ఆలూ లేదు.. సూలు లేదు..! BSPలో భగ్గుమన్న అసంతృప్తులు

దిశ,తుంగతుర్తి: ఆలు లేదు.. సూలు లేదు.. అనే సామెత అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఇదే సామెత తుంగతుర్తి

Update: 2022-03-21 04:32 GMT

దిశ,తుంగతుర్తి: ఆలు లేదు.. సూలు లేదు.. అనే సామెత అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఇదే సామెత తుంగతుర్తి నియోజకవర్గంలోని బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) కి అచ్చుగుద్దినట్టు సరిపోతుంది. ఎందుకంటే ఇప్పుడిప్పుడే తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో పురుడు పోసుకోబోతున్న ఆ పార్టీకి ఆదిలోనే ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ముఖ్యంగా కష్టపడి పనిచేసిన కార్యకర్తలు, నాయకులకు గుర్తింపు లేదనేది ఆ పార్టీలోనే చర్చ కొనసాగుతోంది. పార్టీ తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జిని అప్పటికప్పుడు మార్చడమే ఈ అసంతృప్తులకు కారణంగా నిలిచింది.

బీస్పీకీ నియోజకవర్గంలో ఓనమాలు దిద్దించిన వ్యక్తుల్లో ప్రధానంగా దాసరి శ్రీను ఒకరు. కాంగ్రెస్ పార్టీలో పేరున్న నాయకుడైన ఆయన దానికి రాజీనామా చేసి ప్రారంభంలోనే బీఎస్పీలో చేరారు. తుంగతుర్తి మండలం తూర్పుగూడెం గ్రామానికి చెందిన దాసరి శ్రీను పార్టీలో పోషిస్తున్న చురుకైన పాత్రను గమనించిన అధిష్టానం తుంగతుర్తి నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలను అప్పగించింది. దీంతో నియోజకవర్గంలోని తొమ్మిది మండలాలలో ఆయన పర్యటిస్తూ వచ్చారు. తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో ఏకంగా పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి దాన్ని బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభించాలని నిర్ణయించి కార్యక్రమాలు కూడా రూపొందించారు.ఈలోగా ఆర్ఎస్ చేపడుతున్న రాజ్యాధికార యాత్ర కొంత కలిసొచ్చింది. ఈ మేరకు దాసరి శ్రీను నియోజకవర్గ వ్యాప్తంగా యాత్రపై విస్తృతంగా ప్రచారాలు చేశారు. పలు రకాల ప్రచారాలతో పాటు గోడలపై యాత్రను విజయవంతం చేయాలని పేర్కొంటూ నియోజకవర్గ ఇన్చార్జిగా చేతి రాతలు రాయించారు. పరిస్థితి ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేపట్టిన యాత్రలో సీన్ మారిపోయింది.

దాసరి శ్రీను స్థానంలో అకస్మాత్తుగా బల్గూరి స్నేహ తెరపైకి వచ్చారు.ఈ పరిణామం పార్టీ క్యాడర్ ని అయోమయంలోకి నెట్టేసింది. స్నేహ ఎవరంటూ.. ? క్యాడర్లో ప్రశ్నలు తలెత్తాయి. తర్వాత స్నేహ కోదాడ ప్రాంతానికి చెందినవారుగా తెలుసుకొని నోరెళ్ళబెట్టారు. కోదాడ ఎక్కడ..? తుంగతుర్తి ఎక్కడ..? అంటూ ఎదురు ప్రశ్నలు వేసుకోవడంలో తలమునకలయ్యారు. ఈలోగా గత నాలుగు రోజుల క్రితం ఆర్ఎస్ ప్రవీణ్ యాత్ర మోత్కూర్ నుండి నియోజకవర్గంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా పలువురు ఏర్పాటుచేసిన స్వాగత ఫ్లెక్సీలలో రాష్ట్ర నేతల ఫోటోలు మినహాయిస్తే కేవలం యాత్రకు ఇన్చార్జిగా నియామకమైన బల్గూరి స్నేహ, తుంగతుర్తి నియోజకవర్గ పార్టీ ఇంచార్జి పేరుతో పెద్ద ప్లెక్సీలు ఏర్పాటయ్యాయి. అయితే అందులో పార్టీ నియోజకవర్గ ఇంచార్జి పదవి నుండి తొలగించబడి కేవలం రాజ్యాధికార యాత్రకు ఇన్చార్జిగా నియమించబడిన దాసరి శ్రీను ఫోటో మాత్రం అందులో కనిపించలేదు. అయితే దాసరి శ్రీనును తుంగతుర్తి నియోజకవర్గ ఇన్చార్జిగా తొలగించడంలో అంతర్యం ఏమిటో ? అంటూ క్యాడర్ బహిరంగంగా ప్రశ్నిస్తోంది. మొదటి నుండి కష్టపడి పనిచేసిన వారిని పక్కకు పెట్టి నియోజకవర్గంతో ఎలాంటి సంబంధం లేని వారిని నియోజకవర్గ ఇన్చార్జిగా ఎలా నియమిస్తారని క్యాడర్ ఘాటుగా ప్రశ్నిస్తోంది. పరిస్థితులు ఇలాగే ఉంటే నియోజకవర్గంలో పార్టీ మనుగడ ప్రమాదంలోకి వెళ్లే పరిస్థితి ఉందని పేరు చెప్పడానికి ఇష్టపడని క్యాడర్ "దిశ"తో మాట్లాడుతూ చెప్పారు.

ప్రారంభానికి నోచుకోని పార్టీ కార్యాలయం

రాజ్యాధికార యాత్రలో భాగంగా బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తుంగతుర్తికి మండల కేంద్రానికి వచ్చినప్పుడు పార్టీ కార్యాలయాన్ని ఆయన చేతుల మీదుగా ప్రారంభించాలని తొలుత క్యాడర్ భావించింది. కానీ పార్టీలో నెలకొన్న పరిణామాలు కార్యాలయంపై పడి ప్రారంభానికి దూరమైంది.

అధిష్టానం దృష్టికి తుంగతుర్తి పరిణామాలు

తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ పరంగా జరుగుతున్న పరిణామాలు పార్టీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దృష్టికి వెళ్లినట్లు తెలిసింది. దీనిపై ఆయన ఆరా తీస్తున్నట్లు సమాచారం.

Tags:    

Similar News