ఆ మాజీ మంత్రి భేటీల వెనుక రహ్యసం.. ఏమిటి?

దిశ ప్రతినిధి, ఖమ్మం: టీఆర్ఎస్ పార్టీలోని - Former minister Jupally Krishna Rao meets other leaders in Khammam district

Update: 2022-03-08 14:33 GMT

దిశ ప్రతినిధి, ఖమ్మం: టీఆర్ఎస్ పార్టీలోని అసంతృప్తులు ఏకం అవుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే దాదాపు అన్ని జిల్లాల్లో ఈ జాబితా పెరిగిపోగా.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం పొంగులేటికి జరుగుతున్న అవమానాన్ని ఆయన అభిమానులు ఏమాత్రం సహించలేకపోతున్నారు. శీనన్నను వదులుకుంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పుట్టి మునగడం ఖాయం అంటూ ఇటీవల పీకే సర్వే రిపోర్ట్ పేరిట సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నాగర్ కర్నూల్ జిల్లాలో బలమైన నాయకుడు, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మంగళవారం ఉదయం మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సాయంత్రం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తో భేటీ అయినట్లు సమాచారం.

వీరితో పాటు జిల్లాకు చెందిన పిడమర్తి రవి, మువ్వా విజయ్ బాబు, తుళ్లూరి బ్రహ్మయ్య సహా ఇతర ముఖ్య నేతలు కూడా ఈ భేటీలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. వీరందరూ తమ భవిష్యత్ కార్యాచరణపై మాట్లాడుకున్నట్లు తెలిసింది. భవిష్యత్ లో ఇదే పార్టీలో కొనసాగాలా..? లేక ఏదైనా నిర్ణయం తీసుకోవాలా..? అనే విషయమై సమాలోచనలు చేసినట్లు తెలుస్తోంది. పీకే సర్వేలో పొంగులేటి తో పాటు పాలేరులో తుమ్మలకు, కొల్హాపూర్ లో జూపల్లికి అనుకూలంగా తేలినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో జూపల్లి ఖమ్మం వచ్చి మరీ మాజీ మంత్రి, మాజీ ఎంపీలతో భేటీ వెనుక ఏదైనా నిర్ణయం జరిగి ఉంటుందా..? అనే చర్చ మొదలైంది.

పొంగులేటికి ఎన్నో అవమానాలు..


పొంగులేటికి గత పార్లమెంట్ ఎన్నికల్లో సీటివ్వకుండా నామాను టీఆర్ఎస్ లో చేర్చుకుని మరీ ఖమ్మం ఎంపీ స్థానాన్ని ఆయనకు కేటాయించారు. దీంతో అప్పటి నుంచి పొంగులేటికి పార్టీకి మధ్య గ్యాప్ ఏర్పడింది. ఈ క్రమంలోనే పార్టీలోని కొంతమంది నేతలు శ్రీనివాసరెడ్డిని పనిగట్టుకుని టార్గెట్ చేయడం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ మారాల్సిందిగా గతంలో ఆయన అభిమానులు ఎన్నిసార్లు ఒత్తిడి చేసినా శ్రీనివాస రెడ్డి మాత్రం సంయమనం పాటిస్తూ వచ్చారు. ఒకానొక దశలో పార్టీ మారినట్లు కూడా వార్తలు వస్తే.. వీటిని పొంగులేటి కొట్టివేయడం గమనార్హం. అయితే ఇటీవల జరిగిన పరిణామాలతో మాజీ ఎంపీ సహా ఆయన అభిమానులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. చిన్నచితకా నాయకులు సైతం తమను టార్గెట్ చేయడం సహించలేక పోతున్నట్లు తెలిసింది. మరి ఇప్పుడు టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు జూపల్లి కృష్ణారావు భేటీ కావడంతో తీవ్ర చర్చకు దారితీస్తోంది.

తుమ్మలతోనూ..

జూపల్లి మంగళవారం ఉదయం తుమ్మలతోనూ భేటీ అయినట్లు తెలుస్తోంది. అయితే పార్టీలో తమకు జరిగిన అన్యాయం, ప్రాధాన్యత తగ్గించి జూనియర్లకు ప్రాధాన్యత ఇవ్వడం పై చర్చించినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. వచ్చే ఎన్నికల వరకు భవిష్యత్ కార్యాచరణ ఏంటో కూడా మాట్లాడుకున్నట్లు సమాచారం. ఒకవేళ టీఆర్ఎస్ నుంచి టికెట్ వచ్చే పరిస్థితి లేకపోతే ఏం చేయాలి అనే దానిపై సమాలోచనలు జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. ఇద్దరు సీనియర్లు, అది అధికార పార్టీలోని అసంతృప్తులు భేటీ కావడంతో తీవ్ర చర్చకు దారితీసింది.

జూపల్లి వెయిటింగ్..

జూపల్లి కృష్ణారావు సైతం టీఆర్ఎస్ లో సీనియర్ నేత. నాగర్ కర్నూల్ జిల్లా కొల్హాపూర్ నియోజకవర్గం నుంచి 2018 ఎన్నికల్లో ఓడిపోయారు. తనను కావాలనే ఓడించి కాంగ్రెస్ అభ్యర్థి బీరం హర్షవర్ధన్ రెడ్డిని పార్టీలో చేర్చుకున్నారని అప్పట్లో ప్రచారం జరిగింది. ఈ క్రమంలో అప్పటి నుంచి నియోజకవర్గంలో పార్టీ రెండు గ్రూపులుగా విడిపోయింది. ఈ నేపథ్యంలో పార్టీ పెద్దలు కూడా జూపల్లి కృష్ణరావును దూరం పెడుతూ వచ్చింది. గతంలో పార్టీపై ఎన్నో సంచలన వ్యాఖ్యలు చేసిన జూపల్లి వార్తల్లో నిలిచారు. అయితే ఈ నేత ఇప్పుడు ఖమ్మం వచ్చి పొంగులేటి, తుమ్మలతో భేటీ కావడం వెనుక ఏదో జరిగే ఉంటుందనే చర్చ మొదలైంది. వీరిద్దరూ తీసుకునే నిర్ణయం కోసం జూపల్లి వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా వారితో జూపల్లి పయనించేందుకు రెడీగా ఉన్నట్లు సమాచారం.

మరికొంత మంది పొంగులేటి టచ్ లోకి..?

దాదాపు అన్ని జిల్లాల్లోని నేతలతో పొంగులేటికి మంచి సంబంధాలు ఉన్నాయి. అయితే పార్టీలో చాలా మంది సీనియర్లు అసంతృప్తిగా ఉన్న నేపథ్యంలో కొన్ని జిల్లాల్లో మరికొంత మంది నేతలు పొంగులేటికి టచ్ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరిలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. ప్రస్తుతంగా ఎమ్మెల్యేలుగా ఉండి వచ్చే ఎన్నికల్లో సీట్లు రావనుకునే వారు కూడా టచ్ లోకి వస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఈ ముగ్గురు సీనియర్లు భవిష్యత్తులో ఏదైనా నిర్ణయం తీసుకుంటే దాదాపు అన్ని జిల్లాల నుంచి అసంతృప్తులు భారీగా కదిలే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Tags:    

Similar News