రాత్రి ఉష్టోగ్రతలతో పెరుగుతున్న మరణాలు.. స్టడీలో షాకింగ్ అంశాలు!
ఉమ్మడి కార్యచరణతో భవిష్యత్తులో వేడి ప్రభావాలను తగ్గించాలి. the risk of deaths due to hot night temperatures.
దిశ, వెబ్‌డెస్క్ః ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల్లో భానుడి వేడి సెగలు పుట్టించింది. అంతేకాదు, భవిష్యత్తులో రాబోయే ఎండ తీవ్రతకు ఇది ఒక సూచికలా అందర్నీ భయాందోళనలు గురిచేసింది. దీనికి ఆజ్యం పోస్తూ, ఇటీవల ఓ అంతర్జాతీయ అధ్యయనం 'ది లాన్సెట్ ప్లానెటరీ హెల్త్'లో ప్రచురించారు. ఈ అధ్యయనం ప్రకారం, భూమిపైన చోటుచేసుకుంటున్న వాతావరణ మార్పుల వల్ల రాత్రిపూట అధిక వేడి ఉష్ణోగ్రతలు ఏర్పడి, గ్రహం చుట్టూ మరణాల రేటును 60 శాతం పెంచుతాయని వెల్లడించారు. ఈ అధ్యయనాన్ని యునైటెడ్ స్టేట్స్, చైనా, జర్మనీ, జపాన్, దక్షిణ కొరియా, జపాన్ దేశాలకు చెందిన పరిశోధకుల బృందం కలిసి నిర్వహించారు. వేడి రాత్రుల ప్రభావాన్ని, పెరిగిన మరణాల ప్రమాదాన్ని అంచనా వేయడంలో ఇది మొదటి అధ్యయనంగా పేర్కొటున్నారు.
ఇక, ఈ అధ్యయనం కోసం పరిశోధకులు 1980 నుండి 2015 వరకు 35 సంవత్సరాల కాలంలో చైనా, దక్షిణ కొరియా, జపాన్‌లోని 28 నగరాల్లో తీవ్రమైన వేడి పరిస్థితుల కారణంగా సంభవించిన మరణాలను అధ్యయనం చేశారు. తర్వాత, ఈ ఫలితాలను రెండు వాతావరణ మార్పు మోడల్స్‌తో అనుసంధానించి పరిశీలించారు. సదరు మోడల్స్ ఫలితాలు 2016-2100 మధ్య, అధిక వేడి రాత్రుల కారణంగా మరణాల ప్రమాదం 60 శాతం పెరగవచ్చని వివరించాయి. "మా అధ్యయనంలో, రోజువారీ సగటు ఉష్ణోగ్రత మార్పుల కంటే ఎక్కువ వేడి రాత్రి (HNE) సంభవించడం చాలా వేగంగా జరుగుతుందని కనుగొన్నాము. రోజువారీ సగటు ఉష్ణోగ్రతలో సంభవించే 20 శాతం కంటే తక్కువ పెరుగుదలతో పోలిస్తే, వేడి రాత్రుల ఫ్రీక్వెన్సీ, వరుసుగా 2100 సంవత్సరం వరకూ సగటు తీవ్రత 30%, 60% కంటే ఎక్కువ పెరుగుతున్నట్లు తెలుస్తుంది" అని ఈ అధ్యయనంలో పాల్గొన్న UNC గిల్లింగ్స్ స్కూల్ ఆఫ్ గ్లోబల్ పబ్లిక్ హెల్త్ శాస్త్రవేత్త వ్యాఖ్యానించారు.
పెరిగిన రాత్రి ఉష్ణోగ్రతలు, పరిసరాల వేడి అనేవి ఒక వ్యక్తి నిద్రకు సంబంధించిన శరీరధర్మానికి అంతరాయం కలిగించవచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. నిద్రలేమి వల్ల నేరుగా రోగనిరోధక వ్యవస్థ దెబ్బతినడం, హృదయ సంబంధ వ్యాధులు, అనేక ఇతర మానసిక ఆరోగ్య పరిస్థితుల వంటి సమస్యలకు దారితీస్తుందని వెల్లడించారు. కనుక, ప్రభుత్వం, విధాన నిర్ణేతలు కలిసి, ఇంట్రా-డే ఉష్ణోగ్రత వైవిధ్యాలతో కలిగే అదనపు ఆరోగ్య ప్రభావాలను పరిగణనలోకి తీసుకోవాలని, సమస్యను పరిష్కరించే విధంగా వ్యవస్థలను రూపొందించాలని అధ్యయనం సూచించింది. స్థానికంగా, భవిష్యత్ హీట్‌వేవ్ హెచ్చరిక వ్యవస్థను రూపొందించేటప్పుడు రాత్రి సమయంలో వేడిని పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు. ముఖ్యంగా, తక్కువ-ఆదాయ వర్గాలు ఎయిర్ కండిషనింగ్ లాంటి అదనపు ఖర్చును భరించలేరు గనుక, వారి విషయంలో ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. అలాగే, బలమైన ఉపశమన వ్యూహాలు, ప్రపంచ దేశాల సహకారాల వంటి ఉమ్మడి కార్యచరణతో భవిష్యత్తులో వేడి ప్రభావాలను తగ్గించాలి" అని మరొక పరిశోధకుడు పేర్కొన్నారు.