కామ్రేడ్ మల్లు స్వరాజ్యం జీవిత విశేషాలు.. రాజకీయ నేపథ్యం
దిశ, తుంగతుర్తి: ఉద్యమాలకే ఊపిరిలూదిన ఎర్రమందారానికి ఊపిరి ఆగిపోయింది. యావత్ లోకానికి టాటా చెబుతూ.. Latest Telugu News..
దిశ, తుంగతుర్తి: ఉద్యమాలకే ఊపిరిలూదిన ఎర్రమందారానికి ఊపిరి ఆగిపోయింది. యావత్ లోకానికి టాటా చెబుతూ నింగికెగిసింది. ఫలితంగా పల్లెలు, పట్నాలు, వీధులు, వాడలు కన్నీరు కారుస్తున్నాయి. ఇన్నాళ్లు కళ్ళారా చూసుకున్న మిమ్మల్ని ఇక స్మరించుకోవడమేనా..? అంటూ గొల్లున రోదిస్తున్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో వీరోచిత పోరాటాన్ని సాగించి విజయం సాధించిన తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ మల్లు స్వరాజ్యం (92) హైదరాబాద్ కేర్ ఆస్పత్రిలో 19 రోజులుగా మరణంతో యుద్ధం చేస్తూ చివరికి ఓటమి పాలయ్యారు. స్వరాజ్యం అంటేనే ఒక కాళికా శక్తి.. ఒక విప్లవం.. ఒక వీర వనిత.. ఒక ధీశాలి.. ఒక యోధురాలు.. ప్రత్యర్థుల సింహస్వప్నం.. ఇలా ఎన్ని చెప్పుకున్నా తక్కువే. ఇంతటి ఘనాపాటి కీర్తిని తన సొంతం చేసుకున్న మల్లు స్వరాజ్యం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కొత్తగూడెం గ్రామంలో భీమిరెడ్డి రామ్ రెడ్డి, చొక్కామ్మ దంపతులకు 1931లో మూడవ సంతానంగా జన్మించారు. వీరిలో పెద్దవారు తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, మాజీ ఎంపీ భీమిరెడ్డి నరసింహారెడ్డి (మరణం. మే 9,2008), రెండవ వారైన అక్క దాయం శశిరేఖ (మరణం 1996), మూడవ వారు స్వరాజ్యం కాగా నాలుగో వారు చెల్లి మల్లు సరస్వతి ( 12 నవంబర్ 2018), 5వ వారు తమ్ముడు భీమిరెడ్డి కుశలవ రెడ్డి (మరణం. మే 9, 2010).
అయితే స్వరాజ్యం తన చిన్నతనంలోనే అంటే 14 సంవత్సరాల వయసులోనే తన అన్న భీమిరెడ్డి నరసింహారెడ్డి స్ఫూర్తిని అందిపుచ్చుకొని తెలంగాణ సాయుధ పోరాటంలో అడుగు పెట్టారు. ఆనాడు ఆంధ్ర మహాసభ పిలుపు మేరకు వ్యవసాయ కూలీల రేట్ల పెంపుదల, వెట్టి చాకిరి విముక్తి తదితర కార్యక్రమాల అమలులో ఆమె ప్రధాన భూమిక పోషించారు. భీమిరెడ్డి నరసింహారెడ్డి తెలంగాణ సాయుధ పోరాటంలో భాగంగా జైలుకు వెళ్తున్నప్పుడు చెల్లెలు స్వరాజ్యంకు సాగించే వీరోచిత పోరాటాలలో వెనుతిరిగి చూడొద్దు అంటూ హితబోధ చేశారు. ఇందులో భాగంగానే రజాకార్ల అణచివేతలో దద్దరిల్లి పోతున్న పేద ప్రజల అండ చేరి వీరోచితమైన పోరాటాలకు ఊపిరిలూదారు. తుపాకులు చేత బట్టి దళ కమాండర్ స్థాయికి ఎదిగారు. ఈ పరిణామంలో స్వరాజ్యంను పట్టుకున్న, ఆచూకీ తెలిపిన వారికి పదివేల నాణెములు బహుమతిగా ఇస్తామంటూ రజాకార్లు ప్రకటించారు. కానీ రజాకార్ల ఎత్తుగడలు ఏవీ పని చేయలేదు. అంతేకాకుండా రహస్యమైన పోరాటాలు సాగిస్తూ ప్రజల సంరక్షణలో రజాకార్ల గుండెల్లో గూడు కట్టుకున్నారు. కాగా తన దళంలోనే సభ్యులుగా పనిచేస్తున్న మల్లు వెంకటనర్సింహారెడ్డి (వీరిది తుంగతుర్తి నియోజకవర్గం మామిళ్లమడవ గ్రామం)తో 1951లో స్వరాజ్యంకు వివాహమైంది.
