Telangana News: ఆప్ యాక్షన్ ప్లాన్ షురూ.. రంగంలోకి కేజ్రీవాల్
దిశ, తెలంగాణ బ్యూరో : పంజాబ్‌లో గెలుపు జోష్‌లో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు తన ఫోకస్‌ను..latest telugu news
దిశ, తెలంగాణ బ్యూరో: పంజాబ్‌లో గెలుపు జోష్‌లో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు తన ఫోకస్‌ను దక్షిణ రాష్ట్రాలపై పెట్టింది. అందులోనూ తెలంగాణపై పూర్తి స్థాయిలో దృష్టి సారించనుంది. పార్టీని బలోపేతం చేసేందుకు నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా పాదయాత్రకు శ్రీకారం చుట్టింది. 'మహా పాదయాత్ర.. మార్పు కోసం మొదటి అడుగు' అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లనున్నారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 14వ తేదీన ఈ యాత్రను ప్రారంభించనున్నారు. ఈ యాత్ర ప్రారంభోత్సవానికి ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపకుడు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హాజరయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
గ్రేటర్ పరిధిలోని 25 ప్రాంతాల్లో ఈ యాత్రను చేపట్టనున్నారు. అనంతరం జిల్లాల వారీగా పాదయాత్రలు చేపట్టనున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. ట్యాంక్ బండ్ సమీపంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం ఈ యాత్ర ప్రారంభం కానుంది. గ్రేటర్ పరిధిలోని ఒక్కో నియోజకవర్గంలో మూడు నుంచి నాలుగు రోజుల పాటు యాత్ర చేపట్టనున్నారు. ప్రజల సమస్యలను తెలుసుకోనున్నారు. తొలివిడుతలో భాగంగా గ్రేటర్లో చేపట్టే ఈ యాత్ర దాదాపు మూడు నెలల పాటు కొనసాగనుంది.
పాదయాత్ర చేపట్టే ప్రాంతాలివే..
గగన్ మహల్ అంబేద్కర్ విగ్రహం నుంచి ప్రారంభమయ్యే ఈ పాదయాత్ర ముషీరాబాద్, సికింద్రాబాద్, అంబర్‌పేట, ఖైరతాబాద్, నాంపల్లి, జూబ్లీహిల్స్, సనత్‌నగర్, కూకట్పల్లి, సికింద్రాబాద్కంటోన్మెంట్, కుత్బుల్లాపూర్, మల్కాజ్గిరి, ఉప్పల్, ఎల్బీనగర్, మేడ్చల్, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, చేవెళ్లే, మలక్‌పేట, కార్వాన్, గోషామహల్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, బహదూర్‌పుర గుండా సాగనుంది. అనంతరం చేపట్టే జిల్లాల పాదయాత్రను ఉమ్మడి వరంగల్ నుంచి ప్రారంభించనున్నారు.