సై అంటే సై అంటున్న బీజేపీ.. టీఆర్ఎస్‌లు

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార - BJP party strategy in the state of Telangana

Update: 2022-03-21 16:15 GMT

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ ఎత్తులు వేస్తూ ముందుకు సాగుతుంటే..అందుకు పై ఎత్తులు వేసేలా బీజేపీ నేతలు వ్యూహాలు రూపొందిస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ పార్టీ ప్రాబల్యం పెరుగుతుందన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ గత కొన్ని నెలల నుంచి ఆ పార్టీని, ఆ పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో వరి ధాన్యం కొనుగోలు అంశాన్ని తెరపైకి తేవడం, తెలంగాణ రాష్ట్రంలో పండుతున్న వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ.. ఢిల్లీలో ఒకింత ఆందోళన కార్యక్రమాలను నిర్వహించిన విషయం పాఠకులకు విధితమే.


ఇటీవల రాష్ట్రంలో రోజురోజుకూ రాజకీయ మార్పులు జరుగుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ సోమవారం ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి..వరి ధాన్యం కొనుగోలు విషయంపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని, అందుకోసం రాష్ట్రంలో అవసరమైన మేరకు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులను ఆదేశించారు. బీజేపీ జనం లోకి వెళ్లకుండా అడ్డుకట్ట వేయాలని పరోక్షంగా సూచనలు చేసిన నేపథ్యంలో.. బీజేపీ అధికార పార్టీ వ్యూహాలను అధిగమించి ప్రజల్లోకి వెళ్లేలా ఊహ రచన చేస్తోంది.

ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర ఇంచార్జీ తరుణ్ ఛుగ్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ సోమవారం సాయంత్రం నారాయణపేట జిల్లాలో పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తల అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఇంచార్జీ తరుణ్ మాట్లాడుతూ.. బీజేపీ పార్టీ రాష్ట్రంలో బలపడుతున్న విషయాన్ని గుర్తించిన సీఎం కేసీఆర్.. పార్టీని దెబ్బతీసేందుకు వ్యూహరచన చేస్తున్నారని చెప్పారు.


కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేయడానికి సరైన అంశాలు లేక వరి ధాన్యం కొనుగోలు అంశాన్ని తెరమీదకు తెస్తున్నారని విమర్శించారు. వరి ధాన్యాన్ని కొనుగోలు చేయమని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు చెప్పలేదన్న అంశాన్ని పార్టీ శ్రేణులు ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని సూచించారు. ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ప్రజల్లోకి మరింతగా వెళ్లాలని ఆయన పార్టీ శ్రేణులను కోరారు.


ఎన్నికలు ఏ సమయంలో వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సన్నద్ధం కావాలని, అందుకు పార్టీ శ్రేణులు సంసిద్ధంగా ఉండాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విజ్ఞప్తి చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల నేతలు అధికార పార్టీ వ్యూహాలను అధిగమించేదెలా ప్రణాళికలను రూపొందించుకొని సై అంటే సై అనే విధంగా ప్రజల్లోకి వెళ్లేలా బీజేపీ నేతలు సన్నద్ధమవుతున్నారు.

Tags:    

Similar News