ఛంఢీగఢ్: డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శిరోమణి అకాలీదళ్ నేత విక్రం సింగ్ మజితియా గురువారం మొహాలీ కోర్టు ముందు లొంగిపోయారు. వెంటనే బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా మార్చి 8 వరకు కోర్టు జ్యుడీషియల్ కస్టడీకి పంపించింది. రాష్ట్రంలో డ్రగ్స్ రాకెట్‌లో పాలుపంచుకున్నారనే ఆరోపణలతో ఆయనపై నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబస్టాన్సెస్(ఎన్డీపీఎస్) చట్టం కింద డిసెంబర్‌లో కేసు నమోదు చేశారు. అయితే కోర్టు జనవరిలో ఆయనకు మంజూరు చేసిన ముందస్తు బెయిల్‌ను కొట్టివేసింది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అంతకుముందు సుప్రీంకోర్టు ఆయనకు అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ ఆదేశాలు ఇచ్చింది. తాజాగా గురువారంతో ఈ గడువు ముగిసింది. కాగా, విక్రం సింగ్ కాంగ్రెస్ అభ్యర్థి నవజ్యోత్ సింగ్ సిద్ధూపై బరిలోకి దిగారు. ఈ నెల 20న పంజాబ్ పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే.