పనులే పూర్తి కాలే అప్పుడే అవస్థలు.. రూ.278 కోట్లు వృధాయేనా..!
దిశ ప్రతినిధి, సిద్దిపేట: సిద్దిపేట పట్టణ ప్రజలను మురుగు నీటి ఇబ్బందులు శాశ్వతంగా తొలగించేందుకు - latest Telugu news
దిశ ప్రతినిధి, సిద్దిపేట: సిద్దిపేట పట్టణ ప్రజలను మురుగు నీటి ఇబ్బందులు శాశ్వతంగా తొలగించేందుకుచేపట్టిన యూజీడీ వ్యవస్థ ఆదిలోనే అబాసుపాలవుతుంది. అమృత్ పథకంలో భాగంగా చేపట్టిన సిద్దిపేట యూజీడీ పనులు గత నాలుగేండ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకా పూర్తిస్థాయిలో యూజీడీ పనులే పూర్తి కానేలేదు. అప్పుడే యూజీడీ కోసం నిర్మించిన మ్యాన్ హోళ్లలో మురుగు నీరు నిండి రోడ్లపైకి వస్తుంది. మురుగు నీరు రోడ్డుపై పారుతుండటంతో పట్టణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయమై పలువురు స్థానికులు పట్టణ అధికారులు ఎన్ని సార్లు విన్నవించిన ఫలితం లేదు. దీనిపై ఇబ్బందులు పడుతున్న స్థానిక ప్రజలు పట్టణ యూబీడీ వ్యవస్థను పట్టించుకునే నాదుడే కరువయ్యారా అంటూ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రూ .278 కోట్లతో యూజీడీ నిర్మాణం..
సిద్దిపేట పట్టణంలో అమృత్ పథకంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి హరీశ్ రావు చొరవతో రూ.278 కోట్లు వెచ్చించి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను గత నాలుగేండ్ల క్రితం మొదలు పెట్టారు. పట్టణంలోని 43 వార్డులకు గాను రూ .278 కోట్ల వ్యయంతో 328 కి.మీల పొడవున పట్టణమంతా యూజీడీ పైపులైన్ నిర్మిస్తున్నారు. దాదాపు నలభై వార్డులో యూజీడీ పనులు పూర్తయ్యాయి. యూజీడీ నిర్మాణ పనుల్లో భాగంగా రెండు ఎన్టీపీ ( సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ) లను నిర్మించారు. వీటిలో చింతల్ చెరువు వద్ద రూ .8 కోట్లతో 7.24 ఎంఎల్‌డీ, నర్సాపూర్ చెరువు వద్ద రూ.12.54 కోట్లతో 11 ఎంఎల్‌డీ ఎస్‌టీపీలను ఏర్పాటు చేశారు. ఇందులో 16 వార్డులకు చెందిన మురుగు నీరు చింతల్ చెరువు ఎస్‌టీపీ వద్దకు చేరుకోగా.. మిగిలిన 21 వార్డులకు చెందిన మురుగు నీరు నర్సాపూర్ ఎస్‌టీపీ వద్దకు వెళ్లేలా ఏర్పాటు చేశారు.
రోడ్లపైకి యూజీడీ మురుగునీరు..
సిద్దిపేట పట్టణంలోని 43 వార్డులో సుమారు 23 వేల నివాస గృహలు ఉన్నాయి. వీటిలో సుమారు 40 వార్డుల్లో యూజీడీ పనులు పూర్తయ్యాయి. పూర్తి అయిన చోట ప్రతీ ఇంటికి యూబీడీని అనుసంధానం చేశారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. యూజీడీ కోసం నిర్మించిన పైపులైన్ పరిమాణం చిన్నదిగా ఉండటంతో అతి త్వరగా పైపుల్లో మురుగు నీరు నిండి రోడ్లపైకి వస్తుంది. యూజీడీ కోసం నిర్మించిన మ్యాన్ హోల్స్ నుండి మురుగు నీరు రోడ్లపైకి వస్తుండటంతో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలోని కుషాల్నగర్‌లోని మణికంఠ కాలనీలో గత వారం రోజులుగా రోడ్డుపై మురుగు నీరు వస్తుండటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత వానాకాలం సీజన్లోనూ ఇదే ఇబ్బంది ఏర్పడింది. ఒక్క వానకే మ్యాన్ హోల్స్ నిండి రోడ్లన్ని మురుగునీరు మయమైంది. పలువురు ఇండ్లలోకి రివర్స్ మురుగు నీరు వచ్చిన సందర్భాలు ఉన్నాయి.
యూజీడీ నిర్మించిన ఫలితం లే.. భూమలింగం, సిద్దిపేట పట్టణ వాసి
'అండర్ గ్రౌండ్ పనులు మంచిగనే ఉన్నాయి. కానీ అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతోటి మాకు ఇబ్బందులైతున్నాయి. యూజీడీ ఇంకా మొత్తం పూర్తికాకముందే రోడ్లపైకి మురుగునీరు వస్తుంది. దీంతో మాకు నడుసుడుకు తిప్పలైతుంది. ఇంట్ల కూసున్న మురుగు వాసన వస్తోంది. ముక్కు మూసుకొని బయటకు వెళ్లాల్సి వస్తోంది. అధికారులకు ఎన్ని సార్లు చెప్పిన పట్టించుకోవట్లే. మంత్రి హరీశ్ రావు ప్రత్యేక చొరవ చూపి యూజీడీ ఇబ్బందులు తొలిగేలా' చూడాలి. మున్సిపల్ అధికారులపై చర్యలు తీసుకోవాలి.