కేటీఆర్ అంకుల్ వాటి నుంచి మాకు రక్షణ ఇవ్వండి.. వినూత్నంగా చిన్నారుల ర్యాలీ!
దిశ, కుత్బుల్లాపూర్: కేటీఆర్ అంకుల్ మాకు కుక్కల నుంచి రక్షణ కల్పించలేరా..? అమల ఆంటీ కుక్కలను మీ ఇంట్లోనే పెంచుకోండి. కమిషనర్ గారు.. వీధి కుక్కలు లేకుండా చేయండి అంటూ.. కుక్కకాటు బాధిత చిన్నారులు చేస్తున్న నినాదాలు అందరినీ కంటతడి పెట్టించేలా మారాయి. ఇలాంటి బాధించే సంఘటన కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి మున్సిపాలిటీ పరిధి ఎన్సీఎల్ నార్త్ కాలనీలో జరిగింది. ఎన్సీఎల్ కాలనీలో గత రెండు సంవత్సరాలుగా వీధి కుక్కలు స్థానికులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. వారంలో ఐదుగురికి పైగా కాటేస్తుండడంతో భయాందోళనకు గురవుతున్నారు. గత నాలుగు నెలల కాలంలో ఏకంగా 90 మందికి కుక్కలు గాయపరిచాయంటే సమస్య ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. స్థానికంగా ఉన్న వైద్యశాలలకు కొవిడ్, ఇతర వ్యాక్సిన్ ల కోసం కాకుండా కుక్క కాటు వ్యాక్సిన్ ల కోసమే ఎక్కువగా వస్తున్నట్లు స్థానికంగా చర్చించుకుంటున్నారు. సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని మహిళలు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా మనమెప్పుడైనా తాగునీటి సౌకర్యం కల్పించాలని, దోమలను అరికట్టాలని ఆందోళనలు చేయడం చూశాము. కానీ, ఎన్సీఎల్ కాలనీలో మాత్రం వినూత్నంగా కుక్కల భారి నుంచి రక్షించాలని చిన్నారులే నిరసన ర్యాలీ చేయడం అధికారులు, పాలకుల పనితీరును చెయ్యెత్తి చూపెడుతోంది.
లక్షలు వెచ్చించాలట మా బాబు సాయంత్రం సమయంలో సైకిల్ నేర్చుకుంటూ వెళ్తున్నాడు. అదే సమయంలో రోడ్డుపై నిల్చున పదుల సంఖ్యలో ఉన్న కుక్కలు దాడి చేసి మొహమంతా గాయపరిచాయి. వైద్యశాలకు వెళితే రూ.55 వేల ఖర్చు అయింది. ముఖమంతా గాయాలవడంతో సర్జరీ చేయాలని డాక్టర్లను ఆశ్రయిస్తే రూ.4 లక్షల వరకు అవుతాయని చెబితే గుండె ఆగినంత పనైంది. మా ఇబ్బందులను గుర్తించి సమస్యను పరిష్కరించాలి. ఇందిర, కుక్క కాటుకు గురైన బాలుడి తల్లి
గతంలో దారి దోపిడీలు, పోకిరీల బెడద ఉందని భయపడేవారని పెద్దలు చెబితే విన్నాను. కానీ మా కాలనీలో అయితే కుక్కలున్నాయని బయటకు వెళ్లేందుకు పెద్దోళ్లు కూడా జంకుతున్నారు. స్కూల్ కు వెళ్లేందుకు భయపడుతున్నాము. కేటీఆర్ అంకుల్, స్థానిక మున్సిపల్ అధికారులు, చైర్మన్ స్పందించి సమస్య లేకుండా చేయాలి. జోషిక, పదవ తరగతి విద్యార్థిని.