ఆ వ్యాధుల కారణంగా 60శాతం మంది చనిపోతున్నారు: డాక్టర్ వెంకటి

దిశ ప్రతినిధి , హైదరాబాద్: నగర వ్యాప్తంగా జీవనశైలి వ్యాధులు చాపకింద నీరులా- latest Telugu news

Update: 2022-03-14 14:06 GMT

దిశ ప్రతినిధి , హైదరాబాద్: నగర వ్యాప్తంగా జీవనశైలి వ్యాధులు చాపకింద నీరులా వ్యాపించి 60 శాతం మరణాలకు కారణమౌతున్నాయని హైదరాబాద్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ జే వెంకటి అన్నారు. జీవన శైలి వ్యాధులపై హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా చేపట్టిన సర్వే ద్వారా ప్రతి వ్యక్తి ఆరోగ్య రికార్డు అందుబాటులోకి రానుందని తెలిపారు. ఈ జబ్బులపై అవగాహన, వ్యక్తిగత హెల్త్ ప్రొఫైల్ తయారీ, నిర్వహణపై సోమవారం సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, బస్తీ దవాఖానల వైద్యాధికారులు, స్టాఫ్ నర్సులను ఉద్ధేశించి డాక్టర్ వెంకటి మాట్లాడుతూ.. ప్రస్తుత సమాజంలో ప్రజలు ఓ వైపు పని ఒత్తిడి, తదితర రుగ్మలతో బాధపడుతున్నారని, శారీరక శ్రమ లేకుండా నిత్యం ఎదురౌతున్న ఒత్తిళ్ల కారణంగా రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్, గుండె జబ్బుల వంటి వాటి బారిన పడుతున్నారని అన్నారు. మరోవైపు జీవనశైలి వ్యాధులతో మరణిస్తున్నారని పేర్కొన్నారు. ఈ విషయమై ప్రజలలో అవగాహన కల్పించి ఆహార అలవాట్లలో మార్పులు, శారీరక శ్రమ వంటి మార్పులతో ఇలాంటి వ్యాధులను దూరం చేయవచ్చని, ఈ మేరకు ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌సీడీ ప్రోగ్రాం జిల్లా అధికారి డాక్టర్ ఆశ్రిత్ రెడ్డి, ఎస్ఓ ఆనంద్, డిప్యూటీ డెమో వెంకటేశ్వర్లు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News