ఐదేళ్లలో రూ. 200 కోట్ల పెట్టుబడులు పెట్టనున్న 'బాష్'!

న్యూఢిల్లీ: ప్రముఖ ఆటో కాంపొనెంట్ సంస్థ 'బాష్' భారత మార్కెట్లో భారీ పెట్టుబడులకు సిద్ధమవుతోంది..Latest Telugu News

Update: 2022-07-12 09:08 GMT

న్యూఢిల్లీ: ప్రముఖ ఆటో కాంపొనెంట్ సంస్థ 'బాష్' భారత మార్కెట్లో భారీ పెట్టుబడులకు సిద్ధమవుతోంది. రానున్న ఐదేళ్ల కాలంలో అధునాతన ఆటోమోటివ్ టెక్నాలజీ, డిజిటల్ మొబిలిటీ విభాగంలో రూ. 200 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టనున్నట్టు బాష్ గ్రూప్ ఇండియా అధ్యక్షుడు, మేనేజింగ్ డైరెక్టర్ సౌమిత్ర భట్టాచార్య చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సంస్థ రెండంకెల వృద్ధిని సాధించాలనే లక్ష్యంతో ఉందని, అందుకనుగుణంగా పెట్టుబడులను కొనసాగిస్తామని మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఇటీవల చిప్‌ల కొరత, చైనాలో లాక్‌డౌన్ పరిస్థితులు, రష్యా-ఉక్రెయిన్, భౌగోళిక రాజకీయ పరిణామాల వల్ల సరఫరా వ్యవస్థ దెబ్బతిన్నది.

ఈ సవాళ్లను అధిగమించి వ్యాపారాలు పుంజుకుంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కంపెనీ ప్రధానంగా ఫ్యుయెల్ సెల్ విభాగంలో మరింత సామర్థ్యాన్ని పెంచుకోవాలని భావిస్తోంది. ప్రస్తుతం బాష్ సంస్థకు ఎలక్ట్రోమొబిలిటీలో మెరుగైన ఉత్పత్తులు ఉన్నాయి. భారత మార్కెట్లో ఒరిజినల్ పరికరాల తయారీదారులకు సంస్థ సాంకేతికత ద్వారా మద్దతివ్వనుంది. అలాగే, ఎలక్ట్రిఫికేషన్ విభాగంలో కీలకంగా ఉండాలనే ప్రణాళికను కలిగి ఉన్నట్టు బాష్ లిమిటెడ్ ఛైర్మన్ మార్కస్ బాంబర్గర్ తెలిపారు. సంస్థ పోర్ట్‌ఫోలియోలో ఇప్పటికే పవర్‌ట్రెయిన్ మాడ్యూల్స్ ఉన్నాయి. దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వేగంగా ఉన్నప్పటికీ 2030 వరకు ఇంటర్నల్‌ కంబ్యూషన్‌ ఇంజిన్‌ (ఐసీఈ) వాహనాలు 70-75 శాతం వాటాతో ఆధిపత్యం కొనసాగిస్తాయనే నమ్మకం ఉందని మార్కస్ వెల్లడించారు. 


Similar News