మంత్రి వర్గ విస్తరణపై సీఎం జగన్ కీలక ప్రకటన

రాష్ట్రంలో మంత్రి వర్గ విస్తరణకు సీఎం వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.

Update: 2022-03-11 10:02 GMT

దిశ, ఏపీ బ్యూరో : రాష్ట్రంలో మంత్రి వర్గ విస్తరణకు సీఎం వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ప్రకటించారు. అయితే కొందరు మంత్రులను కొనసాగిస్తానని ప్రకటించేశారు. గతంలో 100శాతం మంత్రులను మార్చేస్తారంటూ వార్తలు వినిపించాయి. ఈసారి మంత్రివర్గ విస్తరణ కాదని పునర్వ్యవస్థీకరణేనంటూ వార్తలు హల్‌చల్ చేశాయి. అయితే వీటన్నింటిని పటాపంచెలు చేస్తూ సీఎం జగన్ తన నిర్ణయాన్ని ప్రకటించేశారు. 100శాతం మంత్రివర్గం మార్చడం లేదని కొందరు మంత్రులు ఉంటారని తేల్చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు కేబినెట్ భేటీ అయ్యింది. ఈ సందర్భంగా సమావేశంలో సీఎం వైఎస్ జగన్ మంత్రివర్గ విస్తరణపై క్లారిటీ ఇచ్చేశారు.

మంత్రి పదవి నుంచి తప్పించిన వాళ్లు పార్టీ కోసం పని చేయాలని దిశానిర్దేశం చేశారు. మంత్రి పదవులు కోల్పోయిన వారు రెస్ట్ మోడ్‌లోకి వెళ్లొద్దని పార్టీ కోసం శ్రమించాలంటూ హితబోధ చేశారు. మంత్రి పదవి నుంచి తప్పించిన వారికి ఆయా జిల్లా ఇన్ చార్జి బాధ్యతలను అప్పగించనున్నట్లు సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఇకపోతే పాతమంత్రులలో కొందరిని కొనసాగించే అవకాశం ఉందని సీఎం వైఎస్ జగన్ పేర్కొనడంతో ఉండేదెవరు? ఊడేదెవరంటూ చర్చ జరుగుతుంది. సీఎం వ్యాఖ్యలతో మంత్రుల్లో టెన్షన్ మెుదలైంది. ఎవరికి పదవీగండం ఉంటుందోనన్న ఆందోళన నెలకొంది. ఎవరు ఇన్ ఎవరు ఔట్ అంటూ సరికొత్త చర్చకు తెరలేపారు. ఇదిలా ఉంటే ఆశావాహులు మాత్రం మంత్రి పదవుల కోసం అప్పుడే పైరవీలు మెుదలుపెట్టేశారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం వైఎస్ జగన్‌ను ప్రసంసలతో ముంచెత్తుతున్నారు.

Tags:    

Similar News