ప్రీమియర్ ఫ్యాషన్ షోకు ఫస్ట్ ఇండియన్ గర్ల్.. వైకల్యాన్ని అధిగమించి
దిశ, ఫీచర్స్ : సంపూర్ణ ఆరోగ్యవంతులు తమకు నచ్చిన రంగంలో విజయం సాధిస్తే అది సాధారణ విషయమే..Latest Telugu News
దిశ, ఫీచర్స్ : సంపూర్ణ ఆరోగ్యవంతులు తమకు నచ్చిన రంగంలో విజయం సాధిస్తే అది సాధారణ విషయమే. కానీ అంగ వైకల్యాన్ని, అవరోధాలను అధిగమిస్తూ ప్రతికూల పరిస్థితుల్లో గెలుపొందినవారే ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచిపోతారు. డౌన్ సిండ్రోమ్‌తో బాధపడుతున్న బెంగళూరు యువతి రిజా రెజీ కూడా ఇదే కోవకు చెందుతుంది. ప్రతిభా పాటవాలకు వైకల్యాన్ని అడ్డుగా భావించని రిజా.. ప్రీమియర్ ఫ్యాషన్ షోకు ఎంపికైన తొలి భారతీయురాలిగా గుర్తింపు పొందింది.
23 ఏళ్ల రిజా రెజీ.. నవంబర్ 12న కొలరాడోలో గ్లోబల్ డౌన్ సిండ్రోమ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరగనున్న 'బి బ్యూటిఫుల్, బి యువర్ సెల్ఫ్' ఫ్యాషన్ షోలో పాల్గొనేందుకు ఎంపికైంది. కాగ్నిటివ్ హెల్త్ సమస్యలపై పరిశోధనకు నిధులు సేకరించేందుకు ప్రతి ఏటా ఈ షో నిర్వహిస్తారు. ఫిబ్రవరి 2022లో జరిగిన ఆన్‌లైన్ ఆడిషన్‌లో వ్యక్తిత్వానికి సంబంధించిన ప్రశ్నలు, ర్యాంప్ వాక్‌లో తన నైపుణ్యాలతో అబ్బురపరిచిన రిజా.. వార్డ్‌రోబ్ కోసం ఇండో-వెస్ట్రన్ ఫ్యూజన్‌ను ఎంచుకుంది.
ఇంటర్వ్యూలో మాట్లాడిన రిజా.. 'ట్రైనింగ్ డ్యాన్సర్‌గా వర్క్ చేస్తూ ఫ్యాషన్ షో కోసం ప్రాక్టీస్ చేయడం ప్రారంభించాను. ఈ షో కోసం సెలెక్ట్ కావడం సంతోషంగా ఉంది' అని తెలిపింది. ఇక వికలాంగుల సంక్షేమం కోసం 'బ్యూటిఫుల్ టుగెదర్' ఇన్‌స్టిట్యూట్ నెలకొల్పిన రిజా తల్లి అనితా రెజీ.. తన కూతురు మాటల్లో చురుగ్గా ఉంటుందని, ఏ విషయమైనా నిక్కచ్చిగా చెబుతుందన్నారు. తన వైకల్యాన్ని అస్సలు దాచుకోదని తెలియజేశారు. తండ్రి వహీద్ మట్లాడుతూ.. 'దివ్యాంగులు మన మధ్యే ఉన్నారు. ప్రతి బిడ్డలోనూ ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది. దానిని అర్థం చేసుకోవాలి. వారిని సాధారణ వ్యక్తులతో సమానంగా చూస్తే మరింత ప్రతిభావంతులుగా మారతారు' అని పేర్కొన్నారు.