కీవ్: రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సంక్షోభంలో చిక్కుకుపోయిన భారత పౌరులకు కేంద్రం కీలక సూచనలు చేసింది. దేశం విడిచే క్రమంలో నేరుగా ఉక్రెయిన్ సరిహద్దుల్లోకి రావొద్దని పేర్కొంది. అధికారుల సమన్వయంతో పోలాండ్, హంగరీ, రుమేనియా సరిహద్దులకు చేరుకోవాలని సూచించింది. ఈ మేరకు విదేశాంగ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ మీడియాతో మాట్లాడారు. తాము మొదటి సలహా ఇచ్చిన తర్వాత సుమారుగా 8వేలకుపైగా భారతీయులు ఉక్రెయిన్ దాటినట్లు తెలిపారు. కాగా కేంద్రం చేపట్టిన ఆపరేషన్ గంగా కార్యక్రమంలో ఇప్పటివరకు ఆరు విమానాల్లో 1,396 మంది విద్యార్థులను స్వదేశానికి తీసుకువచ్చినట్లు వెల్లడించారు. మరోవైపు ఉక్రెయిన్‌లో భారత ఎంబసీ రెండో సలహాను జారీ చేసింది. రాజధాని కీవ్ నగరంలో ఆంక్షలు ఎత్తివేయడంతో రైల్వే స్టేషన్లకు వెళ్లాలని పౌరులను కోరింది. 'కీవ్‌లో వీకేండ్ కర్ఫ్యూ ఎత్తివేశారు. విద్యార్థులందరూ రైల్వేస్టేషన్లకు వెళ్లి పశ్చిమ ప్రాంతాలకు ప్రయాణించాలి' అని కోరింది. తరలింపు కోసం ఉక్రెయిన్ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. అంతేకాకుండా భారత పౌరులు ఓపికతో, శాంతియుతంగా వ్యవహరించాలని సూచించింది. అయితే పశ్చిమ ప్రాంతంలోని నగరాల్లో ఆహార, నివాస వసతులు సురక్షితమేనని పేర్కొంది.