10 వేలకు పైగా చిన్నారులను సేవ్ చేసిన టెక్నాలజీ.. ఆసక్తికర స్టోరీ

దిశ, ఫీచర్స్ : 130 కోట్లకు పైగా జనాభా గల భారత్ కొవిడ్ వంటి విపత్తును సమర్థవంతంగా ఎదుర్కొని యావత్ ప్రపంచం.. Latest Telugu News..

Update: 2022-03-30 07:15 GMT

దిశ, ఫీచర్స్ : 130 కోట్లకు పైగా జనాభా గల భారత్ కొవిడ్ వంటి విపత్తును సమర్థవంతంగా ఎదుర్కొని యావత్ ప్రపంచం తిరిగి చూసేలా చేసింది. కానీ ఇప్పటికీ దేశంలో అనేక భద్రతా లోపాలున్నాయి. బడికి పోయిన పసివాడు, సరుకుల కోసం వెళ్లిన యువతి, పట్నం చేరిన మహిళ.. పేదలు, అనాథలు, అభాగ్యులు.. ఇలా ఎంతోమంది తిరిగి ఇంటికి చేరలేదని 'మిస్సింగ్' కేసు నమోదు చేస్తుంటాం. డబ్బు ఆశకు, మోసపూరితంగా.. మధ్యవర్తులు, మాయగాళ్ల చేతికి చిక్కి ఎంతోమంది బాలికలు, మహిళలు 'అక్రమ రవాణా'కు గురవుతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఈ తరహా బాధితుల్లో 28 శాతం పిల్లలు ఉన్నట్లు యునిసెఫ్‌ తెలిపింది. వాస్తవానికి లక్షమంది పౌరులకు 144 మంది పోలీసులే ఉన్నటువంటి వ్యవస్థలో పిల్లల్ని రక్షించడమెలా? తిరిగి తీసుకురావడమెలా? అందుకు సమాధానమే 'ఫేషియల్ రికగ్నిషన్' టెక్నాలజీ. ఇటీవలే 10 వేలకు పైగా చిన్నారులను కాపాడటంలో సాయపడ్డ ఈ సాంకేతికతపై స్పెషల్ స్టోరీ!


ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో 'హ్యూమన్ ట్రాఫికింగ్'‌ ఒకటి. తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపం, టీనేజ్‌లో శారీరక మార్పులపై అవగాహనలేమి, సోషల్ మీడియా ప్రభావం, చెడు స్నేహాలు, యుక్తవయసు ప్రేమలు, ఈజీ మనీ, సినిమా చాన్స్‌లు వంటి అనేక కారణాలు ఇందుకు దోహదపడుతున్నాయి. చిన్నారులు, యువతీ యువకులు, మహిళలు మోసగాళ్ల చేతిలో బలయ్యేలా చేస్తున్నాయి. ఈ క్రమంలో వేలాది మంది 'అక్రమ రవాణా'కు గురవుతుంటే.. కేవలం పదుల సంఖ్యలో కేసులు నమోదవుతుండటం గమనార్హం.

ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా 'చైల్డ్ కేర్ ఇన్‌స్టిట్యూషన్స్'లో నివసిస్తున్న మైనర్ల ఫోటోలను రిభు అనే చైల్డ్ లేబర్ యాక్టివిస్ట్(బచ్‌పన్ బచావో ఆందోళన్‌-ఎన్‌జీవో) కలెక్ట్ చేశాడు. వాటిని పోలీస్ డేటాబేస్‌‌లోని తప్పిపోయిన పిల్లల ముఖాలతో సరిపోల్చే పైలట్ ప్రోగ్రామ్‌ను గతేడాది ప్రారంభించాడు. ఇందుకోసం 'ఫేషియల్ రికగ్నిషన్' సాంకేతికతను వాడుకోగా.. తప్పిపోయిన 10,561 మంది పిల్లలతో అవి సరిపోయాయి. ప్రస్తుతం వారిని తమ కుటుంబాలతో కలిపే ప్రయత్నాల్లో ఉన్నారు. కాగా వీరిలో అత్యధిక మంది అక్రమ రవాణా బాధితులే కాగా.. వారు పొలాలు, గార్మెంట్ ఫ్యాక్టరీల్లో లేదా వ్యభిచార గృహాల్లో పనిచేసినట్లు సమాచారం.


