ఆ ఎన్నిక జరగకపోవడానికి ఆంతర్యం ఏమిటో..?
దిశ ప్రతినిధి, వరంగల్: మున్సిపల్ పాలకవర్గం - Co-option elections have not been held in Torroor municipality for the past two years
దిశ ప్రతినిధి, వరంగల్: మున్సిపల్ పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేసిన రోజే కో ఆప్షన్ల ఎన్నిక జరుగాల్సి ఉంటుంది. కానీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకుర్తి నియోజకవర్గ పరిధిలో ఉన్న తొర్రూరు మున్సిపాలిటిలో పాలకవర్గం కొలువుదీరి రెండు ఏళ్లు దాటినా కో ఆప్షన్ల ఎన్నిక జరగకపోవడం గమనార్హం. మహబూబాబాద్ జిల్లాలో తొర్రూరు, మరిపెడ, డోర్నకల్, మహబూబాబాద్ మున్సిపాలిటీలు ఉండగా.. తొర్రూర్ మున్సిపాలిటీ మినహా మిగిలిన మూడు మున్సిపాలిటీలకు పాలకవర్గం కొలువుదీరిన రోజే కో ఆప్షన్ల ఎన్నికలు జరిగాయి.
ముందుకు సాగని ఎన్నికల ప్రక్రియ..
మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం తొర్రూరు మున్సిపల్ కో ఆప్షన్ల ఎన్నిక కోసం నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ గుండె బాబు గత నెల మార్చి 21న ప్రకటించారు. ఈ నోటిఫికేషన్ లో కో ఆప్షన్ ఎన్నిక కోసం దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్ధుల అర్హతలు, దరఖాస్తు చేసే చివరి తేదీ మినహా వచ్చిన దరఖాస్తుల పరిశీలన, ఉపసంహరణ మరియు ఎన్నిక తేదీలు ప్రకటించలేదు. నేటికీ 15 రోజులు గడుస్తున్నా కో ఆప్షన్ల ఎన్నిక ప్రక్రియలో దరఖాస్తుల స్వీకరణ తప్ప.. మిగతా ఎన్నికల ప్రక్రియ ముందుకు సాగకపోవడం విశేషం.
ఆలస్యం వెనుక ఆంతర్యం ఏమిటో..?
ఇప్పటికే తొర్రూరు మున్సిపల్ కో ఆప్షన్ల ఎన్నికకు రెండు ఏళ్లు ఆలస్యంగా నోటిఫికేషన్ వచ్చినా.. ఎన్నిక నిర్వహించడంలో ఎన్నిక రిటర్నింగ్ అధికారి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నామినేషన్లు దాఖలు చేసిన వారిలో అనర్హులను కో ఆప్షన్ ఎన్నికల బరిలో నిలిపేందుకు, డాక్యుమెంట్ సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నారని అభ్యర్థులు చర్చించుకుంటున్నారు.