సీఎం కేసీఆర్‌కు కొత్త సమస్య.. కథ అడ్డం తిరుగుతోందా?
దిశ, వెబ్‌డెస్క్: సీఎం కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్న దాని వెనుక రాజకీయ ఎత్తుగడ ఉంటుందనేది రాజకీయ వర్గాల్లో ఉన్న అభిప్రాయం.
దిశ, వెబ్‌డెస్క్: సీఎం కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్న దాని వెనుక రాజకీయ ఎత్తుగడ ఉంటుందనేది రాజకీయ వర్గాల్లో ఉన్న అభిప్రాయం. ప్రతిపక్షాలను ఇరుకున పెడుతూ తనకు అనుకూలంగా గేమ్ ఛేంజ్ చేసుకోవడంలో కేసీఆర్‌కు మంచి పట్టు ఉందనే నిరూపణలు ఎన్నో ఉన్నాయి. అయితే, తాజాగా కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో సరికొత్త డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి. ఇది చివరకు టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇబ్బందిగా మారనుందా? అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్రంలో నూతనంగా మరో 13 మండలాలను ఏర్పాటు చేసినట్టు శనివారం ప్రభుత్వం ప్రకటించింది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మండలాల ఏర్పాటుపై ఉత్తర్వులు జారీ చేశారు. ఇంత వరకు బాగానే ఉన్న ఇప్పుడీ అంశం టీఆర్ఎస్‌కు కొత్త టెన్షన్స్ తెచ్చిపెట్టేలా ఉంది.
టీఆర్ఎస్ కొంప ముంచిన ఆ ఒక్క మండలం:
శనివారం ప్రభుత్వం ప్రకటించిన 13 నూతన మండలాల్లో మునుగోడు నియోజకవర్గానికి చెందిన గట్టుప్పల్ మండలం ఒకటి. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమికి గట్టుప్పల్ మండలమే కారణం అనేది టీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి బీజేపీలోకి చేరుతారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో గట్టుప్పల్ మండలాన్ని కేసీఆర్ సర్కార్ ప్రకటించడం దుమారం రేపుతోంది. ఈ అంశంపై ప్రభుత్వ ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఉప ఎన్నిక వస్తుందనే భయంతోనే హుటాహుటిన ప్రభుత్వం గట్టుప్పల్ మండలాన్ని ప్రకటించిందని కేవలం ఒక్క మండలాన్నే ప్రకటిస్తే విమర్శలు వస్తాయనే కారణంతో రాష్ట్రంలో మిగతా చోట్ల ఉన్న డిమాండ్లను పరిగణలోకి తీసుకుని మొత్తం 13 నూతన మండలాలను ప్రకటించిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ అంశంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని టీఆర్ఎస్ నేతలు సంబురాలు చేసుకుంటుండగా మరోవైపు నుండి నిరసనల సెగ రాజుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది.
తెరపైకి మరి కొన్ని మండలాల డిమాండ్లు:
రాష్ట్రంలో నూతన మండలాల ఏర్పాటుతో మరికొన్ని చోట్ల కొత్త మండలాల ఏర్పాటు కోసం డిమాండ్లు వస్తున్నాయి. గతంలో హామీ ఇచ్చిన మేరకు తమ గ్రామాలను కూడా మండలాలుగా చేయాలని ఆదివారం ఆందోళనలు జరిగాయి. జగిత్యాల రంగారెడ్డి, నల్గొండ జిల్లాలో ఈ ఆందోళనలు కొనసాగాయి. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఒడ్దెలింగాపూర్ గ్రామాన్ని మండలంగా మండలం చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్థులు రాస్తారోకో చేశారు. సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవిత హామీని నిలబెట్టుకోవాలని అన్నారు. అలాగే నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని అమ్మనబోలును మండలంగా మార్చాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ప్రజల ఆకాంక్ష మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఉద్యమకారుడు, రైతు సమన్వయ సమితి గ్రామశాఖ అధ్యక్షుడు పార్టీకి, తన పదవులకు రాజీనామా చేయడం కలకలం రేపింది. అలాగే రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండలం మొగిలిగిద్ద గ్రామాన్ని కూడా మండల కేంద్రం చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. దీంతో 13 మండలాలను ఏర్పాటు చేస్తూ కేసీఆర్ తీసుకున్న తాజా నిర్ణయం మండలాల ఏర్పాటు డిమాండ్ ఉన్న చోట్ల టీఆర్ఎస్‌కు ఇబ్బందికరంగా మారిందనే టాక్ వినిపిస్తోంది. పుట్టుకొస్తున్న కొత్త డిమాండ్లను టీఆర్ఎస్ బాస్ కేసీఆర్ ఎలా పరిష్కరిస్తారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.