తెలంగాణలో మార్పు తథ్యం.. రాబోయేది బీజేపీ ప్రభుత్వమే : గడీల శ్రీకాంత్ గౌడ్

తెలంగాణలో అధికార మార్పు తథ్యమని, రాబోయే రోజుల్లో తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరవేయడం ఖాయమని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు.

Update: 2022-07-03 15:48 GMT

దిశ, అమీన్ పూర్ : తెలంగాణలో అధికార మార్పు తథ్యమని, రాబోయే రోజుల్లో తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరవేయడం ఖాయమని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీ విజయ సంకల్ప సభ తెలంగాణలో చరిత్ర సృష్టించిందని ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణలో సరికొత్త మార్పు రాబోతుందని, అందుకు మోడీ సభకు తరలివచ్చిన ప్రజలే సాక్ష్యమని అన్నారు. మోడీ సభకు వచ్చిన జనాలను చూసి కేసీఆర్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని, ఇక కేసీఆర్ ఫార్మ్ హౌస్‌కు మాత్రమే పరిమితం కావాలని అన్నారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వానికి కాలం చెల్లిందని కేసీఆర్ ఏం మాట్లాడినా ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదని పేర్కొన్నారు.

ఎనిమిదేళ్ల టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను భ్రష్ఠు పట్టించారని, కుటుంబ పాలనతో ప్రజల సంపదను దోచుకొని కోట్లకు పడగలెత్తారని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీ సభ ఇచ్చిన స్ఫూర్తితో ప్రజల్లోకి వెళ్తామని, టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఎక్కడికక్కడ ఎండగడతామన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించిన అన్ని వర్గాలను ఒక తాటిపైకి తెస్తామని చెప్పారు. అందరి సహకారంతో వచ్చే ఎన్నికల్లో విజయదుందుభి మోగిస్తామని, తెలంగాణలో అధికారంలోకి వచ్చేది డబల్ ఇంజన్ సర్కారే అని పునరుద్ఘాటించారు. లక్షల సంఖ్యలో తరలివచ్చి విజయ సంకల్ప సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి శ్రీకాంత్ గౌడ్ ధన్యవాదాలు తెలిపారు.

Tags:    

Similar News