కేటీఆర్ వ్యాఖ్యలతో హీటెక్కిన కంటోన్మెంట్.. బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్..

దిశ, కంటోన్మెంట్: మంత్రి కేటీఆర్ కంటోన్మెంట్ బోర్డుపై చేసిన వాఖ్యలు తీవ్ర దూమారాన్ని- latest Telugu news

Update: 2022-03-14 15:34 GMT

దిశ, కంటోన్మెంట్: మంత్రి కేటీఆర్ కంటోన్మెంట్ బోర్డుపై చేసిన వాఖ్యలు తీవ్ర దూమారాన్ని రేపుతున్నాయి. కంటోన్మెంట్ టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య అగ్గిని రాజేస్తున్నాయి. అసెంబ్లీ సాక్షిగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ నాయకులు ఆందోళన చేపడుతుండగా.. బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ మంత్రి వ్యాఖ్యలకు ఇచ్చిన కౌంటర్‌ను నిరసిస్తూ టీఆర్ఎస్ నేతలు భగ్గుమంటున్నాయి. దీంతో కంటోన్మెంట్‌లో రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. ఇరు పార్టీలకు చెందిన నాయకులు ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయం రసవత్తరంగా మారింది.

బేషరత్తుగా క్షమాపణ చెప్పాలి.. జె.రామక్రిష్ణ

కంటోన్మెంట్‌కు నీళ్లు, కరెంట్ కట్ చేస్తామని అసెంబ్లీలో ప్రకటించిన కేటీఆర్ అదే అసెంబ్లీ సాక్షిగా బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, బోర్డు నామినేటేడ్ సభ్యుడు జె.రామక్రిష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జూబ్లీ బస్టాండ్ వద్ద బీజేపీ నాయకులు రాస్తారోకో నిర్వహించి.. మంత్రి కేటీఆర్, కేసీఆర్‌ల దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా రామక్రిష్ణ మాట్లాడుతూ.. కంటోన్మెంట్ కేటీఆర్ తాతా, అయ్యా జాగీర్ కాదన్నారు. కంటోన్మెంట్‌కు నీళ్లు, కరెంట్ బంద్ చేసి చూడాలని సవాల్ విసిరారు. మంత్రి కేటీఆర్ వ్యాఖ్యాలపై ఆర్మీ అధికారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు భానుక మల్లికార్జున్, బి.ఎన్.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా తాడ్ బండ్ చౌరస్తాలో బీజేవైఎం ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నేత ఆకుల నాగేశ్ మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యల వల్ల స్థానిక ప్రజలు, ఆర్మీ అధికారుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు.


కరీంనగర్ వెళ్లనీయం.. టీ.ఎన్.శ్రీనివాస్

బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ వ్యాఖ్యలను నిరసిస్తూ టీఆర్ఎస్ నాయకులు జూబ్లీబస్టాండ్ వద్ద నిరసన వ్యక్తంచేశారు. బోయిన్‌పల్లి మార్కెట్ మాజీ ఛైర్మన్ టీ.ఎన్.శ్రీనివాస్ ఆధ్వర్యంలో బండి సంజయ్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి ఆందోళన చేపట్టారు. మంత్రి కేటీఆర్‌పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కంటోన్మెంట్ మీదుగా కరీంనగర్ వెళ్లనీయమని హెచ్చరించారు. కంటోన్మెంట్ ప్రాంతం గురించి బండి సంజయ్‌కు అవగాహన లేదని మండి పడ్డారు. అదేవిధంగా కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్ ప్రజల పక్షాననే మాట్లాడరని.. ఆర్మీ అధికారులకు వ్యతిరేకంగా మాట్లాడలేదన్నారు. బండి సంజయ్‌కు గానీ, అరవింద్‌కు గానీ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కర్నాటక రాష్ట్రాభివృద్ధికి 200 ఎకరాలు ఇచ్చిన కేంద్ర మంత్రిత్వ శాఖ తెలంగాణ ప్రభుత్వం ప్లై ఓవర్లకు అడిగితే ఎందుకు ఇవ్వడంలేదని ప్రశ్నించారు.

Tags:    

Similar News