కోతులకూ ఫ్యామిలీ ప్లానింగ్సెంటర్లు
కోతుల కుటుంబ నియంత్రణకు జిల్లాకో ఫ్యామిలీ ప్లానింగ్సెంటర్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.
దిశ, తెలంగాణ బ్యూరో: కోతుల కుటుంబ నియంత్రణకు జిల్లాకో ఫ్యామిలీ ప్లానింగ్సెంటర్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఆ సెంటర్లలో కోతులకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్లు నిర్వహిస్తారు. వీటిలో ప్రత్యేకంగా ట్రైనింగ్పొందిన వెటర్నరీ డాక్టర్లను నియమిస్తారు. పైలెట్ ప్రాజెక్ట్ కింద ఇప్పటికే నిర్మల్‌లో కొనసాగుతున్నది. సుమారు ఐదు వేల కోతులకు ఆపరేషన్లు చేసినట్లు తెలిసింది. ప్రయోగాత్మక కార్యక్రమం పూర్తి కాగానే అన్ని జిల్లాల్లో ఈ ఆపరేషన్లు నిర్వహిస్తామని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈ మేరకు కేంద్రాలు, అవసరమైన సామాగ్రీ, పరికరాలను కూడా సర్కార్ కొనుగోలు చేసింది.
ఎందుకీ నిర్ణయం...?
కోతుల దాడులతో పంటలు తీవ్రంగా నష్టపోతున్నాయి. చాలా ప్రాంతాల్లో చేతికొచ్చిన పంటలను కోతుల దండు నాశనం చేయడం వలన రైతులు నానా అవస్థలు ఎదుర్కొంటున్నారు. పంట ఉత్పత్తి ఆదాయం రాక అప్పులు పాలవుతున్నారు. చాలా మంది మనోవేదనతో ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్న సందర్భాలున్నాయి. దీంతో రైతుల ఇబ్బందులను పరిష్కరించాలని గతంలో సర్కార్ ఓ కమిటీ వేసింది. వీరు కోతుల నియంత్రణకు చట్టపరిధిలో ఉండే ఇతర అవకాశాలను పూర్తి స్థాయిలో పరిశీలించారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కోతుల నియంత్రణకు అనుసరిస్తున్న విధానాలనూ కూడా స్టడీ చేశారు. ఎలాంటి సమస్యలు లేనందున నిర్మల్ లో పైలెట్ ప్రాజెక్టును నిర్వహిస్తున్నారు.
8 లక్షల కోతులకు...
రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 8 లక్షలకు పైగా కోతులున్నట్లు అధికారుల అంచనా. వీటికి జిల్లాల్లో ఏర్పాటు చేసే ఫ్యామిలీ ప్లానింగ్ సెంటర్లతో ఆపరేషన్లు నిర్వహించనున్నారు. అంతేగాక ఆపరేషన్లు చేసిన కోతులను ఆరోగ్య పరిస్థితులను బట్టి నాలుగైదు రోజులు ఆ కేంద్రంలోనే ఉండేలా సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. దీని వలన ఇన్ఫెక్షన్లు, సైడ్ ఎఫెక్ట్వంటి విషయాలను పరిశీలించవచ్చని వెటర్నరీ డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు. ఈ తర్వాత సదరు కోతులను అడవుల్లో వదిలేయనున్నారు. దీంతో పాటు అడవులు, జాతీయ రహదారులపై పండ్ల మొక్కలను పెంచనున్నారు. వాటికి ప్రత్యేకంగా రక్షించాల్సిన బాధ్యత అటవీ అధికారులు తీసుకోనున్నారు.