భూమి ఆ కమ్యూనిటీ 24 ఏళ్ల పోరాటం.. న్యాయం జరుగుతుందా?
దిశ, ఫీచర్స్: భూమి మనది అయినప్పుడు ‘బాంచెన్’ అంటూ బతిమిలాడటం ఎందుకు? తెగించి కొట్లాడాలే.. అలుపెరగకుండా ఉద్యమించాలే.. సరికొత్త విప్లవోద్యమానికి నాంది పలకాలే..Latest Telugu News
దిశ, ఫీచర్స్: భూమి మనది అయినప్పుడు 'బాంచెన్' అంటూ బతిమిలాడటం ఎందుకు? తెగించి కొట్లాడాలే.. అలుపెరగకుండా ఉద్యమించాలే.. సరికొత్త విప్లవోద్యమానికి నాంది పలకాలే. అవసరమైతే ప్రాణాలర్పించి చరిత్రలో మిగిలిపోవాలే తప్ప వెన్నుచూపి వెనుతిరగొద్దు. ఇలాంటి వీరోచిత పోరాటానికి సాక్ష్యంగా నిలుస్తోంది బ్రెజిల్‌లోని 'గ్వారానీ కైయోవా' కమ్యూనిటీ. దాదాపు 24 ఏళ్లుగా జరుగుతున్న ఉద్యమం ఈ మధ్యే వెలుగులోకి రాగా.. ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నా సరే నమ్మకంతో ముందుకు సాగుతోంది.
సూపర్ మార్కెట్స్, ఫాస్ట్ ఫుడ్ చైన్స్, పెట్ యానిమల్ ఫుడ్ కంపెనీస్.. బ్రెజిల్‌లోని స్వదేశీ హక్కుల ఉల్లంఘనతో ముడిపడి ఉన్నాయి. గత నెలలో 'దేర్ విల్ బి బ్లడ్ : ది అగ్లీ ట్రూత్ అబౌట్ చీప్ చికెన్' పేరుతో ఎర్త్ సైట్ సంస్థ విడుదల చేసిన నివేదికలో ఈ విషయాన్ని క్లుప్తంగా వివరించడంతో ఈ ఉద్యమ కథ లోకానికి పరిచయమైంది. యూరోపియన్ యూనియన్, యునైటెడ్ కింగ్‌డమ్‌కు చెందిన పలు కంపెనీలకు చికెన్ సరఫరా చేస్తున్న బ్రెజిల్‌లోనే అతిపెద్ద పౌల్ట్రీ ఉత్పత్తి సంస్థ.. వేల ఎకరాలను చేజిక్కుంచుకుని ఎందుకు నాటకమాడుతోంది? అమాయకులను హింసిస్తూ.. ఏ విధంగా పెత్తనం చెలాయిస్తోంది? KFC, సైన్స్‌బరీస్, అస్డా, ఆల్డి, Netto, Edeka లాంటి కంపెనీలకు చికెన్, సోయా సరఫరా చేస్తున్న ఈ సంస్థ.. ఉద్యమాన్ని ఏ విధంగా నీరుగారుస్తోంది? చూద్దాం.
కథ..
పశువుల కాపరి జసింటో హోనోరియా డా సిల్వా ఫిల్హో.. బ్రెజిల్‌ను వ్యవసాయ శక్తి కేంద్రంగా మార్చేందుకు ప్రయత్నించిన వ్యక్తిగా ప్రసిద్ధి చెందాడు. 1966లో బ్రెసిలియా దో సుల్ ప్రాంతంలో కొంత భూమి కొనుగోలు చేశాడు. ఇక్కడి 9,700-హెక్టార్ల భూమిలో వ్యవసాయం మొదలుపెట్టాడు. కానీ ఇందులో కొంత భాగం 'గ్వారానీ కైయోవా' కమ్యూనిటీకి చెందిన పూర్వీకులది కాగా దీన్ని 'టకౌరా' అని పిలుస్తారు. అయితే, కాలక్రమేణా(70 సంవత్సరాలుగా) జసింటో కుటుంబం తమ వ్యాపారాన్ని మార్చుకుంది. బ్రెజిల్‌లోని అతిపెద్ద పౌల్ట్రీ ఉత్పత్తిదారుల్లో ఒకటైన 'లార్ కోపరేటివ్' కంపెనీగా అభివృద్ధి చెందింది. మరోవైపు విదేశాల్లోని నంబర్ వన్ కంపెనీలకు సోయా విక్రయిస్తోంది. UK కంపెనీ 'వెస్ట్‌బ్రిడ్జ్' 2018 నుంచి 2021 మధ్ కాలంలో ఈ కంపెనీ నుంచి 37,000 టన్నులకు పైగా ఫ్రీజ్ అండ్ మెరినేటెడ్ చికెన్‌ను దిగుమతి చేసుకుందని ట్రేడ్ రికార్డులు చెప్తున్నాయి. ఈ కాలంలో EU, UKల్లో వాడిన చికెన్‌లో మూడింట ఒక వంతు ఇక్కడి నుంచే ఎగుమతి అయింది. ఇక 2017 నుంచి 2021 మధ్య కాలంలో హాంబర్గ్ ఆధారిత పాల్సెన్ ఫుడ్ దాదాపు 14,000 టన్నులు కొనుగోలు చేసింది. ఇది పెంపుడు జంతువుల ఆహారాన్ని ఉత్పత్తి చేసే ఏకైక ప్రధాన యూరోపియన్ కస్టమర్ అని రికార్డులు వెల్లడించాయి.
