'ఆప్' యాక్షన్ షూరు.. తొలిసారిగా తెలంగాణకు వచ్చిన కీలక నేత
దిశ, తెలంగాణ బ్యూరో: ఎన్నో త్యాగాలతో కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఉద్యమకారుల- LATEST TELUGU NEWS
దిశ, తెలంగాణ బ్యూరో: ఎన్నో త్యాగాలతో కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఉద్యమకారుల ఆంక్షాలు, ఆశలు నెరవేరలేదని ఆమ్ ఆద్మీ పార్టీ దక్షిణ భారత ఇన్‌చార్జి సోమ్‌నాధ్ భారతి ఆరోపించారు. పేదలకు విద్య దూరమైందని, వైద్యం భారమైందన్నారు. అమరుల కుటుంబాలను గడప గడపకూ వెళ్ళి కలుస్తామని, ఆదుకుంటామనే భరోసా కల్పిస్తామన్నారు. తొలిసారి తెలంగాణ పర్యటనకు వచ్చిన ఆయన శంషాబాద్ విమానాశ్రయం నుంచి భారీ స్థాయి కార్యకర్తలు, వాలంటీర్లతో కలిసి ర్యాలీగా గన్‌పార్కు అమరవీరుల స్థూపం దగ్గరికి చేరుకుని నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రాణ త్యాగం చేసిన అమరుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వంలో న్యాయం జరగలేదన్నారు.
పంజాబ్ రాష్ట్రంలో ప్రజల ఆశీర్వాదంతో గెలిచామని, విజయోత్సవ ర్యాలీని తెలంగాణలోనూ జరుపుకున్నామన్నారు. విమానాశ్రయం చేరుకున్న ఆయనకు రాష్ట్ర సెర్చ్ కమిటీ చైర్‌పర్సన్ ఇందిరాశోభన్ సహా వందలాది మంది 'ఆప్' కార్యకర్తలు స్వాగతం పలికారు. ఏడేళ్ల టీఆర్ఎస్ పాలనలో లక్ష్య సాధనను ప్రభుత్వం విస్మరించిందని సోమ్‌నాధ్ భారతి ఆరోపించారు. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలు, ఉద్యమ లక్ష్యాలు పక్కకు పోయాయన్నారు. కేసీఆర్ పాలనలో రైతులు నష్టపోయారని, విద్యార్థులు మోసపోయారన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కనుమరుగైందన్నారు. స్కూళ్ల మూసివేత, కాంట్రాక్టు కార్మికుల తొలగింపు, ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటు లాంటి అనేక రాజ్యాంగ విరుద్ధ కార్యక్రమాలకు ప్రభుత్వం పాల్పడిందని ఆరోపించారు. వ్యాపార రాజకీయాలకు తెలంగాణ కేంద్రంగా మారిందని, టీఆర్ఎస్ పాలన ఏ తీరులో ఉందో అద్దం పడుతున్నదని విమర్శించారు.
సబ్బండ వర్ణాలు కలిసి సాధించుకున్న తెలంగాణలో అధికారం, అభివృద్ధి ఒకట్రెండు సామాజికవర్గాల చేతుల్లో బందీ అయిందని ఆందోళన వ్యక్తంచేశారు. కులం, అవినీతి రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్నాయని వాపోయారు. 'సామాన్యుడికే అధికారం' అనే నినాదంతో వస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీని అక్కున చేర్చుకోవాలని తెలంగాణ ప్రజానీకానికి విజ్ఞప్తి చేశారు. త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ పునర్నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన సమయం వచ్చిందన్నారు. మహిళలు, యువత, మేధావులు, విద్యావంతులు ఈ మహాయజ్ఞంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సామాజిక చైతన్యానికి, కొత్త రాజకీయ ఒరవడికి నాంది పలికే ఆమ్ ఆద్మీ పార్టీని ఆదరించాలని కోరారు.
రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆమ్ ఆద్మీ పార్టీలోకి ఇందిరాశోభన్ ఆధ్వర్యంలో చేరికలు ఉంటాయన్నారు. అన్నీ సెక్షన్ల ప్రజలు పోరాడినా రాష్ట్రం కొందరి తెలంగాణగానే మారిందని సెర్చ్ కమిటీ చైర్‌పర్సన్ ఇందిరాశోభన్ ఆరోపించారు. ఏడేళ్ల కేసీఆర్ పాలనలో రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగుల ఆత్మహత్యలు పెరిగిపోయాయన్నారు. ల్యాండ్, శాండ్ మాఫియా పెరిగిపోయిందన్నారు. ప్రాజెక్టుల పేరుతో దళితులు, పేద రైతుల భూములను ప్రభుత్వం లాక్కున్నదని, బినామీలు, బడా కాంట్రాక్టుల పేరుతో అధికార పార్టీ నేతలు జేబులు నింపుకున్నారని అన్నారు. ధరణి పేరుతో వేలాది ఎకరాల భూమి కబ్జా అయిందన్నారు. అవినీతి పాలనతో విసిగిపోయిన ప్రజలు కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ వైపు చూస్తున్నారని తెలిపారు.