Adani Green Energy: ఎనిమిదో అత్యంత విలువైన కంపెనీగా అదానీ గ్రీన్ ఎనర్జీ!
న్యూఢిల్లీ: గౌతమ్ అదానీకి చెందిన ప్రముఖ అదానీ గ్రూప్ అనుబంధ అదానీ గ్రీన్ ఎనర్జీ..telugu latest news
న్యూఢిల్లీ: గౌతమ్ అదానీకి చెందిన ప్రముఖ అదానీ గ్రూప్ అనుబంధ అదానీ గ్రీన్ ఎనర్జీ కంపెనీ బుధవారం దేశంలోనే ఎనిమిదో అత్యంత విలువైన సంస్థగా నిలిచింది. రూ. 4.48 లక్షల కోట్ల మార్కెట్ విలువతో కంపెనీ బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీని అధిగమించి ఈ స్థానాన్ని దక్కించుకుంది. అదానీ గ్రీన్ ఎనర్జీ ఈ వారంలో టాప్-10 విలువైన సంస్థల జాబితాలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే.
బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ విలువ రూ. 4.43 లక్షల కోట్లు కాగా, హెచ్‌డీఎఫ్‌సీ రూ. 4.31 లక్షల కోట్ల విలువతో తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్లు ఏకంగా 115.75 శాతం ర్యాలీ చేయడం గమనార్హం. కాగా, రూ. 17.26 లక్షల కోట్లతో దేశంలోనే అత్యంత విలువైన సంస్థగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అగ్ర స్థానంలో కొనసాగుతోంది. దీని తర్వాత ఐటీ సేవల సంస్థ టీసీఎస్ రూ. 13.39 లక్షల కోట్లతో రెండో స్థానంలో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రూ. 8.12 లక్షల కోట్లతో, ఇన్ఫోసిస్ రూ. 7.35 లక్షల కోట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
ఇక, ఐసీఐసీఐ బ్యాంక్ రూ. 5.29 లక్షల కోట్లు, హిందుస్థాన్ యూనిలీవర్ రూ. 5.05 లక్షల కోట్లు, ఎస్‌బీఐ రూ. 4.61 లక్షల కోట్లు, అదానీ గ్రీన్ ఎనర్జీ రూ. 4.48 లక్షల కోట్లు, బజాజ్ ఫైనాన్స్ రూ. 4.36 లక్షల కోట్లు, హెచ్‌డీఎఫ్‌సీ రూ. 4.31 లక్షల కోట్లతో టాప్-10 అత్యంత విలువైన కంపెనీలుగా ఉన్నాయి.