అత్యంత నిరాడంబరంగా హైదరాబాదులో పెళ్లి
పెళ్లి అంటే అప్పటి సాంప్రదాయాల ప్రకారం గొప్ప గొప్ప ఆచారాలు, విశేషాలు ఉండేవి. కానీ కాబోయే దంపతులైన మల్లు వెంకటనర్సింహారెడ్డి, స్వరాజ్యం తమ స్వగ్రామమైన మామిళ్లమడవలో కాకుండా హైదరాబాదులోని పాత ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో అప్పటి ఎమ్మెల్యే దేవులపల్లి వెంకటేశ్వరరావు తదితర అగ్రనేతల సమక్షంలో దండలు మార్చుకుని నిరాడంబరంగా వివాహం చేసుకున్నారు. అనంతరం ఆమె పేద ప్రజల పక్షాన సాగిస్తున్న పోరాటంలో ఏమాత్రం వెనుతిరిగి చూడలేదు. ఒకవైపు భర్త వెంకట నరసింహారెడ్డి, మరోవైపు తాను వివిధ రకాల పోరాటాల్లో సముచితమైన పాత్రలను పోషించారు. ముఖ్యంగా స్వరాజ్యం సాగించిన తన సుదీర్ఘ పోరాటంలో వందల సార్లు పోలీసుల చేత అరెస్టులు కాబడినప్పటికీ వ్యక్తిగతంగా వెంటనే విడుదల అయ్యారు.కానీ ఆమె ఏనాడు కూడా చెరసాల జీవితం గడప లేదని వారి బంధుగణం చెప్తుంటారు.
సీపీఎంలో అగ్ర నాయకురాలిగా..
1957లో తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుండి పిడిఎఫ్ తరఫున పోటీ చేసి గెలిచిన అన్న భీమిరెడ్డి నరసింహారెడ్డి వెంట ఆమె ప్రయాణం ఎన్నికల వైపు కొనసాగింది. అనంతరం 1967లో సీపీఎం నుండి పోటీ చేసిన అన్న నరసింహారెడ్డి గెలుపు కోసం ఆమె వెన్నంటి సాగారు. అనంతరం మారిన రాజకీయ పరిస్థితులతో 1972లో సీపీఎం నుండి భర్త మల్లు వెంకటనర్సింహారెడ్డి పోటీ చేసినప్పటికీ స్వతంత్ర అభ్యర్థి జి.వెంకట నరసయ్య చేతిలో ఓటమి పాలయ్యారు.
రెండు గెలుపులు...రెండు ఓటములు..!
ఇంతకాలం అన్న భీంరెడ్డి నర్సింహారెడ్డి,భర్త మల్లు వెంకటనర్సింహారెడ్డి విజయాల కోసం ముందుండి సాగిన మల్లు స్వరాజ్యం చివరికి తానే తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ రంగంలోకి దిగారు. అయితే తన పోటీ కాలంలో గెలుపు ఓటములను ఆమె సమాన స్థాయిలో పంచుకోవడం అతి పెద్ద విశేషం. ఆమె తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుండి మొత్తంగా నాలుగు సార్లు సీపీఎం నుండి పోటీ చేసినప్పటికీ అందులో రెండు సార్లు విజయం సాధించగా మరో రెండు సార్లు ఓటమి పాలయ్యారు.1978,1983 ప్రాంతాల్లో స్వరాజ్యంను తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలు అక్కున చేర్చుకుంటే 1985, 1989లో మాత్రం తిరస్కరించారు. 1978లో తొలిసారిగా తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎన్నికల బరిలోకి దిగిన స్వరాజ్యంకు ప్రత్యర్థులుగా కాంగ్రెస్ నుండి జి.వెంకట నరసయ్య, స్వతంత్రంగా జెన్నారెడ్డి శ్యాంసుందర్ రెడ్డిలు నిలుచున్నారు. చివరికి 25 వేల 580 ఓట్లను సాధించి స్వతంత్ర అభ్యర్థి జెన్నారెడ్డి శ్యామ్ సుందర్ రెడ్డిపై విజయం సాధించారు. తిరిగి 1983లో రెండవ మారు సీపీఎం నుండి పోటి చేసి 19 వేల 465 ఓట్లతో విజయం సాధించారు. అనంతరం ముచ్చటగా మూడోసారి మిత్ర పక్షాల ఒప్పందం (తెలుగుదేశం,సీపీఎం) మేరకు సీపీఎం నుండి 1985లో పోటీకి దిగిన స్వరాజ్యంకు ఇక్కడి నుండే అపజయాలు ఎదురయ్యాయి.
