KTRపై డీకే అరుణ ఫైర్.. కంటోన్మెంట్ కల్వకుంట్ల జాగీరా?
దిశ, తెలంగాణ బ్యూరో : మంత్రి కేటీఆర్ అసెంబ్లీ లో రక్షణ శాఖ ఆధీనంలో ఉండే కంటోన్మెంట్ బోర్డుపై ఆరోపణలు చేయడంపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు
దిశ, తెలంగాణ బ్యూరో : మంత్రి కేటీఆర్ అసెంబ్లీ లో రక్షణ శాఖ ఆధీనంలో ఉండే కంటోన్మెంట్ బోర్డుపై ఆరోపణలు చేయడంపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఘాటుగా స్పందించారు. అసలు రక్షణశాఖ ప్రాంతంలో విద్యుత్, నీటి సరఫరా బంద్ చేయడానికి ఆ ప్రాంతం కల్వకుంట్ల జాగీరా అని ఆదివారం ఒక ప్రకటనలో ఆమె ధ్వజమెత్తారు. మంత్రి కేటీఆర్ సాక్షాత్తు అసెంబ్లీలో రక్షణ శాఖ అధికారులను హెచ్చరించడం సిగ్గుచేటని, అసలు కల్వకుంట్ల కుటుంబ సభ్యులపై దేశ ద్రోహం కేసు నమోదు చేయాలని డీకే అరుణ డిమాండ్ చేశారు. భారత్ చైనా సరిహద్దు ప్రాంతం నుంచి దేశ సైనికులు తోక ముడచుకొని వచ్చారని, రక్షణ శాఖపై గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్హేళన చేయడం, కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత కశ్మీర్ భారతదేశంలో భాగం కాదని దేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యానించడం వెనుక ఆంతర్యమేంటని ఆమె ప్రశ్నించారు. దేశ సరిహద్దులో ప్రాణాలను కూడా లెక్క చేయకుండా పోరాడుతున్న సైనికులకు మద్దతుగా నిలవడం మరిచి, వారిపై అవాకులు చవాకులు పేలడం కల్వకుంట్ల కుటుంబ అహంకారానికి నిదర్శనమని డీకే అరుణ మండిపడ్డారు. ఇలాంటి దేశ వ్యతిరేకులు దేశం విడిచి వెళ్లిపోతే భరతమాతకు భారం తగ్గుతుందని డీకే అరుణ మండిపడ్డారు.