ఏపీఈఏపీ సెట్ షెడ్యూల్ విడుదల
దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో ఏపీఈఏపీ సెట్ షెడ్యూల్ - APEAP set schedule release
దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో ఏపీఈఏపీ సెట్ షెడ్యూల్ విడుదలైంది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఈ షెడ్యూల్‌ను బుధవారం విడుదల చేశారు. ఈ ఏడాది జూలై 4 నుండి 8వ తేదీ వరకు ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే జూలై 11,12 తేదీల్లో అగ్రికల్చర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 136 సెంటర్లలో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
గతంలోనూ 136 సెంటర్లలోనే పరీక్షలు నిర్వహించామని అవసరమైతే ఈసారి సెంటర్ల సంఖ్య పెంచుతామని తెలిపారు. అలాగే తెలంగాణలో కూడా నాలుగు పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పుకొచ్చారు. ఈ ఏడాది ఏప్రిల్ 11న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు.
ఆగష్టులో ఫలితాలు వెల్లడిస్తామని అనంతరం సెప్టెంబర్‌లో కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్టు మంత్రి తెలిపారు. ఐఐటీ, జేఈఈ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ఆధారంగా రెండు తెలుగు రాష్ట్రాలు తమ రాష్ట్రాల్లో ఎంసెట్ ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఐఐటీ, జేఈఈ ప్రవేశ పరీక్షల షెడ్యూల్స్ మార్పులు చేయడంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఇంటర్, టెన్త్ పరీక్షల షెడ్యూల్స్‌లో కూడా రెండు రాష్ట్రాలు మార్పులు చేసిన సంగతి తెలిసిందే.
ఇందులో భాగంగానే ఇంటర్ కంటే ముందే పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఇకపోతే గత ఏడాది నుంచి ఏపీ ప్రభుత్వం ఎంసెట్‌ను ఏపీఈఏపీ సెట్‌గా మార్చిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా మంగళవారం ఎంసెట్ ప్రవేశ పరీక్షలను విడుదల చేసిన సంగతి తెలిసిందే.