మహిళల రక్షణ మా బాధ్యత: సీఎం వైఎస్ జగన్
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల - CM YS Jagan said that the protection of women is our responsibility
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. ఇందులో భాగంగా మహిళలకు పటిష్టమైన భద్రతను కల్పించడంలో భాగంగా క్షేత్ర స్థాయిలో నేరాలను అరికట్టడం కోసం విజిబుల్ పోలీసింగ్‌ను మెరుగుపరచడం కోసం ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ దిశ పెట్రోలింగ్‌ను ప్రారంభించింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే అన్ని పోలీస్ స్టేషన్లకు 900 ద్విచక్ర వాహనాలు (స్కూటర్లు) మహిళల రక్షణ కోసం పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా పోలీస్ శాఖ 163 ఫోర్ వీలర్ వాహనాలను పంపిణీకి సిద్ధం చేసింది. ఈ దిశ ఫోర్ వీలర్ వాహనాలను సచివాలయం ప్రధాన గేటు వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లాంఛనంగా జెండా ఊపి ప్రారంభించారు. మహిళల సంక్షేమంతో పాటు రక్షణ, భద్రత విషయంలో ఈ ప్రభుత్వం రాజీపడదని.. వారందరికీ కొండంత అండగా ఉంటుందని సీఎం వైఎస్ జగన్ తెలిపారు.
మహిళా పోలీసుల కోసం 30 కార్ వాన్స్..
'రాష్ట్రంలో 1 కోటి 16 లక్షల మంది అక్కచెల్లెమ్మల చేతిలో దిశ యాప్ ఉంది. ఇన్ని డౌన్‌లోడ్స్ ఒక చరిత్ర. మహిళల భద్రత కోసం దాదాపుగా 15 వేల గ్రామ, వార్డు సచివాలయాల్లో ఒక మహిళా పోలీస్ కూడా పనిచేస్తుంది. ఎక్కడైనా ఒక అక్క చెల్లెమ్మ మీద ఏదైనా అన్యాయం జరిగితే మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ ప్రభుత్వం ఊరుకోదు అన్న సంకేతం పంపిస్తున్నాం. ఒక్క సామాన్య అక్కచెల్లెమ్మలే కాదు.. పోలీసు వృత్తిలో ఉన్న అక్కచెల్లెమ్మలకు మంచి చేసే దిశగా అడుగులు వేస్తున్నాం అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు.
ఇంతకుముందు పోలీస్ స్టేషన్‌లలో అక్కచెల్లెమ్మలకు ప్రత్యేకంగా రెస్ట్‌రూమ్ ఉండేది కాదు. ఈ రోజు ప్రతి పోలీస్ స్టేషన్‌లోనూ మహిళలకు ప్రత్యేకంగా వాష్‌రూమ్‌లు ఉండటంతో పాటు బందోబస్తుకు వెళ్లినప్పుడు కూడా అక్కచెల్లెమ్మలకు ఎటువంటి ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశ్యంతో ఈ రోజు ప్రత్యేకంగా వాష్‌రూమ్స్, డ్రెస్సింగ్ రూములు ఉండే విధంగా.. 18 కార్ వాన్స్‌ను కూడా ప్రారంభిస్తున్నాం.
మొత్తం 30 కార్‌వాన్స్ ప్రారంభించే కార్యక్రమంలో భాగంగా ఇవాళ 18 వచ్చాయి, వాటిని ప్రారంభిస్తున్నాం. మరో 12 రాబోయే రోజుల్లో వస్తాయి. ఈ రోజు కార్‌వాన్స్‌తో పాటు 163 దిశ పోలీస్ ఫోర్‌వీల్ వాహనాలను కూడా ప్రారంభిస్తున్నాం. ఇప్పటికే 900 దిశ ద్విచక్రవాహనాలు వివిధ పోలీస్ స్టేషన్లలో అందుబాటులో ఉన్నాయి. వాటికి అదనంగా 163 పోర్‌వీలర్స్‌ను కూడా అందుబాటులోకి తీసుకువస్తున్నాం' అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు.
ప్రతీ వాహనానికి జీపీఎస్ ట్యాగింగ్..
ప్రతీ పోలీస్ స్టేషన్‌లో ఉన్న ప్రతి వాహనాన్ని అంటే దాదాపు మూడువేల వాహనాలను జీపీఎస్ ట్యాగింగ్ చేసి, దిశకు అనుసంధానం చేసి వాటన్నింటినీ కూడా అందుబాటులోకి తెచ్చాం. ఏదైనా ఆపదలో ఉన్న అక్కచెల్లెమ్మ తన ఫోన్‌ను ఐదుసార్లు అటూ, ఇటూ ఊపితే చాలు.. 10 నిమిషాలలోనే ఆ అక్కచెల్లెమ్మ దగ్గరకు మన పోలీస్ సోదరుడు వెళ్లి అండగా నిలుస్తాడు.
డీఐజీ పాలరాజు, డీజీపీ రాజేంధ్రనాథ్ రెడ్డి, మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఈ విషయంలో బాగా కృషి చేశారు. అందరూ కలిసికట్టుగా ఆ రెస్పాన్స్ టైంను ఇంకా కుదించి.. ఇంకా వీలైనంత త్వరగా 10 నిమిషాల్లోపే అందుబాటులో ఉండే పరిస్థితి రావాలి అనే ఉద్దేశ్యంతో ఈ వాహనాలను ప్రారంభిస్తున్నాం.
దిశకు సంబంధించి డీజీపీ రాజేంద్రనాద్‌రెడ్డి, డీఐజీ పాలరాజకు మరొక్కసారి హామీ ఇస్తున్నా.. దిశ యాప్ కోసం, పనితీరును మెరుగుపర్చేందుకు ప్రభుత్వం తరపునుంచి ఎటువంటి సహకారం కావాలన్నా కూడా అన్ని రకాలుగా ఇచ్చేందుకు సంసిద్ధంగా ఉన్నాం' అని సీఎం వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు, సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి, డీఐజీ పాలరాజు, దిశ స్పెషల్ ఆఫీసర్ కృతికా శుక్లా, తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.