భయంకరంగా పెరిగిన డ్రగ్స్ వ్యాపారం.. అలవాటు నుంచి అమ్మకం దాకా?
దిశ, తెలంగాణ బ్యూరో: డ్రగ్స్ వ్యాపారం విచ్చలవిడిగా మారింది. బస్తీల్లోని యువతను టార్గెట్‌గా పెట్టుకుంటున్న ఏజెంట్లు వారిని ముందుగా మత్తుకు బానిస చేస్తున్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: డ్రగ్స్ వ్యాపారం విచ్చలవిడిగా మారింది. బస్తీల్లోని యువతను టార్గెట్‌గా పెట్టుకుంటున్న ఏజెంట్లు వారిని ముందుగా మత్తుకు బానిస చేస్తున్నారు. ఆ తర్వాత వారినే రవాణాకు వినియోగిస్తున్నారు. 15 ఏండ్లలోపు పిల్లలే డ్రగ్స్ సరఫరాలో కీలకమవుతున్నారు. ఇటీవల రాష్ట్రంలో పట్టుబడిన డ్రగ్ ఫెడ్లర్లు టోనీ, అంతకు ముందు కెల్విన్ నుంచి కేవలం పది, ఇరవై మందే డ్రగ్స్ ఏజెంట్లు ఉన్నారని పోలీసులు భావించినా.. ఇప్పుడు ఆ జాబితా పెరిగిపోతోంది. బస్తీల నుంచి మొదలైన వ్యాపారం ఇప్పుడు బంజారాహిల్స్ దాకా పాకింది. బస్తీ పిల్లల నుంచి సంపన్నవర్గాల వారసులకు చేరింది. మరోవైపు రాడిసన్ హోటల్‌లోని పుడింగ్ మింక్ పబ్ వ్యవహారంలో విచారణ కొనసాగుతోంది. అయితే, ఈ పబ్ ఓనరు అభిషేక్ ఉప్పాలకు రాజకీయ ప్రముఖులతో పాటుగా సినీ తారలతో సంబంధం ఉందని, అభిషేక్ కస్టమర్ల జాబితాలో వీరే ఎక్కువగా ఉన్నారని పోలీసులు ప్రాథమికంగా గుర్తంచారు. ఇప్పటికే టాలీవుడ్‌కు డ్రగ్స్ మరక అంటిన విషయం తెలిసిందే.
ముందు పిల్లలు.. వెనక ముఠాలు
బస్తీల్లోని పిల్లలతో గంజాయి, యాష్గంజా, కొకైన్ సరఫరా జరుగుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరిని గోవాకు కూడా పంపించి డ్రగ్స్తీసుకువస్తున్నట్లు ప్రాథమికంగా తేలింది. అంతేకాకుండా గుంటూర్, వైజాగ్ ప్రాంతాల నుంచి కూడా ద్విచక్ర వాహనాల ద్వారా డ్రగ్స్‌ను తెప్పిస్తున్నట్లు తెలుస్తోంది. బస్తీల్లోని యూత్‌కు ముందుగా అలవాటు చేస్తున్న ఈ ముఠా.. ఆ తర్వాత వారిని రవాణాకు వాడుతోంది. ఒకవేళ పోలీసులకు చిక్కినా.. ఈ ముఠా బయటకు రాదు. ఎందుకంటే వీరి వివరాలు సదరు బస్తీల పిల్లలకు కూడా తెలియదు. కొంత డ్రగ్స్‌కు కొంత సొమ్ము ముట్టజెప్పుతున్నారు. అంతేకాకుండా వారికి కూడా కొంత ఇస్తున్నారు. దీంతో బస్తీల పిల్లలు ఈజీగా డ్రగ్స్ వైపు మళ్లుతున్నారు. మరోవైపు కూకట్‌పల్లి, కేబీహెచ్‌బీ ప్రాంతంలోని 15 ఏండ్లలోపు పిల్లలను ఇంటలీజెన్సీ పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. సుమారు 25 మంది వరకు 15 ఏండ్లలోపు పిల్లలను అనుమానిస్తున్నారు. వీరిపై ప్రత్యేక నిఘా కూడా పెట్టారు. అయితే, వీరి నుంచి ఎక్కువగా గంజాయి, యాష్ గంజా సరఫరా అవుతుందని ప్రాథమికంగా గుర్తించారు. కొకైన్ బ్యాచ్ వేరే ఉందని అనుమానాలున్నాయి. ముందుగా బస్తీ యువకులను అనుమానించినప్పటికీ.. ఈ పరిస్థితి ఉన్నత కుటుంబాలకు కూడా చేరినట్లు ఆధారాలున్నాయి. దీంతో కొంతమంది సంపన్నుల వారసులు కూడా తాము వినియోగించడమే కాకుండా.. వారు కూడా డ్రగ్స్ విక్రేతలుగా మారినట్లు కొంతమేరకు పోలీసులు కూపీ లాగారు. కానీ, వారిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులకు అడ్డంకులు వస్తూనే ఉన్నాయి.
