రక్తస్రావాన్ని నిరోధించే 'పాము విషం'!
దిశ, ఫీచర్స్ : తీవ్రమైన గాయాల నుంచి రక్తస్రావం కావడం వల్ల ఏటా ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది మరణిస్తున్నారు.
దిశ, ఫీచర్స్ : తీవ్రమైన గాయాల నుంచి రక్తస్రావం కావడం వల్ల ఏటా ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది మరణిస్తున్నారు. ఈ మేరకు భారీ రక్తస్రావాన్ని సమర్థవంతంగా నిరోధించే పద్ధతులను గుర్తించడం పరిశోధకులకు సవాలుగా నిలిచింది. కానీ దీన్ని ఎదుర్కొనేందుకు కొత్తగా ప్రయత్నించిన పరిశోధకులు 'పాము విషమే' ఈ సమస్యకు పరిష్కారమని భావిస్తున్నారు.
అనియంత్రిత రక్తస్రావం వల్ల జరుగుతున్న మరణాల రేటును పరిష్కరించేందుకు ప్రస్తుత రక్తస్రావం నియంత్రణ ఉత్పత్తులు తగినంత ప్రభావవంతంగా లేవని క్వీన్స్‌లాండ్ విశ్వవిద్యాలయంలోని ఆస్ట్రేలియన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ బయో ఇంజనీరింగ్ అండ్ నానో టెక్నాలజీ పరిశోధకులు కిజాస్, ఆమె సహచరులు ఆరోపించారు. నిజానికి చాలా మంది రోగులు ఆసుపత్రికి వెళ్లక ముందే ప్రాణాలు విడుస్తున్నారని పేర్కొన్నారు. దీంతో ఈ సమస్య పరిష్కారానికి కొత్త మార్గాలను అన్వేషించిన పరిశోధకులు
సహజంగా లభించే పాము విషాన్ని పరిశీలించారు. కాగా పాము విషంలోని శక్తివంతమైన ప్రోటీన్లు రక్తం గడ్డకట్టడాన్ని వేగవంతం చేస్తుండటం సహా రక్తం గడ్డకట్టే బ్రేక్‌డౌన్ పాథ్‌వేల(విచ్ఛిన్న మార్గాలను)ను ఆపుతుందని అన్నారు. ఆస్ట్రేలియా అనేక విషపూరిత పాములకు నిలయంగా ఉంది, కాబట్టి ప్రస్తుతమున్న చికిత్సలకు ఇది ఉత్తమ ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు. ఈ పరిశోధన విశేషాలు అడ్వాన్స్‌డ్ హెల్త్‌కేర్ మెటీరియల్స్‌లో తాజాగా ప్రచురితమైంది.
విషంలోని ప్రొటీన్స్‌ను హైడ్రోజెల్ మాదిరిగా ఉపయోగించడం వల్ల కూడా ప్రయోజనముందని పరిశోధకులు పేర్కొన్నారు. ఈ మేరకు ప్రోటీన్‌లతో కూడిన హైడ్రోజెల్ చల్లగా ఉన్నప్పుడు ద్రవంగా ఉంటే, గాయం ఉన్న ప్రదేశాలను తాకినప్పుడు, అది ఉష్ణోగ్రతకు ప్రతిస్పందనగా జెల్‌గా మారుతుంది. ప్రొటీన్‌ను పంపిణీ చేసేటప్పుడు ఇది టూ-ఇన్-వన్ ప్రయోజనాన్ని కూడా కలిగి ఉంది. ద్రవ-నుంచి-జెల్ స్వభావముండే హైడ్రోజెల్ వివిధ టోపోలాజికల్ స్ట్రక్చర్‌లోని గాయాలను ప్రభావవంతంగా కవర్ చేసేందుకు అనుమతిస్తుంది. జిలేషన్ ప్రక్రియ గాయాలను మూసివేస్తుంది, బయటి ఇన్‌ఫెక్షన్‌ను నివారిస్తుంది.
'ప్రస్తుత యాంటీఫైబ్రినోలైటిక్స్ (రక్తం గడ్డకట్టడాన్ని నిరోధించే మందులు) ఇంట్రావీనస్ ఇంజెక్షన్ ద్వారా పంపిణీ చేయబడతాయి. దీనికి వైద్య నిపుణులు అవసరం. ఇక్కడ ప్రస్తుతం వైద్యపరంగా ఉపయోగిస్తున్న ట్రానెక్సామిక్ యాసిడ్ కంటే చాలా ప్రభావవంతమైన ఏజెంట్‌ను వినియోగించే నావల్ అప్రోచ్ తీసుకున్నాం. ఇది సత్ఫలితాలను ఇచ్చింది. పాము విషంలోని రెండు ప్రోటీన్లలో రక్తం వేగంగా గడ్డకట్టడానికి 'ఎకారిన్' కారణమైతే, రక్తం గడ్డలను విచ్ఛిన్నం చేసే శరీర సహజ యంత్రాంగాన్ని టెక్స్టిలినిన్ నిరోధిస్తుంది. అదే పాము కాటు ద్వారా ఇవి శరీరంలోకి వెళితే, ఈ ప్రోటీన్‌ల ప్రభావాలు ప్రాణాంతక కలయికగా పనిచేస్తాయి. అయితే థర్మోరెస్పాన్సివ్ హైడ్రోజెల్ నెట్‌వర్క్‌లో పొందుపరిచినప్పుడు, ఈ ప్రాణాంతకమైన ప్రొటీన్స్‌ను ప్రత్యక్షంగా ప్రాణాలు రక్షించేవిగా మార్చవచ్చు. ఇన్ విట్రో, వివో మోడల్‌లో వాటి ఫార్ములా 60 సెకన్లలోపు రక్తంగడ్డలను ఏర్పరుస్తుందని చూపబడింది. ఇది సహజంగా సంభవించే గడ్డకట్టడం కంటే ఎనిమిది రెట్లు వేగంగా ఉంటుంది' అని శాస్త్రవేత్తల బృందం వివరించింది. అంతేకాదు అనియంత్రిత రక్తస్రావం కారణంగా మరణించే వ్యక్తులను రక్షించేందుకు ఈ విధానాన్ని తీసుకుంటే, రక్త నష్టాన్ని ఐదు రెట్లు తగ్గించవచ్చని పరిశోధకులు నిరూపించారు.