వైసీపీ దళిత ఎమ్మెల్యేలపై ఘాటు వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత
దిశ, ఏపీ బ్యూరో: 'వైఎస్ జగన్ పాలనలో దళిత - Former Minister KS Jawahar comments on ys jagan governance
దిశ, ఏపీ బ్యూరో: 'వైఎస్ జగన్ పాలనలో దళిత సంక్షేమం దారుణంగా దగాకు గురవుతోంది. మేడిపండు చందంగా మారి, దళిత యువతను వంచనకు గురిచేస్తోంది' అని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కేఎస్ జవహర్ ఆరోపించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడారు. మాదిగ, రెల్లి, మాల కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి వాటి ద్వారా రూపాయి ఖర్చు పెట్టలేదు. ఆయా కార్పొరేషన్ల చిరునామాలు ఎక్కడున్నాయో.. చైర్మన్ ఎక్కడ ఉన్నారో కూడా తెలియని దుస్థితి. ఎస్సీ కార్పొరేషన్‌ను ఒకేవర్గం చేతిలోపెట్టి, మాదిగ, మాల, రెల్లికులాలను జగన్ రెడ్డి దారుణంగా వంచించాడు.
లిడ్ క్యాప్ కార్పొరేషన్‌కు కాకుమాను రాజశేఖర్ అనే నోరులేని వ్యక్తిని చైర్మన్‌ను చేసి, చర్మకారులకు దక్కాల్సిన భూముల్ని ఆక్రమించుకుంటున్నారు. బడ్జెట్‌లో రెడ్డి, కమ్మ, వైశ్య కార్పొరేషన్లకు నిధులుకేటాయించిన జగన్ రెడ్డి, మాల,మాదిగ, రెల్లి కార్పొరేషన్లకు రూపాయి కేటాయించలేదు.
ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నుంచి కేటాయింపులు చేస్తామని చెబుతున్న ముఖ్యమంత్రి, అసలు ఆ సబ్ ప్లాన్ నిధులు కూడా దళితులకు దక్కకుండా చేస్తున్నాడు. అధికార మదంతో విర్రవీగుతున్న మాల, మాదిగ, వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు తమ స్వార్థం కోసం ఆఖరికి జాతులనే తాకట్టు పెడుతున్నారు అని మాజీ మంత్రి కేఎస్ జవహర్ ఆరోపించారు.
వైసీపీ దళిత ఎమ్మెల్యేలు జాతిని తాకట్టు పెట్టవద్దు..
రాష్ట్రంలో మాదిగ, మాల, రెల్లి, చర్మకారుల కార్పొరేషన్ల కార్యాలయాలు, అడ్రస్‌లు ఎక్కడున్నాయో ఎవరికైనా తెలుసా? మాల, మాదిగ, రెల్లి, చర్మకార విద్యార్థులకు, యువతకు జగన్ సరైన విద్య కూడా లేకుండా చేస్తున్నాడు. దళితులకు విద్యనందించే ప్రభుత్వ పాఠశాలలను మూయిస్తూ, నూతన విద్యా విధానం పేరుతో ముఖ్యమంత్రి వారిని నట్టేట్లో ముంచాడు.
దళితుల సంక్షేమం మరిచిన ముఖ్యమంత్రి, మాల, మాదిగ, రెల్లి కార్పొరేషన్లకు కేటాయించాల్సిన నిధులను నవరత్నాలకు మళ్లిస్తున్నాడు. నిధులు మళ్లించడానికి ఈ ముఖ్యమంత్రికి దళితులే దొరికారా? రెడ్లు, కమ్మలు, వైశ్యులకు కేటాయించిన నిధుల్ని నవరత్నాలకు మళ్లించే ధైర్యం ముఖ్యమంత్రి ఎందుకు చేయలేకపోతున్నాడు? కేవలం జగన్‌రెడ్డి తనపబ్బం గడుపుకోవడానికే రాజకీయాలు చేస్తున్నాడు. సంక్షేమాన్ని మరిచిన జగన్ రెడ్డి కర్రసాము చేస్తున్నాడు.
జగన్ రెడ్డి పాలనలో సంక్షేమం చంకనాకి పోయి.. అంతా సంక్షోభమే మిగిలింది. కులాల పేరు చెప్పి పదవులు పొంది బుగ్గకార్లలో తిరుగుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతరులు అంతా ఇప్పటికైనా తమ తమ వర్గాలకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి పై ఒత్తిడి తేవాలి అని డిమాండ్ చేస్తున్నాం.
టీడీపీ హయాంలో చంద్రబాబు నాయుడు డప్పు కళాకారులు, చర్మకారులకు కూడా పింఛన్లు, రుణాలు ఇచ్చారు . దళిత బిడ్డలు ఉన్నత విద్య అభ్యసించి, మంచి స్థానాలకు వెళ్లాలని భావించిన చంద్రబాబు బెస్ట్ అవైలబుల్ స్కూళ్లను తీసుకొచ్చాడు. అంబేద్కర్ విదేశీ విద్య పథకం తో ఎందరో దళిత యువతను ఉన్నత విద్య కోసం విదేశాలకు పంపాడు.
దళిత జాతిని కాపాడటం కోసం తనవంతు కర్తవ్యాన్ని ఆనాడు చంద్రబాబు పోషించారు. దళిత క్రైస్తవుల సంక్షేమాన్ని కూడా జగన్ రెడ్డి విస్మరించాడు. ముందడుగు వంటి గొప్ప పథకాన్ని ఈ ముఖ్యమంత్రి నిలిపేయడం దుర్మార్గం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి దళితులకు పనికొచ్చే కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
దళిత సంక్షేమాన్ని విస్మరించి, వారిని తొక్కేయాలని చూసిన ఎందరో పాలకులు కాలగర్భంలో కలిసిపోయారనే వాస్తవాన్ని జగన్ ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. దళితసంక్షేమాన్ని విస్మరించిన జగన్ రెడ్డి, చరిత్రలో దళిత వ్యతిరేకి గా తనకంటూ ఒక ప్రత్యేక పేజీని లిఖించుకోబోతున్నాడు అని మాజీ మంత్రి కేఎస్ జవహర్ ఎద్దేవా చేశారు.