మంత్రి పేకాట ఆడుతున్న ఫొటో వైరల్.. కేబినెట్​ నుంచి బర్తరఫ్ ​చేయాలని డిమాండ్

దిశ, తెలంగాణ బ్యూరో: బాధ్యతాయుత మంత్రి పదవిలో ఉండి, సభ్య సమాజం సిగ్గుపడే రీతిలో జూదం ఆడుతూ పేకాట రాయుడిగా పట్టుబడ్డ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుని కేబినెట్​ నుంచి బర్తరఫ్​ చేయాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్​ డిమాండ్​చేశారు.

Update: 2022-03-16 15:46 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: బాధ్యతాయుత మంత్రి పదవిలో ఉండి, సభ్య సమాజం సిగ్గుపడే రీతిలో జూదం ఆడుతూ పేకాట రాయుడిగా పట్టుబడ్డ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుని కేబినెట్​ నుంచి బర్తరఫ్​ చేయాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్​ డిమాండ్​చేశారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి పేకాట ఆడుతూ ఉన్నాడంటూ ఫొటోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్ నిషేధిత మత్తు పదార్థాలు బహిరంగ ప్రదేశాల్లో తింటూ మీడియా కంటికి చిక్కారని గుర్తు చేశారు. రాష్ట్రంలో పొగాకు ఉత్పత్తులను బ్యాన్​ చేశారని, ఎక్కడైనా పోలీసులు దాడులు చేసి పట్టుకుంటున్నారని, కానీ మంత్రులకు ఎలా దొరికిందని, ఎవరు స్మగ్లింగ్​చేస్తున్నారని ప్రశ్నించారు. బ్యాన్ చేసిన మత్తు పదార్థాలు తింటున్న మంత్రులపై పోలీసులు క్రిమినల్ కేసులు పెట్టాలని గతంలో డిమాండ్ చేశామని, కానీ, తేలు కుట్టిన దొంగల్లా ప్రభుత్వం, అధికారులు దానిపై స్పందించకుండా మంత్రులను కాపాడారని అన్నారు.

తాజాగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేకాడుతూ పట్టుబడ్డ చిత్రాలు సామజిక మాధ్యమాల ద్వారా వైరల్ అవుతున్నాయని, అలాంటి సన్నాసి మంత్రుల ద్వారా బంగారు తెలంగాణ ఎలా సాధిస్తారో సీఎం కేసీఆర్ చెప్పాలని శ్రవణ్​ ప్రశ్నించారు. ఇలాంటి వారిని మంత్రులుగా చేసి, వారితో పని చేయించకుండా, వాళ్ళ శాఖలు కూడా తన కంట్రోల్ పెట్టుకుని డమ్మీ మంత్రులుగా మార్చి, పనిలేని మంత్రులని పేకాటరాయుళ్ళుగా మార్చుతున్నారా? అని కేసీఆర్‌ను ప్రశ్నించారు. సాధారణ పౌరులు వినోదం కోసం పేకాట ఆడితే కేసులు పెట్టి నానా హింసలు పెట్టే పోలీసులు ఎందుకు ఎర్రబెల్లి, ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడం లేదన్నారు. గుట్కారాయుళ్ళు, గ్యాంబ్లర్స్‌తో బంగారు తెలంగాణ సాధ్యం కాదని, ఇలాంటి సన్నాసులకు మంత్రులుగా కొనసాగే అర్హత లేదని, వెంటనే వీరిని మంత్రి పదవుల నుంచి బర్త్‌రఫ్ చేసి క్రిమినల్ కేసులు పెట్టాలని శ్రవణ్​డిమాండ్​ చేశారు.

Tags:    

Similar News