ఇదిలా ఉంటే.. 'లార్ కోపరేటివ్' కంపెనీ స్థానిక కమ్యూనిటీ ఆకలి బతుకుల గురించి ఆలోచించడం లేదు. వారు 'టకౌరా'లోని తమ పూర్వీకుల భూమి కోసం దాదాపు 24 ఏళ్లుగా ఉద్యమిస్తున్నా పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో క్రూరమైన హింసను కూడా ఎదుర్కొన్నారు. 2003లో ఈ వివాదాస్పద భూభాగంలో స్థానికులు ఏర్పాటు చేసిన శిబిరంపై పోలీసులు, రౌడీ షీటర్లతో దాడి చేయించిన సదరు కంపెనీ.. కైయోవా నాయకుడు మార్కోస్ వెరాన్‌ను దారుణంగా హత్య చేయించింది. మిగిలిన వారిని దారుణంగా హింసించింది. ఇక ఈ దాడిలో ముగ్గరు వ్యక్తులు దోషులుగా నిర్ధారించబడినప్పటికీ వారికి శిక్ష విధించకపోవడం విచారకరం. అప్పటి నుంచి ఇప్పటి వరకు హింస, బెదిరింపులు వారి రోజువారీ జీవితంలో భాగమైపోయాయి. అయినా సరే అక్కడేఉండి పోరాడుతున్న 'గ్వారానీ కైయోవా' కమ్యూనిటీ ప్రజలు.. జీవనోపాధికి దూరమై, తినేందుకు తిండిలేని పరిస్థితుల్లో కాలం వెళ్లదీస్తున్నారు. అంతేకాదు సదరు కంపెనీ ఆధ్వర్యంలో పండిస్తున్న పంట పొలాల్లో భారీగా వినియోగిస్తున్న పురుగు మందులు, రసాయనాల మూలంగా అనారోగ్యం పాలవుతున్నారు. చీప్ చికెన్ కంపెనీతో చేస్తున్న పోరాటంలో రక్తం చిందిస్తున్నారు.
న్యాయం జరుగుతుందా?
ఇప్పటి వరకు అధికారంలోకి వచ్చిన బ్రెజిలియన్ ప్రభుత్వాలు 'గ్వారానీ కైయోవా' కమ్యూనిటీకి న్యాయం చేయడంలో విఫలమయ్యాయి. రాజ్యాంగంలో పేర్కొన్న విధంగా ప్రజలకు భూమిని మంజూరు చేయలేకపోయాయి. 20ఏళ్లుగా వారికి నిరాశ ఎదురవుతున్నా పట్టు విడవకుండా తమ హక్కుల కోసం పోరాడుతున్న కమ్యూనిటీకి మద్దతిచ్చిన ఎర్త్‌సైట్ సంస్థ.. మరిన్ని స్వచ్చంధ సంస్థలు, ఇతర కమ్యూనిటీలు ముందుకు రావాలని కోరింది. మానవ హక్కులు దుర్వినియోగం అవుతుంటే.. కళ్ల ముందే ఇంతటి ఘోరాలు జరుగుతుంటే.. చూస్తూ ఊరుకోవాల్సిందేనా? అని ప్రశ్నిస్తోంది. ఇలాంటి కంపెనీతో వ్యాపారం అవసరమా అని అడుగుతోంది?