'వెంటనే జాబ్ నోటిఫికేషన్ విడుదల చేయండి'
దిశ, పెగడపల్లి: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను చేయడానికి ప్రభుత్వం ఎందుకు కాలయాపన చేస్తున్నదని బీజేవైఎం మండల అధ్యక్షుడు చింతకింది కిషోర్ ప్రశ్నించారు.
దిశ, పెగడపల్లి: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను చేయడానికి ప్రభుత్వం ఎందుకు కాలయాపన చేస్తున్నదని బీజేవైఎం మండల అధ్యక్షుడు చింతకింది కిషోర్ ప్రశ్నించారు. మండల కేంద్రంలో రాష్ట్ర యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్, జగిత్యాల జిల్లా యువమోర్చా అధ్యక్షుడు రెంటం జగదీష్ ఆదేశాల మేరకు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌లు ఇవ్వకపోవడం మూలంగా ఎంతోమంది యువకులు ఆత్మ హత్యలు చేసుకుంటున్నారని అన్నారు. అయినా, ముఖ్యమంత్రికి ఇవేమీ పట్టడం లేదని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ దారిలోనే మిగతా మంత్రులు కూడా త్వరలోనే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అంటూ కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ, ఏడేళ్లు గడుస్తున్నా.. దానిపై స్పందించడం లేదని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి వెంటనే ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల యువమోర్చా అధ్యక్షుడు చింతకింది కిషోర్, ఉపాధ్యక్షుడు షేర్ అజయ్, నాయకులు మార్రిపెల్లి గంగాధర్, కొత్తూరు బాబు, నేదరి సాయి కృష్ణ, కాషేట్టి రాజు, గూడూరి కైలాసం, సాయిల్ల తిరుపతి తదితరులు పాల్గొన్నారు.