ఆ స్వామీ చల్లని చూపుంటే చాలు.. ఇల్లీగల్ కూడా లీగల్ కావాల్సిందే..!
దిశ, శేరిలింగంపల్లి: వారు ఏది చేసినా దాని వెనక ఓ అర్ధం, పరమార్థం ఉంటుంది.- latest Telugu news
దిశ, శేరిలింగంపల్లి: వారు ఏది చేసినా దాని వెనక ఓ అర్ధం, పరమార్థం ఉంటుంది. వారిచ్చే అనుమతుల వెనక ఏదో మతలబు దాగి ఉంటుంది. అన్నీ సక్రమంగా ఉన్నా అనుమతులు అనే సరికి ఏదో ఒక కొర్రీ పెట్టకుండా వదలరు. కానీ ఈ సార్ మాత్రం ఏదీ సరిగ్గా లేకున్నా అడ్డగోలుగా అక్రమ అనుమతులు జారీ చేసేస్తారు. అదేంటి అంటే వీటన్నింటి వెనక పెద్ద సార్ ఉన్నాడు అని ఒకే ఒక్క మాటలో అందరి నోళ్లు మూసేస్తాడు. మా డివిజన్‌లో మాకంటే పెద్ద ఎవరూ, నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు తెలియకుండా ఉంటుందా అని ఓ కార్పొరేటర్ ప్రశ్నిస్తే.. అలాంటివన్నీ చెప్పరు.. నన్నేం అడగద్దు.. నాకేం తెలియదు సార్.. అంటూ తప్పించుకుంటాడు. ఫలానా వ్యక్తి దగ్గర పర్మిషన్ కోసం రూ.10లక్షలు తీసుకున్నారట.. అతను మీ పేరు చెబుతున్నారు అని ఓ సందర్భంలో కార్పొరేటర్ డబ్బులు ఇచ్చిన వ్యక్తి ముందే టీపీఎస్ అధికారిని నిలదీస్తే.. ఏం "స్వామీ" ఇది విన్నావా.. మనం ఎప్పుడైనా అంత డబ్బు చూశామా..? అంటూ తన కింది సిబ్బందితో ఓ నవ్వు నవ్వి అక్కడి నుండి జారుకున్నారట. అదే అధికారి చందానగర్ సర్కిల్ పరిధిలోని గంగారం పెద్ద చెరువులో సాగుతున్న ఇల్లీగల్ నిర్మాణాలకు బఫర్ జోన్ అని తెలిసినా, అడ్డగోలుగా అనుమతులు జారీచేసిన ఘనత ఆయనకే చెల్లుతుంది.
ఈయన రూటే సపరేట్..
అతను పేరుకు తగ్గట్టుగానే చాలా మృధుస్వభావి, ఎప్పుడూ కోపమనేది ఎరుగడు. అంతే మృధువుగా ఆయనకు కావాల్సింది చెబుతాడు. తీసుకోవాల్సింది తీసుకుంటాడు. కానీ ఎప్పుడు చూసినా.. ఎవరు కలిసిన ముందుగా నీతి సూక్తులు చెబుతాడు. అసలు విషయంలోకి వచ్చేసరికి మాత్రం తీసుకోవాల్సింది తీసేసుకుంటాడు అన్న ఆరోపణలున్నాయి. ఒక కార్పొరేటర్ ఫోన్ చేస్తే ఎవరు మీరు, ఏం కావాలి అని కాస్త ఖటువుగానే మాట్లాడే ఈ పెద్ద సార్.. కాసుల విషయానికి వచ్చేసరికి మాత్రం ఆ గాంభీర్యం మచ్చుకైనా కానరాదు.
సార్లు ఓకే చెప్తే చాలు.. అనుమతులు అవసరం లేదు..
చందానగర్, మియాపూర్ డివిజన్‌లో గత కొన్నాళ్లుగా పెద్ద ఎత్తున నిర్మాణాలు సాగుతున్నాయి. వీటిలో కొన్ని అనుమతులకు మించి కట్టడాలు సాగుతుండగా, మరికొన్ని చోట్ల ఏకంగా చెరువు శిఖంలో ఉన్నవాటికే అనుమతులు జారీచేశారు టీపీఎస్ అధికారులు. అదేంటి అంటే అది ఇప్పటిది కాదు గతంలోనే అనుమతులు జారీ అయ్యాయని ఓసారి, బఫర్ జోన్‌లో లేవని మరోసారి ఇష్టారీతిగా సమాధానాలు చెప్పడం అధికారులకు పరిపాటిగా మారింది. ఈ మధ్య పాత భవనాలపై కొత్తగా నిర్మాణాలు సాగిస్తున్నవి చాలానే ఉన్నాయి. మెయిన్ రోడ్డు వెంట వెళ్లే జనాలకు కనిపిస్తున్నా అధికారులకు ఎందుకు కనిపించడం లేదనేది వారికే తెలియాలి.
మొదటి నుండి అదే వరస..
చందానగర్ సర్కిల్‌లో పనిచేస్తున్న ఈ ఆఫీసర్‌పై చాలాకాలంగా అవినీతి ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. గతంలో ఓ డివిజన్‌లో రోడ్డు వైడనింగ్‌లో పోయే ప్లాట్‌కు అనుమతి మంజూరు చేశారు. తీరా ఆ నిర్మాణం సాగుతుండగా ఇది రోడ్డు వైడనింగ్‌లో పోతోంది డిమాలుషన్ చేయాల్సి ఉంటుందని చెప్పడంతో ఆ ప్లాట్ యజమాని జీహెచ్ఎంసీ కార్యాలయానికి వచ్చి నానా రభస చేశారట. అలాగే పలు వివాదాస్పద స్థలాల్లోనూ అనేక నిర్మాణాలకు అడ్డగోలుగా అనుమతులు జారీచేసి అందినకాడికి దండుకున్నారన్నా ఆరోపణలు ఉన్నాయి. ఈ అధికారి దందా మూడు పర్మిషన్‌లు ఆరు అక్రమ అంతస్థులు అనే రేంజ్‌లో సాగుతుందన్న విమర్శలున్నాయి. ఈ అధికారికి పైస్థాయి అధికారుల అండదండలు పుష్కలంగా ఉన్నాయని, అందుకే ఎవరు ఎన్ని ఫిర్యాదులు చేసినా ఏమీ కాదులే అనే ధీమాతో ఉంటారని జీహెచ్ఎంసీ సిబ్బందే గుసగుసలాడుతుంటారు. ఉన్నతాధికారుల సపోర్ట్ ఉండడంతో ఆ అధికారి ఇల్లీగల్ నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేస్తూ అందినకాడికంటే నాలుగింతలు ఎక్కువే వెనుకేస్తున్నారని సమాచారం. ఈయన లాగే తానేం తక్కువ కాదని మరో అధికారి ఏకంగా హై కోర్ట్ ఆర్డర్‌నే బేఖాతర్ చేస్తూ కోర్ట్ ధిక్కరణకు పాల్పడ్డారు.