అమెరికాలో మంత్రి మల్లారెడ్డిని ఘోరంగా అవమానించిన మహిళా నేత
తెలంగాణ మంత్రి మల్లారెడ్డికి దేశం దాటి పోయినా అవమానాలు తప్పడం లేదు. తాజాగా అమెరికాలో ఆటా సభలో పాల్గొన్న మంత్రికి కాంగ్రెస్ మహిళా నేత చెడుగుడు ఆడుకున్నారు.
దిశ, వెబ్డెస్క్: తెలంగాణ మంత్రి మల్లారెడ్డికి దేశం దాటి పోయినా అవమానాలు తప్పడం లేదు. తాజాగా అమెరికాలో ఆటా సభలో పాల్గొన్న మంత్రికి కాంగ్రెస్ మహిళా నేత చెడుగుడు ఆడుకున్నారు. అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) సభలో భవానిరెడ్డి మాట్లాడుతూ మంత్రి మల్లారెడ్డి స్టేజీపై ఉండగానే ఆయనపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ జాతిని టీఆర్ఎస్ సర్వ నాశనం చేసిందని ఆరోపించారు. అక్కడ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ ఇక్కడకు వచ్చి గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. కార్మిక శాఖ మంత్రిగా మల్లారెడ్డి 2019 ఫిబ్రవరిలో ఛార్జి తీసుకున్నారని అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్క రివ్యూ మీటింగ్ కూడా నిర్వహించలేదని విమర్శించారు. వేదికలపై మైకుల ముందు ప్రసంగిచే మల్లారెడ్డి.. ఇప్పటి వరకు ఒక్క రివ్యూ కూడా చేపట్టలేకపోవడం శోచనీయం అన్నారు.
ప్రభుత్వం రూ.200 ప్రీమియం కట్టకపోవడంతో 10 లక్షల మంది కార్మికులు ఎఫెక్ట్ అయ్యారని వారంతా చనిపోతే ఎవరూ బాధ్యులని ప్రశ్నించారు. ఇక్కడికి వచ్చి అది చేశాం.. ఇది చేశామని గొప్పలు చెప్పడం కాదని.. కార్మిక శాఖ కుంటుపడిపోయిందని, ముందు దాన్ని సరి చేయాలని సూచించారు. కార్మిక శాఖకు ఇప్పటి వరకు కమిషనర్ లేరని, డిప్యూటేషన్ మీద వచ్చిన వ్యక్తి కమిషనర్ గా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. మన వద్ద ఐఏఎస్ లు లేరా అని ప్రశ్నించారు. నిండు సభలో భవాని రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.
కాగా మంత్రి మల్లారెడ్డికి వరుస అవమానాలు ఆ పార్టీలో చర్చనీయాంశం అవుతోంది. ఇటీవల రెడ్డి కార్పొరేషన్ విషయంలో రెడ్డి సభలో మంత్రిపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా మేడ్చల్ మండలం రాయిలపూర్ గ్రామంలో ఏకగ్రీవ పంచాయతీలకు ఇస్తానన్న రూ.25 లక్షల నజరానా ఇంకెప్పుడు ఇస్తారని మల్లారెడ్డిని స్థానిక నాయకుడు ఒకరు నిలదీసిన వైనం వైరల్ గా మారింది. తాజాగా అమెరికాలోని వాషింగ్టన్‌లోనూ అవమానకర రీతిలో వ్యవహారం సాగడం హాట్ టాపిక్ అవుతోంది.
మల్లారెడ్డి కి మూడు చెరువుల నీళ్ళు తాగించిన మన సిద్దిపేట కాంగ్రెస్ నాయకురాలు భవాని రెడ్డి గారు.. pic.twitter.com/6AfrKiM3It
— Telangana Congress (@INCTelangana) July 4, 2022