ఈ ఎన్నికల్లో సీపీఎం నుండి పోటీ చేసిన మల్లు స్వరాజ్యంపై (ఓట్లు 32,990) తొలిసారిగా కాంగ్రెస్ నుండి పోటీ చేసిన రామిరెడ్డి దామోదర్ రెడ్డి (ఓట్లు 45,085) విజయం సాధించారు. ఇక్కడ స్వరాజ్యం ఓటమికి తమ్ముడు భీమిరెడ్డి కుశలవ రెడ్డి పరోక్షం కారణంగా నిలిచారనేది ఇప్పటికీ ప్రచారంలో ఉంది. ఈ మేరకు కుశలవ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుండి బహిష్కరణకు గురయ్యారు. తిరిగి 1989లో నాలుగవ సారి టీడీపీ, సీపీఎం పొత్తులో భాగంగా సీపీఎం నుండి మిత్ర పక్షాల అభ్యర్థిగా పోటీ చేసిన మల్లు స్వరాజ్యం కాంగ్రెస్ నుండి రెండో మారు పోటీ చేసిన రామిరెడ్డి దామోదర్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ముఖ్యంగా మిత్రపక్షాల ఒప్పందంలో భాగంగా టీడీపీ నుండి పోటీ చేసే అవకాశం దక్కకపోవడంతో స్వరాజ్యం తమ్ముడు భీమిరెడ్డి కుశలవ రెడ్డి ఈసారి ఏకంగా పోటీ రంగంలోకి దిగడంతో టీడీపీ అధిష్టానం ఆయనను సస్పెండ్ చేసింది. ఈ ఎన్నికల్లో దామోదర్ రెడ్డికి 36 వేల 125 ఓట్లు వస్తే రెండో స్థానంలో నిలిచిన స్వరాజ్యంకు 31 వేల,072 ఓట్లు లభించాయి. మూడో స్థానంలో టీడీపీ నుండి సస్పెన్షన్‌కు గురై స్వతంత్ర అభ్యర్థిగా నిలిచిన భీమిరెడ్డి కుశలవ రెడ్డికి 25 వేల 157 ఓట్లు లభించాయి.
ఇక్కడ ప్రధానంగా మిత్రపక్షాలైన టీడీపీ, సీపీఎంలకు చెందిన ఓట్లను కుశలవ రెడ్డి భారీ ఎత్తున చీల్చడం వల్లే స్వరాజ్యం ఓటమికి ప్రధాన కారణంగా మారింది. తదనంతరం ఆమె తుంగతుర్తి అసెంబ్లీ నుండి పోటీ చేయడానికి అయిష్టత వ్యక్తం చేస్తూ దూరంగా ఉన్నారు. నాటి నుండి నేటి వరకు (అంటే చనిపోయే వరకు) పేదల పక్షాన జరిగే పోరాటాలలో కీలక పాత్రలను పోషించారు. సీపీఎం పార్టీలో వివిధ హోదాలలో కొనసాగారు. మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలిగా సారాయికి వ్యతిరేకంగా, మహిళలకు సమాన హక్కులు,తదితర వాటిపై జరిపిన పోరుబాట ఒక చారిత్రాత్మకంగా నిలిచింది. దీనిపై అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు తీవ్రస్థాయిలో స్పందించారు.ఇలా పార్టీలో ఎన్నెన్నో హోదాలలో కొనసాగుతూ ప్రస్తుతం సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ ఆహ్వానితులుగా ఉన్నారు.
ఇదిలా ఉంటే స్వరాజ్యం, వెంకట నరసింహ రెడ్డి దంపతులకు ముగ్గురు సంతానం. వీరంతా రాజకీయంగా తలపండిన నేతలే. తల్లిదండ్రుల భావజాలంలో పయనించి ఎవరికి వారే తమకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నారు. మొదటి వారైన గౌతమ్ రెడ్డి హోమియోపతి డాక్టర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. ప్రస్తుతం మిర్యాలగూడ పట్టణ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. రెండవ సంతానమైన పాదూరి కరుణ మొదట్లో తల్లి స్వరాజ్యం బాటలో పయనించినప్పటికీ సినీ నటుడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్లి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మూడవ వారైన మల్లు నాగార్జున రెడ్డి ప్రస్తుతం సూర్యాపేట జిల్లాకు సీపీఎం పార్టీ తరపున కార్యదర్శిగా కొనసాగుతుంటే స్వరాజ్యం కోడలు (నాగార్జున రెడ్డి భార్య) మల్లు లక్ష్మి ఐద్వా ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతుండడం మరో విశేషం.
అగ్రవర్ణాలయినా..పేదల కోసమే..!
మల్లు స్వరాజ్యం పుట్టినిల్లు, మెట్టినిల్లు రెండూ కూడా అగ్రవర్ణాలకు చెందినవే అయినప్పటికీ భావాలన్నీ పేద ప్రజల చుట్టూ పెనవేసుకుపోవడం గొప్ప చారిత్రాత్మకంగా పేర్కొనవచ్చు. తామంతా గొప్ప కులంలో పుట్టామనే గర్వం మాటల్లో, నడవడికల్లో కానీ ఏమాత్రం కూడా మచ్చుకైనా కనపడదు. ఎంతో గంభీరమైన ముఖవర్చస్సుతో పట్టు పరుపులు, పట్టు బట్టలు, ఉయ్యాలలు, రాజమకుటంతో ఉండే కుర్చీల్లో కూర్చుని ఇష్ట రకాలైన భోజనాలతో గడిపే వారిలో అవేమి కనిపించవు. వారంతా ఎక్కడికి వెళ్ళినా పేదోడి ఇంటనే పచ్చళ్ళు, కారం, పెరుగుతో భోజనాలు చేయడం, నేలపై చాప వేసుకొని పడుకోవడం, ఇలాంటివెన్నో వంట పట్టించుకోవడం విశేషం.