ఆ చేపకు మనిషి మూతి.. విచిత్ర జీవి కలకలం! (వీడియో)
ఈ అసాధారణ జీవి చాలా మందిని గందరగోళానికి గురి చేసింది. 'Alien' Creature With Human Lips Washes up on Australian Beach
దిశ, వెబ్‌డెస్క్ః జీవ పరిణామ సిద్ధాంతం గురించి చాలా మందికి తెలిసే ఉండొచ్చు. సైన్స్ మాత్రమే సృష్టికి మూలమని నమ్మేవారికి ఇది ఎంతో ఆసక్తికరంగానూ ఉంటుంది. ఓ ప్రాణి మరో ప్రాణి నుండి ఉద్భవించడం ఒక అద్భుతమైన పరిణామ క్రమం. సింపుల్‌గా చెప్పాలంటే కుళ్లిన పదార్థం నుండి పురుగులు పుట్టడం లాంటిదే! ఇక, భూమిపైన అయితే నీటి నుండే జీవులు పుట్టాయనీ, సముద్రమే ప్రాణం పుట్టకకు మూలమనే సిద్ధాతం ఉంది. అందుకేనేమో, సముద్ర గర్భంలో మానవుని రూపురేఖలతో మెదిలే జీవులు అప్పుడప్పుడు బయటపడుతుంటాయి. మనిషిలాంటి మత్స్య కన్యలు కథల గురించి అటుంచితే, మనిషిలాంటి పళ్లు, పెదాలు ఉన్న చేపలు ఇప్పటికే మనకి తెలుసు. అయితే, కొత్తగా మనిషిలాంటి మూతి ఉన్న ఓ సముద్ర జీవి ఆస్ట్రేలియాలోని బోండి బీచ్‌లో కనిపించింది. ఈ అసాధారణ జీవి చాలా మందిని గందరగోళానికి గురి చేసింది.
డ్రూ లాంబెర్ట్ అనే వ్యక్తికి కనిపించిన ఈ జీవిని అతడు వీడియో తీసి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసాడు. మనిషి లాంటి పెదవులు, సొరచేప వంటి చర్మంతో అర మీటర్ పొడవు ఉన్న ఈ జీవిని ఇంతవరకు ఎప్పుడూ చూడలేదని చాలా మంది ఈ వీడియోకు స్పందించారు. ఈ జీవికి ఉన్న తోక, చర్మం చూసి మొదట అది సొరచేప అని అనుకున్నారు. కానీ దానికి డోర్సల్ ఫిన్ లేకపోవడం, నోరు దిగువ భాగంలో ఉండటం వల్ల విచిత్రంగా తోచింది. దీనిని 'రే ఫిష్' అని కొందరు, 'హార్న్ షార్క్' అని కొందరు అంటున్నారు. ఏదేమైనా సృష్టిలో ఇలాంటి విచిత్రాలు అనంతమని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.