హైదరాబాద్‌లో మరో అద్భుతం.. మే 2వ తేదీతో ఆఖరు
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది.
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఇప్పటికే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న భాగ్యనగరంలో మరో అబ్బురపరిచే నిర్మాణం జరుగనుంది. ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టడంతో పాటు పర్యాటకులను ఆకట్టుకునేలా జూబ్లీహిల్స్‌లోని కాసు బ్రహ్మానందరెడ్డి జాతీయ ఉద్యానవనం (కేబీఆర్ పార్కు) కింది నుంచి సొరంగం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలెట్టింది. నగరంలోని పలు ప్రాంతాల నుంచి ఐటీ కారిడార్‌లకు సులువుగా రాకపోకల కోసం, పర్యాటకులను ఆకర్షిస్తున్న దుర్గం చెరువు కేబుల్ వంతెనకు కొనసాగింపుగా ఈ ప్రాజెక్టును తెరపైకి తీసుకొచ్చారు. దీని నిర్మాణానికి ఇటీవల టెండర్ నోటిఫికేషన్ ప్రకటించగా.. మూడు సంస్థలు హాజరయ్యాయి.
కాగా, ఈ ప్రాజెక్ట్ వాస్తవరూపం దాల్చితే దేశంలోనే రెండో అతి పెద్ద సొరంగం కానుంది. జూబ్లీహిల్స్ రోడ్ నం.45 నుంచి కేబీఆర్ పార్కు ప్రవేశ ద్వారం వరకు 1.70 కిలోమీటర్లు, కేబీఆర్ పార్కు నుంచి ఎన్‌ఎఫ్‌సీఎల్ జంక్షన్ వరకు 2 కిలోమీటర్లు, బంజారాహిల్స్ రోడ్ నం.12 టన్నెల్ జాయినింగ్ పాయింట్ 1.10 కి.మీ., అప్రోచ్ రోడ్లు- 1.50 కి.మీ. కలిపి మొత్తం 6.30 కి.మీ. మేర సొరంగం నిర్మించనున్నారు. నాలుగు వరుసలుగా చేపట్టబోయే ఈ నిర్మాణానికి సుమారు రూ.5 వేల కోట్ల వ్యయం అవుతుందని జీహెచ్ఎంసీ అంచనా వేసింది. మే 2వ తేదీ వరకు బిడ్ దాఖలు చేసే అవకాశముంది. ఈ ప్రాజెక్ట్ వాస్తవ రూపం దాల్చితే దేశంలోనే రెండో అతి పెద్ద సొరంగం కానుంది.