పబ్‌లకు నేరుగా విక్రయం
కాగా, హైదరాబాద్‌లోని ప్రముఖ పబ్‌లో డ్రగ్స్ నేరుగా విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. పబ్ నిర్వాహకులే డైరెక్ట్‌గా కొనుగోలు చేసి, తమ కస్టమర్లకు విక్రయిస్తున్నారు. పబ్ నిర్వహాకులకు డ్రగ్ ముఠాలతో డైరెక్ట్ సంబంధాలున్నాయి. అంతేకాకుండా కొన్ని ప్రత్యేక పార్టీలకు కూడా వీరే మధ్యవర్తిగా ఉంటూ విక్రయదారులతో లింక్‌లు కలుపుతున్నారు. పబ్‌లకు వెళ్లే రెగ్యులర్ కస్టమర్లు.. తమకు రేవ్ పార్టీలు, ఇతర స్పెషల్ ఈవెంట్లకు డ్రగ్స్ కావాలంటే ఈ పబ్ నిర్వాహకులతోనే కాంటాక్ట్ అవుతున్నారు. వీరి నుంచే రేవ్ పార్టీలకు నేరుగా డ్రగ్స్ సరఫరా అవుతున్నట్లు అనుమానాలున్నాయి. ఇక, హైదరాబాద్ చుట్టు పరిధిలోనే దాదాపు 200 మంది డ్రగ్ విక్రయదార్లున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే, వీరిలో ఎక్కువగా గంజాయి, యాష్ గంజా సప్లై చేసేవారున్నారు. కొంతమంది మాత్రం ఖరీదైన కొకైన్ వంటి మాదకద్రవ్యాలను సప్లై చేస్తున్నట్లు విచారణలో తేలింది.
పుడింగ్ మింక్‌లో మూడు టేబుళ్లపై అనుమానాలు
పుడ్డింగ్ అండ్ మింక్ పబ్‌లో ముఖ్యంగా మూడు టేబుళ్లలో డ్రగ్స్ వాడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక్కడి మూడు టేబుళ్లపై బర్త్ డే పార్టీ జరిగిందని, అక్కడే డ్రగ్స్ వినియోగించారంటున్నారు. దీంతో ఆ మూడు టేబుళ్ల మీద పార్టీ చేసుకున్న వారి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఇప్పటికే సీసీ కెమెరాల దృశ్యాలను సేకరించారు. ఇరుకు గదిలో చీకటి ఉండటంతో సీసీ కెమెరాల దృశ్యాల గుర్తింపు పోలీసులకు చిక్కడం లేదు.
అభిషేక్ జాబితా కీలకం
ఇక ఫుడింగ్ మింక్ పబ్ యజమాని అభిషేక్ మొబైల్ ఫోన్‌లో కీలక సమాచారం లభించినట్లు తెలుస్తోంది. ఈ మొబైల్‌లో డ్రగ్స్ విక్రయాలకు సంబంధించిన వివరాలతో పాటుగా డ్రగ్స్ విక్రేతల సమాచారం కూడా సేకరించారు. అంతేకాకుండా సినీతారలు, రాజకీయ ప్రముఖులకు డ్రగ్స్‌కు సంబంధించిన అంశాలపై అభిషేక్ ఫోన్ నుంచి మెసేజ్‌లు వెళ్లినట్లు తెలుస్తోంది. పలువురు సెలెబ్రెటీలతో ఫోటోలు, సినీ తారలతో కాంటాక్ట్స్, ప్రముఖ హీరోలు, సినీ సెలబ్రిటీస్‌తో సత్సంబంధాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో అభిషేక్ ఫోన్ కాల్ డేటా కీలకంగా మారింది. పొలిటికల్హై ప్రొఫైల్ ఉన్న వ్యక్తులతో అభిషేక్‌కు దగ్గర పరిచయాలున్నాయి. ఈ కేసులో అభిషేక్ ఉప్పల కాల్ డేటా, వాట్సాప్ ఛాటింగ్ కీలకంగా మారింది. దీంతో అభిషేక్ కస్టడీకి పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా పబ్ మేనేజర్‌గా వ్యవహరిస్తున్న అనిల్ ప్రతినెలా పలుమార్లు గోవాకు వెళ్లి రావడంపైనా పోలీసులు అనుమానిస్తున్నారు. గోవా నుంచి పబ్మేనేజర్డ్రగ్స్తీసుకువస్తున్నారా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.
లక్ష్మీపతి అరెస్ట్
ఇక ఇటీవల బీటెక్విద్యార్థి మృతి కేసుల కీలక సూత్రదారి లక్ష్మీపతి పోలీసులకు చిక్కాడు. డ్రగ్స్ కేసులో కీలక నిందితుడిగా లక్ష్మీపతి ఉన్నాడు. ఆయన్ను మంగళవారం ఏపీలో అదుపులోకి తీసుకున్నారు. లక్ష్మీపతి హైదరాబాద్‌లో పలువురికి హాష్ ఆయిల్ సప్లై చేసేవాడని, ఏడేళ్లుగా గంజాయికి బానిసైన లక్ష్మీపతి స్టూడెంట్‌గా ఉన్నప్పుడే గంజాయి, డ్రగ్స్ అమ్మేవాడని పోలీసులు గుర్తించారు. ఏపీలోని పలు ఏజెన్సీల నుంచి హాష్ ఆయిల్ తీసుకువచ్చి అమ్మాడని, లక్ష రూపాయలకు లీటర్ హాష్ ఆయిల్ కొనుగోలు చేసి హైదరాబాద్‌లో లీటర్ రూ.8 లక్షలకు అమ్మినట్లు తేలింది. అంతేకాకుండా ప్రేమ్‌కుమార్ అనే వ్యక్తితో కలిసి లక్ష్మీపతి డ్రగ్స్ అమ్మకాలు చేశాడని, గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి విద్యార్థులకు సరఫరా చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.