ఎండిన చర్మ కణాల నుంచి ఎలుకల క్లోనింగ్..
దిశ, ఫీచర్స్ : ఫ్రీజ్ చేసిన-ఎండిన చర్మ కణాల నుంచి శాస్త్రవేత్తలు ఎలుకల క్లోన్‌ను సృష్టించగలిగారు..Latest Telugu News
దిశ, ఫీచర్స్ : ఫ్రీజ్ చేసిన-ఎండిన చర్మ కణాల నుంచి శాస్త్రవేత్తలు ఎలుకల క్లోన్‌ను సృష్టించగలిగారు. జపాన్‌లోని యమనాషి యూనివర్సిటీ పరిశోధకులు నిర్వహించిన ఈ అధ్యయనం అంతరించిపోతున్న జీవ జాతుల జనాభాను పునరుద్ధరించేందుకు సాయపడనుంది. వీరు ఫ్రీజ్-డ్రైయింగ్ టెక్నాలజీని ఉపయోగించి ద్రవ నత్రజని లేకుండా కణాలను సంరక్షించే పద్ధతుల కోసం కొంతకాలంగా అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలోనే చివరకు కణాలను సురక్షితంగా, తక్కువ ఖర్చుతో నిల్వ చేసే మార్గాన్ని కనుగొన్నారు.
ఈ సరికొత్త ప్రక్రియలో ఎలుకల తోకల నుంచి సేకరించిన చర్మ కణాలను ఫ్రీజ్ చేశారు. వాటి నుంచి క్లోన్స్ రూపొందించడానికి ప్రయత్నించే ముందుగా ఓ తొమ్మిది నెలల పాటు నిల్వ ఉంచారు. ఫ్రీజ్-డ్రైయింగ్ ప్రాసెస్‌లో చర్మ కణాలు చనిపోతాయి. అయినప్పటికీ ఆ మృత కణాలను వాటి సొంత కేంద్రకాలను సంగ్రహించిన ఎలుక గుడ్లలోకి చొప్పించడం ద్వారా ప్రారంభ దశలో క్లోన్ చేయబడిన పిండాలను సృష్టించగలమని పరిశోధకులు కనుగొన్నారు. 'బ్లాస్టోసిస్ట్స్'గా పిలువబడే ఈ ప్రారంభ దశ పిండాలను మరొక రౌండ్ క్లోనింగ్ ద్వారా మూలకణాల నిల్వలు రూపొందించేందుకు ఉపయోగించారు. మూలకణాలు వాటి సొంత కేంద్రకాలు లేని ఎలుకల గుడ్లలోకి చొప్పించబడ్డాయి. ఫలితంగా ఇది ఎలుకలను సరోగేట్ చేసే పిండాలకు దారితీసింది.
మొట్టమొదటి క్లోనింగ్ ఎలుక 'డోరెమాన్':
మొదట క్లోన్ చేయబడిన ఎలుకకు డోరామి(పాపులర్ కిడ్స్ కార్టూన్ షో డోరెమాన్ పేరు)గా నామకరణం చేశారు. ఆ తర్వాత మరో 74 ఎలుకలను సృష్టించారు. ఈ ప్రక్రియ విజయవంతం అయినప్పటికీ, చర్మ కణాల్లో దెబ్బతిన్న DNAను ఫ్రీజ్ చేయడం వల్ల ఆరోగ్యకరమైన ఆడ, మగ ఎలుక పిల్లలను సృష్టించడంలో సక్సెస్ రేటు 0.2 నుంచి 5.4 శాతంగా ఉంది. కొన్ని కణాల్లో Y క్రోమోజోమ్ పోయినట్లు కూడా పరిశోధకులు గమనించారు. దీని ఫలితంగా మేల్స్ నుంచి పొందిన కణాల ద్వారా ఫిమేల్స్ పుట్టాయి. కాబట్టి మేల్స్ మాత్రమే జీవించి ఉండి, క్రమంగా అంతరించిపోతున్న జాతుల్లో ఈ చికిత్స ద్వారా ఫిమేల్స్‌ను ఉత్పత్తిచేసి ఆయా జాతులను సంరక్షించడం సాధ్యమవుతుంది.