అరుణ్యకు బ్రాండ్ అంబాసిడర్‌గా నేనే ఉంటా.. స్మితా సబర్వాల్
చదువు, స్కిల్స్ రెండు ముఖ్యమేనని సీఎంఓ అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్ అన్నారు.
దిశ, నారాయణపేట : చదువు, స్కిల్స్ రెండు ముఖ్యమేనని సీఎంఓ అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్ అన్నారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో చేనేత కార్మికుల స్థితిగతులను నాబార్డ్, డీఆర్డీఓ సంయుక్తoగా నిర్వహిస్తున్న ఉచిత కలంకారీ, బ్లాక్ పెయింటింగ్ శిక్షణలో తర్ఫీదు పొందిన వారికి ఆదివారం ప్రశంస పత్రాలను అందించిన అనంతరం ఆమె మాట్లాడారు. నారాయణపేట అనేది కాటన్, సిల్క్ చీరలకు పెట్టింది పేరన్నారు. కొత్త స్కిల్స్ నేర్చుకోడానికని చదువును దూరంగా పెట్టకూడదని, చదువుతో పాటు స్కిల్స్ రెండూ ముఖ్యమన్నారు. జిల్లా కలెక్టర్ మహిళలకు కొత్త కొత్త స్కిల్ డెవలప్‌మెంట్ చేస్తారని జిల్లా కలెక్టర్ హరిచందనను ఆమె ప్రశంసించారు.
ప్రభుత్వం ద్వారా వ్యాపారం చేసే వారికి సహకరించాలని, వారికి లోన్‌లు మంజూరు చేయించి మహిళలు ముందుకు వెళ్లేలా చర్యలు చేపట్టాలన్నారు. మార్కెట్‌లో చాలా అవకాశాలు ఉన్నాయని నేర్చుకున్న వాటిని వదిలేయకుండా ఓ క్రియోటివ్‌గా ఆలోచించి ప్రస్తుత కాలంనుగుణంగా డిజైన్ లను తయారు చేయాలని సూచించారు. ప్రభుత్వం, జిల్లా కలెక్టర్, స్వచ్ఛంద సంస్థలు వివిధ రంగాల్లో నైపుణ్యం నేర్పించడానికి ముందుకు వస్తున్నాయని, ఇలాంటి అవకాశాలను మహిళలు వదులుకోవద్దని కోరారు. ఆ ప్రాంత చీరలు నారాయణపేటనే బ్రాండ్ చాలా ప్రసిద్ధిగాంచినవని, నారాయణపేట అరుణ్య స్వచ్ఛంద సంస్థకు తాను బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటానని స్మితా సబర్వాల్ హామీ ఇచ్చారు. కాగా, అరుణ్య సంస్థను జిల్లా కలెక్టర్ నెలకొల్పారు. మహిళలు స్వయంగా తయారు చేసిన వివిధ రకాల వస్తువులు, ఫుడ్ ఐటమ్స్, చీరల డిజైనింగ్, ఇతరత్రా వస్తువులను ఈ సంస్థ ద్వారా ఆన్‌లైన్, ఆఫ్ లైన్‌లో విక్రయిస్తారు.
మహిళ వ్యాపారవేత్తలుగా ఎదగాలి
నారాయణపేట చీరలకు చాలా ప్రాముఖ్యత ఉందనీ, పాతకాలం చీరలు వయస్సు కలిగిన వాళ్లు ఎక్కుగా కడతారని ముద్ర ఉందని సీఎంఓ ప్రత్యేక అధికారిని (హరితహారం) ప్రియాంక వర్గీస్ అన్నారు. ఆ ముద్ర మీ ద్వారానే పోవాలని ఆశిస్తున్నానని ఆమె ఆకాంక్షించారు. కలంకారీ, బ్లాక్ ప్రింటింగ్ నేర్చుకున్న వాళ్లు నారాయణపేట నుంచి మంచి మహిళ వ్యాపారవేత్తలుగా ఎదగాలని కోరారు. పట్టణాలల్లో పెద్ద వస్త్రాలయాల్లో నారాయణపేట చీరలు ఉంటాయని కితాబు ఇచ్చారు. చదువు తరువాత యువతులు ఉద్యోగం వెతకోవాల్సిన అవసరం లేదన్నారు. కలెక్టర్ హరిచందన మహిళలకు చాలా అవకాశాలను కల్పించారని కొనియాడారు. మీరు తీసుకున్న శిక్షణల ద్వారా మీరే వ్యాపారాన్ని మొదలు పెట్టాలని ప్రియాంక వర్గీస్ సూచించారు.
నారాయణపేట మహిళలది ముందు వరుసే..
నారాయణపేట అంటే పాత కాలం వ్యవహారాలు ఉంటాయని అనుకునేవారని, కానీ ప్రభుత్వం నేర్పించే స్కిల్‌ను నేర్చుకోవడానికి మహిళలు ముందుకు వస్తున్నారని కలెక్టర్ డి.హరిచందన తెలిపారు. ప్రభుత్వం అందించే ప్రొత్సాహాన్ని ఇక్కడి మహిళలు అందిపుచ్చుకుంటున్నారని చెప్పారు. కలంకారీ శిక్షణ సందర్శన కంటే ముందు జిల్లా కేంద్రంలోని ధూల్ పేటలోనీ చిత్రీక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో చేనేత కార్మికులకు ఇస్తున్న ట్రైనింగ్‌ను ఐఏఎస్‌లు పరిశీలించి వారి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. చేనేత కార్మికుల వేతనాలు, చీరను నేయడానికి పట్టే సమయాన్ని, చీరలను తయారు చేసే విధానాన్ని (చీర నెస్ ప్రక్రియ)ను పరిశీలించారు. సాయంత్రం సుభాష్ రోడ్‌లోని వృద్ధాప్య ఆశ్రమ నిర్మాణ పనులను పరిశీలించారు.ఆదివారం రాత్రి భారం బావిని సందర్శించి స్మిత సబర్వాల్, ప్రియాంక వర్గీస్, కలెక్టర్ హరిచందనతో కలిసి చేపలకు ఆహారం వేశారు ఈ కార్యక్రమంలో ఎస్పీ వెంకటేశ్వర్లు, డీఆర్డీఓ గోపాల్, అసిస్టెంట్ డీఆర్డీఓ రాము నాయక్, మహిళ సమైఖ్య సభ్యులు తదితరులు పాల్గొన్నారు.