తలకిందులైన సర్కార్ ప్లాన్.. ఆ ఇండ్ల వేలంలో భారీ షాక్

దిశ, తెలంగాణ బ్యూరో: రాజీవ్ స్వగృహ ఇండ్ల అమ్మకాల్లో సర్కారుకు షాక్ తగిలింది. మధ్య తరగతి వర్గాలను కాదని.. రియల్​ సంస్థలకు కట్టబెట్టే ప్లాన్​ తిరగబడింది.

Update: 2022-03-18 01:54 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాజీవ్ స్వగృహ ఇండ్ల అమ్మకాల్లో సర్కారుకు షాక్ తగిలింది. మధ్య తరగతి వర్గాలను కాదని.. రియల్​ సంస్థలకు కట్టబెట్టే ప్లాన్​ తిరగబడింది. కారణాలేమైనా స్వగృహ ఇండ్లను టవర్ల వారీగా కొనుగోలు చేసేందుకు కంపెనీలు ముందుకు రావడం లేదు. ధర తగ్గించాలంటూ అధికారులకు సలహాలిస్తున్నారు. ఇంతకు మించి ధర తగ్గిస్తే పెద్దగా లాభం ఉండదని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో మళ్లీ ఒక్కో ప్లాట్​తరహాలో విక్రయించేందుకు ప్రభుత్వం పునరాలోచనలో పడింది. దీనిపై కొన్ని మార్పులు చేస్తూ సీఎం కేసీఆర్‌కు నివేదిక పంపిస్తున్నారు. ఇప్పుడున్న వాటిని యధాతథంగా విక్రయించాలని మార్పులు చేస్తున్నారు. గతంలో మౌలిక సదుపాయాలతో పాటు వసతులు, ఇండ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి టెండర్ దక్కించుకున్న సంస్థలకు ఇస్తామని నిబంధనల్లో పెట్టారు. కానీ మధ్య తరగతి వర్గాలకు ఒక్కో ఇంటి వారీగా అమ్మితే మాత్రం యధాతథంగా అమ్మాలని భావిస్తున్నారు.

అయితే.. కుదరదు

రాజీవ్​ స్వగృహ ఇండ్లను టవర్ల వారీగా అమ్మేందుకు ప్రభుత్వం గత నెల 24న నోటిఫికేషన్​ విడుదల చేసింది. నాగోల్‌లోని బండ్లగూడలో 15 టవర్లను కనీస ధరగా చదరపు అడుగుకు రూ.2200 నుంచి రూ.2700లకు, ఖమ్మం జిల్లా పోలేపల్లిలోని 8 టవర్లకు చదరపు అడుగుకు రూ.1500నుంచి రూ.2 వేలుగా ధరలను ఖరారు చేస్తూ ప్రభుత్వం టెండర్లు పిలిచింది. టెండర్లలో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్లకు చివరితేదీ మార్చి 22గా నిర్ణయించింది. దీనిలో భాగంగా ప్రీ బిడ్‌ సమావేశం ఈ నెల 4న ఓసారి, 14న మరోసారి రెండు దశల్లో నిర్వహించగా.. పలు కంపెనీలు ఆసక్తి చూపించలేదు. ఒకటీ, రెండు రియల్​ సంస్థలు వచ్చినా వెనకడుగు వేశాయి. ఈ రిజిస్ట్రేషన్​ కూడా చేయించుకోలేదు. షెడ్యూల్​ ప్రకారం బండ్లగూడలో ఈ వేలం మార్చి 24న ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12 గంటలవరకు, ఖమ్మంలో అదేరోజున మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించాల్సి ఉండగా.. దాన్ని వాయిదే వేసే అస్కారముంది.

కథ అడ్డం తిరిగింది

రాజీవ్ స్వగృహ ఇండ్లపై మధ్య తరగతి వర్గాలు చాలా ఆశలు పెట్టుకున్నాయి. వాటిని ఫ్లాట్లుగా విక్రయిస్తే కొనుగోలు చేసేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే రాజీవ్​ స్వగృహ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి అప్లికేషన్​ రుసుంను తిరిగి చెల్లించారు. కానీ, ప్రభుత్వం టవర్లను టోకుగా కొనుగోలు చేసేందుకు అర్హులైన బిల్డర్లు, కాంట్రాక్టర్లను ప్రభుత్వం ఆహ్వానించింది. యధాతథ స్థితిలో కాకుండా.. మౌలిక సదుపాయాలను పూర్తి చేసి అందించనున్నట్లు పేర్కొంది. బండ్లగూడలోని ఫ్లాట్లకు ప్రీ బిడ్‌ ఈఎండీ ధర రూ. 10లక్షలను, ఖమ్మం జిల్లా పోలేపల్లి ఫ్లాట్లకు రూ. 5లక్షలు ఈఎండీ ఒక్కో టవర్‌కు చెల్లించాల్సి ఉండగా.. ఇప్పటి వరకు ఒక్క సంస్థ కూడా చెల్లింపులు చేయలేదు. ఇప్పుడు టవర్ల వారీగా అమ్ముడుపోవడం లేదని భావించిన అధికారులు.. వాటిపై పునరాలోచనలో పడ్డారు. ఒక్కో ప్లాట్​గా విక్రయించాలని భావిస్తున్నారు. దీనిపై సీఎం కేసీఆర్​ అనుమతి కోసం నివేదిక పంపించారు. సీఎం నుంచి అమోదం రాగానే.. వాటిని వేర్వేరుగా అమ్మకానికి పెట్టనున్నారు. బండ్లగూడ, ఖమ్మంతో పాటుగా ప్రస్తుతం నిర్మాణాలు కొంతమేరలో ఆగిన అన్నింటినీ ఒక్కొక్కటిగా అమ్మాలని నివేదికల్లో పేర్కొన్నారు. అధికారుల రిపోర్టు ప్రకారం పోచారంలో 19 టవర్లలో 3,920 ఫ్లాట్లు ఉండగా, ఇందులో 180 ఫ్లాట్లను అమ్మేశారు. 1,470 నిర్మాణాలు పూర్తికాగా, 954 అసంపూర్తిగా ఉన్నాయి. బండ్లగూడలో 2,746 ఫ్లాట్లు ఉన్నాయి. 500 విక్రయించగా, 2,246 ఫ్లాట్ల నిర్మాణం పూర్తయ్యింది. ఖమ్మంలో ఎనిమిది టవర్లలో 576 ఫ్లాట్లు నిర్మించారు. కొంత వరకు పనులు జరిగాయి. జవహర్‌నగర్‌లో 2,816 ఫ్లాట్ల నిర్మాణం కొంత వరకు పూర్తయ్యింది. గాజులరామారంలో 796 ఫ్లాట్ల నిర్మాణం కొంత వరకు పూర్తయ్యింది.

Tags:    

Similar News