కేంద్రం పారా బాయిల్డ్ రైస్ కొనాల్సిందే : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం పారా బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు.
దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం పారా బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రతి గింజను కొనుగోలు చేస్తామని బీజేపీ రాష్ట్ర నాయకులు, మంత్రులు ఇచ్చిన హామీ ప్రకారం ముడి, ఉప్పుడు బియ్యం కొనుగోలు చేసేలా కేంద్రంపై ఒత్తిడి పెంచాలని సూచించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వడ్ల కొనుగోలు ప్రక్రియను చేపట్టాలని డిమాండ్ చేశారు. సాగునీరు అధికంగా ఉన్న కొన్నిచోట్ల ఇప్పటికే వరి ధాన్యం వచ్చిందని, దాన్ని అమ్ముకోవడానికి రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. వ్యవసాయ మార్కెట్లలో దలార్లు మద్దతు ధర కంటే రూ. 500 నుంచి రూ. 600 వరకు తక్కువ తీసుకుంటున్నారని, దీంతో త్రీవంగా రైతులు నష్ట పోతున్నారని అవేదన వ్యక్తం చేశారు. సూర్యాపేట మార్కెట్ లో చోటు చేసుకున్న ఘటన నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే వడ్ల కొనుగోలు ప్రక్రియను చేపట్టాలన్నారు. వడ్ల కొనుగోలు సమస్య ఇలాగే తీవ్రమైతే రానున్న కాలంలో రైతు ఉద్యమం మరింత ఉధృతం అవుతుందని చాడ హెచ్చరించారు.