సూపరింటెండెంట్ల అత్యుత్సాహం.. స్టాఫ్ నర్సుల డ్యూటీల్లో భేదాలు!
దిశ, తెలంగాణ బ్యూరో: సర్కార్ దవాఖాన్లలో పనిచేస్తున్న జూనియర్ స్టాఫ్ నర్సులపై కొందరు నర్సింగ్ సూపరింటెండెంట్లు అజమాయిషీ చెలాయిస్తున్నట్లు ఆరోపణలు విపిపిస్తున్నాయి.
దిశ, తెలంగాణ బ్యూరో: సర్కార్ దవాఖాన్లలో పనిచేస్తున్న జూనియర్ స్టాఫ్ నర్సులపై కొందరు నర్సింగ్ సూపరింటెండెంట్లు అజమాయిషీ చెలాయిస్తున్నట్లు ఆరోపణలు విపిపిస్తున్నాయి. డ్యూటీల అంశాల్లో భేదాలు చూపుతూ సతాయిస్తున్నట్లు జూనియర్నర్సులు వాపోతున్నారు. ఇష్టారీతిగా డ్యూటీలు వేస్తూ ఇబ్బంది పెడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నర్సింగ్ సూపరింటెండెంట్లకు దగ్గరగా ఉన్న వాళ్లు, అయినోళ్లకు నైట్, ఈవినింగ్ డ్యూటీలు వేయకుండా మిగతా వారిని పదే పదే టార్చర్ పెడుతున్నట్లు కొందరు స్టాఫ్ చెబుతున్నారు. పారదర్శకంగా పనులు చెప్పకుండా వేధిస్తున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న అన్ని టీచింగ్, ఏరియా ఆసుపత్రుల్లో ఇదే పరిస్థితి ఉన్నట్లు స్టాఫ్ నర్సులు చెప్పుకొస్తున్నారు.
ఆసుపత్రి ఉన్నధికారులకు చెప్పిన ఫలితం లేకుండా పోతున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో సిబ్బందిని సతాయిస్తున్న గ్రేడ్-1 నర్సెస్‌కు వ్యతిరేకంగా త్వరలో అన్ని ఆసుపత్రుల్లో స్టాఫ్ నర్సులంతా ధర్నాలు చేయాలని ప్లాన్చేస్తున్నారు. ఇప్పటికే ఈ నెల 25న ఎంజీఎం వరంగల్‌లో కొంతమంది స్టాఫ్ నర్సులు ఆసుపత్రి ముందు బైఠాయించి నిరసనలు వ్యక్తం చేశారు. ఈ వారంలో మిగతా ఆసుపత్రుల్లోనూ చేసేందుకు జూనియర్ స్టాఫ్ నర్సులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వాస్తవానికి మెడికల్ సమస్యలున్నోళ్లకు నైట్, ఈవినింగ్ డ్యూటీలు వేయరు. ఇలాంటి ప్రాబ్లామ్ఉన్నోళ్లు నిబంధనలు ప్రకారం ఆ విభాగానికి సంబంధించిన డాక్టర్ రిఫరెన్స్, మెడికల్ ప్రూఫ్‌లను ఆసుపత్రికి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కానీ, కొందరు నర్సింగ్ సూపరింటెండెంట్లు తమకు తెలిసిన వారందరికీ డే డ్యూటీలతోనే సరిపెడుతున్నారు. మరోవైపు సీనియర్లు కూడా డే టైమ్‌లోనే డ్యూటీలు చేయడం వలన రాత్రి వేళ్లల్లో కేవలం జూనియర్లు మాత్రమే వైద్యసేవలు అందించాల్సి వస్తున్నది. దీంతో ట్రీట్మెంట్ విధానంలో చిక్కులు ఏర్పడుతున్నట్లు స్వయంగా డాక్టర్లే వాపోతున్నారు.
ఆసుపత్రులకు ఆలస్యంగా..
సర్కార్ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న కొందరు గ్రేడ్ వన్ నర్సింగ్‌లు ఆసుపత్రులకు ఆలస్యంగా వస్తున్నట్లు ప్రభుత్వానికి ఫిర్యాదు అందింది. ఉదయం 8 గంటలకు రావాల్సిన వారు 9 తర్వాత వస్తున్నట్లు గుర్తించారు. మళ్లీ మధ్యాహ్నం 3 వరకు పనిచేయాల్సి ఉండగా, లంచ్ సమయం ముగిసిన వెంటనే వెళ్లిపోతున్నట్లు ఆయా ఆసుపత్రుల్లోని డాక్టర్లు ఉన్నతాధికారులకు వివరించారు. దీంతో అలాంటి వారి జాబితాను సర్కార్ తయారు చేస్తున్నది. పూర్తి స్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సెక్రటేరియట్‌లోని ఓ ఉన్నతాధికారి తెలిపారు.