'ఒక్క చాన్స్ అన్న జగన్‌కు ఇదే లాస్ట్ చాన్స్'
దిశ, ఏపీ బ్యూరో: విద్యుత్ చార్జీల పెంపుపై - Bonda Uma Maheshwara Rao made sensational comments on the Jagan regime
దిశ, ఏపీ బ్యూరో: విద్యుత్ చార్జీల పెంపుపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమా మహేశ్వరరావు సెటైర్లు వేశారు. వైసీపీ ప్రభుత్వం మూడేళ్ల పాలన కానుకగా రాష్ట్ర ప్రజలకు విద్యుత్ చార్జీలు పెంచారంటూ విమర్శించారు. విజయవాడలోని మెుగల్రాజపురంలో గురువారం ఉదయం బొండా ఉమా మహేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. జగన్ అసమర్థ పాలన వల్ల ప్రజలు వలస బాట పడుతున్నారు అని, మూడేళ్లలో నిత్యావసర వస్తువుల ధరలు, పన్నులను పెంచారు ఇప్పుడు మళ్లీ విద్యుత్ చార్జీలు పెంచి పేదవాడి నడ్డి విరుస్తున్నారు అని మండిపడ్డారు.
అన్ని రకాలుగా జగనన్న బాదుడే బాదుడు అనిపించారు అంటూ ఎద్దేవా చేశారు. 2020, 21 లో విద్యుత్ చార్జీలు, సర్ చార్జీలు పెంచారు.. అది చాలక ఇప్పుడు మళ్లీ రూ.1400 కోట్లు పేద వర్గాల పైనే భారం వేశారు అని విరుచుకుపడ్డారు. ఈ టారిఫ్‌లను పరిశీలిస్తే తుగ్లక్ పాలన అంటే ఏంటో అర్ధమవుతుందని స్పష్టం చేశారు. ధనిక వర్గాలకు 55 పైసలు పెంచి, పేద, మధ్య తరగతి వర్గాల పై 1.55రూపాయలు పెంచడంపై విరుచుకుపడ్డారు. ఎన్నికల ప్రచారంలో జగన్ ఏం వాగ్దానం చేశారు ఇప్పుడు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ అంశాలపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
గతంలో చంద్రబాబును విమర్శిస్తూ.. ఇదే జగన్ పాటలు పాడాడు అనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో విద్యుత్ చార్జీలు పెంచలేదు అని, నిత్యావసర వస్తువులు, గ్యాస్, పెట్రోల్ భారాలు మోపలేదు అని, సుపరిపాలనకు నిదర్శనం చంద్రబాబు పాలన స్పష్టం చేశారని కొనియాడారు. ధరల స్థిరీకరణ కోసం ఐదు వేల కోట్ల నిధులు పెడతామన్నావు ఏమైంది అని ప్రశ్నించారు.. అదేమీ లేకపోగా.. ఇష్టం వచ్చినట్లుగా భారాలు మోపడం సరికాదని అన్నారు.. ఏ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చావో .. ఒక్కసారి గుర్తు చేసుకోవాలని సీఎం జగన్‌కు సూచించారు. అసత్య హామీలు ఇచ్చి.. ఓట్లు వేయించుకుని ప్రజలను మోసం చేశారని .. తుగ్లక్ పాలనలో కూడా ఈ స్థాయిలో భారాలు వేయలేదంటూ మండిపడ్డారు.
సంక్షేమ పథకాలు అమలు చేయలేకే ప్రజలను దోచుకుంటున్నారని.. నీ అసమర్థత, చేతకానితనం వల్లే ఈ భారాలు మోపుతున్నారని మండిపడ్డారు. ప్రజలు ఏమైపోయినా పర్లేదు... నా ఆదాయం, నా కమీషన్లు చాలు అని జగన్ భావిస్తున్నారు అని మండిపడ్డారు.. ప్రజా వ్యతిరేక ప్రభుత్వం అనడానికి జగన్ పాలనే నిదర్శనం.. ఒక్క ఛాన్స్ అన్న జగన్ కు ఇదే లాస్ట్ ఛాన్స్ అని ప్రజలు కూడా డిసైడ్ అయ్యారు అన్నారు.. పెంచిన విద్యుత్ చార్జీలను ప్రభుత్వం నిలుపుదల చేయాలి అని డిమాండ్ చేశారు.
విద్యుత్ చార్జీలు తగ్గించకపోతే టీడీపీ పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతాం అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, మాజీ ఫ్లోర్ లీడర్ ఎరుబోతు రమణ, నేతలు దెందుకూరి మురళి కృష్ణంరాజు, మాచెర్ల గోపి, ఘంటా కృష్ణమోహన్, కొండపల్లి రూప్ కుమార్, బెజవాడ తిరుపతి, పైడి సురేష్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.