బిగ్గెస్ట్ డేటాబేస్ :

న్యూఢిల్లీకి చెందిన లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు 2018లో తొలిసారిగా 'ఫేషియల్ రికగ్నిషన్' టెక్నాలజీని ఉపయోగించాయి. ఆ తర్వాత ఏపీ, తెలంగాణ, పంజాబ్‌ సహా ఇతర రాష్ట్రాల్లోనూ నేరాల నియంత్రణకు ఇది ఉపయోగపడింది. ఈ సాంకేతికత వల్ల కలిగే ప్రయోజనాలను బేరీజు వేసుకున్న భారత ప్రభుత్వం.. ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్స్‌లో ఒకదాన్ని నిర్మించేందుకు ప్రయత్నిస్తోంది. 28 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాల పోలీసులు ఒకే కేంద్రీకృత డేటాబేస్‌కు యాక్సెస్ కలిగి ఉండేలా దీన్ని భవిష్యత్తు ప్రాజెక్ట్‌గా తీర్చిదిద్దబోతోంది. ఈ ప్రాజెక్ట్‌ నేరస్థుల మగ్ షాట్స్, పాస్‌పోర్ట్ ఫొటోలు, పలు ఏజెన్సీలు సేకరించిన చిత్రాలతో పాటు సీసీటీవీ కెమెరా నెట్‌వర్క్‌తో కూడిన డేటాబేస్‌తో ఇమేజెస్ మ్యాచ్ చేస్తుందని క్రైమ్ బ్యూరో తెలిపింది.

అంతేకాదు వార్తాపత్రికల నుంచి అప్‌లోడ్ చేసిన ఫొటోలు, పబ్లిక్ పంపిన చిత్రాలు లేదా అనుమానిత నేరస్థుల ఆర్టిస్ట్ స్కెచ్‌ల ఆధారంగానూ దీనికి సెర్చ్ చేసే సామర్థ్యమున్నట్లు పేర్కొంది. 'బ్లాక్ లిస్ట్ మ్యాచ్' గుర్తించిన వెంటనే ఇది హెచ్చరికలు జారీ చేస్తుంది. ఈ విధంగా నేరస్థులు, తప్పిపోయిన వ్యక్తులతో పాటు మృతదేహాల గుర్తింపులో కీలక పాత్ర పోషిస్తుంది. ఇక 'క్రైమ్ ప్యాటర్న్స్' డిటెక్ట్ చేయడంలో, నేరాల నివారణలో పోలీసు బలగాలకు సాయం చేస్తుంది.


సాంకేతికంగా సాధ్యమా?

అక్టోబర్‌లో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుండగా, ఇంత తక్కువ సమయంలో భారతదేశం ఇంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టును చేపట్టగలదా? అని నిపుణులు అనుమానిస్తున్నారు. అయితే నేషనల్ ఫేషియల్ రికగ్నిషన్ వ్యవస్థను ఇన్‌స్టాల్ చేసేందుకు IBM (IBM), హ్యూలెట్-ప్యాకర్డ్ ఎంటర్‌ప్రైజ్(HPE), యాక్సెంచర్ (ACN) సహా మరెన్నో దేశ, విదేశీ కంపెనీలు ఆసక్తిని కనబరుస్తున్నాయి. ఒకవేళ ఏదైనా కంపెనీ ఈ ప్రాజెక్ట్ ఒప్పందంపై సంతకం చేస్తే, అప్పటి నుంచి ఎనిమిది నెలల లోపు దీన్ని ప్రారంభించేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. అయితే ఇప్పటికే దేశంలో విచారణకు వచ్చిన నేరస్థులందరి ఫోటోలతో కూడిన జాతీయ డేటాబేస్ ఉందని, ఇది ఆయా రాష్ట్రాల ఏజెన్సీల ద్వారా క్రమం తప్పకుండా అప్‌డేట్ అవుతుందని, దేశంలోని CCTV సిస్టమ్‌కు లింక్ చేస్తే ప్రాజెక్ట్ దాదాపు పూర్తవుతుందని క్రైమ్ రికార్డ్ బ్యూరో భావిస్తోంది.

సీసీటీవీ ఫుటేజ్ :

మెట్రో నగరాల్లో ప్రతి 1000 మందికి పది సీసీటీవీలు ఉండగా, పల్లెల్లో వీటి వినియోగం పెరగలేదు. అయితే బెంగళూరు విమానాశ్రయంలో ఇటీవలే ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలు ప్రవేశపెట్టారు. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ట్రయల్ చేస్తున్నారు. ఇక న్యూఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో కూడా భద్రతా తనిఖీలను వేగవంతం చేసేందుకు ఈ మధ్యే సాంకేతికతను ఉపయోగించడం ప్రారంభించారు. ఇండియాలోని అతిపెద్ద నగరాలు, పట్టణాలు సహా రైల్వే స్టేషన్స్‌లోనూ అత్యధిక సీసీటీవీలు అమర్చేందుకు ప్రణాళికలు కూదా సిద్ధమైనట్లు సమాచారం. ఏదేమైనా భారతదేశంలో డేటా రక్షణ చట్టం లేనందున కొత్త ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ కోసం నిర్దిష్ట చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్‌ను కూడా రూపొందించలేదని, దీనివల్ల చట్టపరమైన రక్షణ లేకుండా పోతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News