DK Aruna: నీ నియంతృత్వ పోకడలతో జనం విసుగు చెందారు: డీకే అరుణ
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: సీఎం కేసీఆర్ నియంతృత్వ పోకడలతో - DK Aruna inspects the arrangements for the second installment of Bandi Sanjay Praja Sangrama Yatra
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: సీఎం కేసీఆర్ నియంతృత్వ పోకడలతో జనం విసుగు చెందారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ అన్నారు. గురువారం నుంచి ఆరంభంకానున్న బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర రెండో విడత కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ మాయమాటలు వినే పరిస్థితిలో జనం లేరని చెప్పారు. తెలంగాణ ప్రజానీకమంతా బీజేపీ వైపు ఇస్తున్నట్లుగా ఆమె వెల్లడించారు. గురువారం మధ్యాహ్నం 5వ శక్తి పీఠమైన జోగులాంబ అమ్మవారి ఆశీర్వాదాలతో ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభమవుతుందన్నారు. ఈ యాత్రకు జనం పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలి రావడానికి సిద్ధంగా ఉన్నట్లు డీకే అరుణ వెల్లడించారు.
బండి యాత్రకు ముమ్మరంగా ఏర్పాట్లు..
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో గురువారం నుంచి ఆరంభంకానున్న రెండవ విడత ప్రజా సంగ్రామ యాత్రకు జోగులాంబ గద్వాల జిల్లాలో ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఇరవై తొమ్మిది రోజుల పాటు జరగనున్న యాత్ర.. అలంపూర్ జోగులాంబ మాత ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం ప్రారంభమవుతుంది. మొదటి రోజున మధ్యాహ్నం బండి సంజయ్ ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు అలంపూర్ చేరుకుంటారు. ముందుగా అలంపూర్‌లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులార్పిస్తారు. అనంతరం జోగులాంబ దేవి ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. అనంతరం అలంపూర్‌లోనే భారీ బహిరంగ సభ నిర్వహించే విధంగా ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి హాజరయ్యే బీజేపీ ముఖ్య నేతల ప్రసంగాల అనంతరం మొదటి రోజున ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా 5 కిలోమీటర్లు ప్రయాణించి రాత్రి 9 గంటలకు ఇమ్మాపూర్ గ్రామానికి చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేస్తారు. ఈ కార్యక్రమాలు అన్నింటినీ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తూ.. కార్యక్రమాలు సజావుగా సాగే విధంగా బాధ్యతలు నిర్వహించాలని ఆమె పార్టీ శ్రేణులకు సూచించారు.