్రా స్టేడియం వేదికకానుండగా.. నేటి నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ క్రమంలో బీసీసీఐ టీవీ తో మాట్లాడిన కోహ్లీ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. తాను 100వ టెస్ట్ మ్యాచ్ ఆడతానని అస్సలు ఊహించలేదని, ఆ దేవుడి దయ, ఫిట్‌నెస్ కాపాడుకోవడానికి తాను పడ్డ శ్రమే ఈ ఘనత అందుకునేలా చేశాయని పేర్కొన్నాడు. అభిమానులంతా టెస్ట్ క్రికెట్ మజాను ఆస్వాదించాలని, తన దృష్టిలో టెస్టు ఫార్మాటే అసలు సిసలు క్రికెట్ అని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు. 'కెరీర్‌లో 100వ టెస్టు ఆడటం స్పెషల్ మూమెంట్. చాలా గొప్పగా ఫీలవుతున్నా. నాతో పాటు నా కుటుంబం, కోచ్ గర్వపడే విషయం' అని కోహ్లీ చెప్పాడు. ప్రతి మ్యాచ్‌లో ఎక్కువ సేపు బ్యాటింగ్ చేయాలనే ఆలోచిస్తానని, అలా ఆడినప్పుడే ఓ క్రికెటర్ సత్తా తెలుస్తుందని తెలిపాడు. 'సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడటాన్ని ఎంజాయ్ చేస్తా. సెషన్ బై సెషన్ బ్యాటింగ్ చేయడమంటే నాకు మజా. చిన్నప్పటి నుంచే పెద్ద స్కోర్లు చేయాలనుకునేవాడిని. ఎప్పుడూ చిన్న స్కోర్ గురించి ఆలోచించలేదు. ఆ ఆలోచనే నన్ను ఎక్కువ పరుగులు చేసేలా చేసింది. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోకి రాకముందే జూనియర్ క్రికెట్‌లోనే 7 నుంచి 8 డబుల్ సెంచరీలు బాదాను' కోహ్లీ గుర్తు చేశాడు.